ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ నియోజకవర్గాల్లో ఒకటి పాయకరావుపేట. రిజర్వుడు నియోజకవర్గం అయినా బలమైన నేతలు పోటీ పడే స్థానం. టీడీపీ నుంచి ఈ సారి వంగలపూడి అనిత పోటీ చేయడం ఖాయమయింది. తాజాగా వైసీపీ అభ్యర్థిని మార్చింది. శ్రీకాకుళం రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులును ఇక్కడ నియమించారు. ఈ నియామకం కాస్త ఆశ్చర్యకరమైనా పోటీ మాత్రం గట్టిగా ఉండే అవకాశం కనిపిస్తోంది. మరి అభ్యర్థి మార్పు వైసీపీకి కలసి వస్తుందా ?
ఏపీ రాజకీయాల్లో హాట్ సీట్ పాయకరావుపేట. ఎస్సీ నియోజకవర్గమైనా ఇక్కడ రాజకీయం ఎప్పుడూ ఉత్కంఠభరితంగానే ఉంటుంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలపై గ్రూపులు కట్టడం ఈ నియోజకవర్గంలో చాలా కామన్. అధికార వైసీపీ అయినా.. ప్రతిపక్ష టీడీపీ అయినా.. ఎమ్మెల్యేలకు ముప్పతిప్పలు పెట్టే ద్వితీయశ్రేణి నాయకులకు కొదవే లేదు. ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం కావడంతో ఇతర సామాజిక వర్గ నేతల జోక్యం ఎక్కువగా ఉంటోంది. ఈ పరిస్థితి ప్రతీ ఎమ్మెల్యేకూ ఉంటుంది. ఈ కారణంగా ఇక్కడ గెలిచిన నేతలకు రెండో సారి టిక్కెట్ కేటాయించడానికి పార్టీలు వెనుకడుగు వేస్తూంటాయి. చివరికి పాత అభ్యర్థుల్నే తెచ్చి నిలబెడుతూంటారు. ఈ సారి కూడా అదే జరుగుతోంది.
సిట్టింగ్ ఎమ్మెల్యే గొల్ల బాబూరావుకు వైసీపీ క్యాడర్ సపోర్టు లేదు. ఆయనను మార్చాల్సిందేనని పట్టుబట్టారు. జగన్ పార్టీ పెట్టినప్పటి నుండి ఆయన వెంటే ఉన్నారు బాబూరావు. 2014లో ఆయన పై వ్యతిరేకత ఉందని స్థానం మార్చారు. కానీ ఓడిపోవడంతో మళ్లీ పాయకరావుపేటకే తెచ్చారు. ఆయన గత ఎన్నికల్లో గెలిచారు. ఇదే పరిస్థితి టీడీపీ నేత వంగలపూడి అనితది కూడా. ఆమెను స్థానిక నేతలు వ్యతిరేకించడంతో గత ఎన్నికల్లో కొవ్వూరు నుంచి పోటీ చేయించారు. కానీ మిస్ ఫైర్ కావడంతో మళ్లీ పాయకరావుపేటకే ఇంచార్జిగా నియమించారు. ఇప్పుడు ఆమె టీడీపీ అభ్యర్థి అవుతున్నారు కానీ.. గొల్ల బాబూరావు మాత్రం స్థానిక క్యాడర్ రాజకీయంతో వెనుకబడిపోయారు. మళ్లీ టిక్కెట్ దక్కించుకోలేకపోయారు. ఆయన స్థానంలోకి శ్రీకాకుళం జిల్లాకు చెందిన కంబాల జోగులు వస్తున్నారు.
