ఏపీ మాజీ మంత్రి, టీడీపీ ఫైర్ బ్రాండ్ భూమా అఖిలప్రియ పరిస్థితి ఆగమ్యగోచరంగా ఉంది. ఆమె ఈ సారి పోటీ చేయాలా వద్దా అన్న అనుమానాలు నెలకొన్నాయి. చంద్రబాబు ఆమెకు టికెట్ ఇస్తారా.. లోకేష్ ఆమెకు అనుకూలంగా మాట్లాడతారా.. అన్నది ప్రశ్నార్థకమే అవుతుంది. పైగా ఎన్నికల్లో ఖర్చు పెట్టుకునేందుకు ఆమె దగ్గర డబ్బులేదన్న ప్రచారం జరగడంతో పార్టీ కూడా అంత సానుకూలంగా లేదని చెబుతున్నారు… ఇప్పుడు చంద్రబాబు వస్తున్నారంటే అఖిలప్రియకు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయట..
తెలుగుదేశం పార్టీలో ఎన్నికల వేడి మొదలైంది. ఫిబ్రవరి ఆఖరుకు నోటిఫికేషన్ వస్తుందన్న విశ్వసంతో పార్టీ అధినేత చంద్రబాబు కార్యకర్తలను సమాయత్తం చేస్తున్నారు. తాను సైతం జనంలో ఉంటేనే పార్టీ శ్రేణులకు ధైర్యం వస్తుందని విశ్వసిస్తున్నారు. ఇటీవలే ఆయన మూడు రోజుల కుప్పం పర్యటన విజయవంతమైంది.ఇక జనవరి నెల మొత్తం టూర్ వేసేందుకు చంద్రబాబు సిద్ధమవుతున్నారు. ఈ ఒక్క నెలలోనే రాష్ట్రంలో 25 బహిరంగ సభలు నిర్వహించాలని ఆయన తలపెట్టారు. ఒక్కో పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ఒక్కో అసెంబ్లీ స్థానంలో ఈ సభలు జరుగుతాయి. ఇందులో మొదటి సభ ప్రకాశం జిల్లా కనిగిరిలో ఈ నెల ఐదో తేదీన జరగనుంది. ఆఖరి సభను ఈ నెల 29వ తేదీన నిర్వహించబోతున్నారు. పూర్తి షెడ్యూల్ ఇంకా రాలేదు. 7న ఉమ్మడి కృష్ణా జిల్లా తిరువూరు, గుడివాడ, 9న ఉమ్మడి కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ, 11న నరసరావుపేట తదితర ప్రాంతాల్లో సభలు నిర్వహించ తలపెట్టారు.
చంద్రబాబు ప్రసంగించబోయే బహిరంగ సభల్లో ఒకప్పుడు భూమా అఖిలప్రియ ప్రాతినిధ్యం వహించిన ఆళగడ్డ కూడా ఉండటంతో అఖిలప్రియ రాజకీయ భవిష్యత్తుపై అందరి దృష్టి పడింది. ఆమెకు టికెట్ ఖాయమైనట్లేనా అని చర్చించుకుంటున్నారు.అయితే టికెట్ పై అఖిలప్రియకే అనుమానాలు ఉన్నాయని కూడా చెబుతున్నారు..
తణుకు, గుడివాడ, నరసారావుపేటలో టీడీపీ అభ్యర్థులకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కానీ ఆళ్లగడ్డలో టీడీపీ ఇన్‌చార్జ్ భూమా అఖిలప్రియకు చంద్రబాబు టికెట్ ఖరారు చేయలేదు. దీంతో లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి సభను విజయవంతం చేయడానికి అఖిలప్రియ సుముఖంగా లేనట్టు తెలిసింది. ఇదే అదునుగా భావించి అఖిలప్రియ టీడీపీ అధిష్టానంపై ఒత్తిడి పెంచుతున్నారని కూడా చెబుతున్నారు.
తనకు టికెట్ ఖరారు చేస్తే, 9న నిర్వహించే సభకు డబ్బు ఖర్చు పెడతానని ఆమె షరతు విధించినట్లుగా తెలుస్తోంది. మూడు నెలల క్రితం నంద్యాలలో చంద్రబాబు సభకు ఇన్‌చార్జ్ భూమా బ్రహ్మానందరెడ్డితో ఖర్చు పెట్టించి, ఆ తర్వాత మాజీ మంత్రి ఎన్ఎండీ ఫరూక్‌కు టికెట్ ఖరారు చేసిన విషయాన్ని అఖిలప్రియ గుర్తు చేస్తున్నారు. టికెట్ ఇచ్చే ఉద్దేశం లేనప్పుడు తానెందుకు 60 నుంచి 70 లక్షలు ఖర్చు పెట్టుకుని అప్పులు పాలు కావాలని ఆమె ప్రశ్నించారని సమాచారం. ఇప్పటికే ఆమెకు విపరీతంగా అప్పులు ఉన్నాయని ఉమ్మడి కర్నూలు జిల్లాలో టాక్ నడుస్తోంది. ఆళగడ్డ మీటింగ్ పై అఖిలప్రియ కామెంట్స్ నేరుగా నారా లోకేష్ కు చేరినట్లు తెలుస్తోంది. పరిస్థితిని ఆయన వాకబు చేశారు.టికెట్ ఇస్తే ఖర్చులకు ఆమె డబ్బులు ఎక్కడ నుంచి తెస్తారన్న చర్చ కూడా మొదలైంది. దానితో ఇప్పుడు అఖిలప్రియ వ్యవహారం అడకత్తెరలో పడిన పోకచెక్కలా తయారైంది..
అఖిలప్రియ అనుచరులు మాత్రం అప్పులకు, టికెట్ కు సంబంధమేమిటని ప్రశ్నిస్తున్నారు. ఎవరితోనైనా గేమ్ ఆడొచ్చు కానీ భూమా ఫ్యామిలీతో కుదరదని వాళ్లు చెబుతున్నారు. అయితే ఆళగడ్డ సీటును పొత్తు భాగస్వామికి ఇస్తే ఎలా ఉంటుందున్న చర్చ కూడా టీడీపీ వర్గాల్లో వినిపిస్తోంది..
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…