పాయకరావు పేట మెుదటి నుంచి టీడీపీకి కంచుకోట. 1983 నుంచి ఏడు సార్లు టీడీపీయే ఇక్కడ గెలిచిందింది అలాంటిది సైకిల్ జోరుకు బ్రేక్ వేసి తొలిసారి 2009లో కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచారు సిట్టింగ్ ఎమ్మెల్యే గొల్లబాబూరావు. ఆ తర్వాత జగన్‌కు మద్దతుగా 2012లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో పోటీ చేశారు. 2014లో అమలాపురం ఎంపీగా పోటీ చేసిన గొల్ల బాబూరావు ఆ ఎన్నికల్లో ఓడిపోయారు. 2019లో పాయకరావుపేట టిక్కెట్ తెచ్చుకుని.. వైసీపీ హవాలో టీడీపీ అభ్యర్థి బంగారయ్యపై ఘన విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో జగన్ ప్రభావం.. టీడీపీలో అనైక్యత బాబూరావుకి విజయాన్ని తెచ్చిపెట్టింది. ఐతే ఇప్పుడు సీన్ కాస్త మారిందని చెబుతున్నారు. అందుకే వైసీపీ అనూహ్యమైన నిర్ణయం తీసుకుంది. ఎవరూ ఊహించని పేరును తెరపైకి తెచ్చింది. గొల్ల బాబూరావును మార్చడం ఖాయమని తేలడంతో.. అక్కడ టిక్కెట్ కోసం మాజీ ఎమ్మెల్యే చెంగల వెంకట్రావు ,ఏపీ SC కార్పొరేషన్ చైర్పర్సన్ పెదపాటి అమ్మాజీ ప్రయత్నించారు. కానీ వీరెవరూ అనితను ఎదుర్కోలేరని నిర్ణయానికి వచ్చిన హైకమాండ్ కంబాల జోగులుకు చాన్సిచ్చింది.
గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గొల్ల బాబూరావు గెలిచినా.. ఆయన ప్రత్యర్థి మాత్రం అనిత కాదు.. 2014లో తొలిసారిగా గెలిచిన అనిత.. వాక్ చాతుర్యంతో తెలుగుదేశం పార్టీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఎమ్మెల్యేగా ఎన్నిక కాడానికి ముందు టీచర్‌గా పనిచేశారు అనిత. ఉన్నత విద్యావంతురాలు.. ఉద్యోగస్తురాలు కావడంతో టీడీపీ అధిష్టానం పిలిచి టిక్కెట్ ఇవ్వడంతో తొలిసారి ఎమ్మెల్యేగా అడుగుపెట్టారు అనిత. 2019 ఎన్నికల తర్వాత టీడీపీ ఓడిపోవడం.. ఆ తర్వాత తెలుగు మహిళా అధ్యక్షురాలిగా ఆమెకు బాధ్యతలు అప్పగించడంతో టీడీపీలో కీలక నాయకురాలిగా ఎదిగారు అనిత. ఇప్పుడు ఆమె ఏ నేత మద్దతు అవసరం లేకుండా నియోజకవర్గంలో స్వతంత్రంగా పనిచేసుకోగలగుతున్నారు. అధికార వైసీపీలో వర్గ విభేదాలు ఈ సారి అనితకు అనుకూలించే చాన్స్ ఉందని అంటున్నారు పరిశీలకులు. గత ఎన్నికల్లో అధిష్టానం కొవ్వూరుకు మార్చినా.. పార్టీ ఆదేశాన్ని శిరసావహించి అక్కడికి వెళ్లి పోటీ చేశారు అనిత. ఈసారి కొద్ది మంది నాయకులు ఆమెను వ్యతిరేకించినా పార్టీ అగ్రనాయకత్వంలో అనిత పరపతి ముందు.. వారి వ్యతిరేకత ఏమాత్రం పనిచేయదని అంటున్నారు. ప్రజల్లో అనిత పట్ల వ్యతిరేక లేకపోవడం.. టీడీపీకి పాయకరావుపేటలో గట్టి ఓటు బ్యాంకు ఉండటంతో అనితకే సానుకూలంగా పరిస్థితి కనిపిస్తోంది.
మహిళా నేతగా అనిత ఎన్ని ఇబ్బందులు పడాలో అన్నీ పడ్డారు. అన్నింటిని ఎదుర్కొని పోరాటం చేస్తున్నారు. ఇప్పుడు ఆమెకు పోటీగా దిగుమతి నేతను వైసీపీ సిద్ధం చేసింది. మరి పాయకరావుపేట ప్రజలు ఎవరికి ఓటేస్తారో తేలాల్సి ఉంది. అప్పటికి అయితే అనితకు అడ్వాంటేజ్ కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ గెలిస్తే ఆమెకు మంత్రి పదవి ఖాయమన్న ప్రచారం జరుగుతూండటం మరింత ప్లస్ పాయింట్…
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…