మిషన్ 2024 విజేతలెవరో – పార్టీలకు మంగళగిరి టెన్షన్ ?

By KTV Telugu On 8 January, 2024
image

KTV TELUGU :-

నారా లోకేష్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుస్తారా. మంగళగిరి ఓటమికి ప్రతీకారం తీర్చుకుంటారా. వైసీపీ అభ్యర్థిగా గంజి  చిరంజీవి రంగంలోకి దిగుతారా.. ఆళ్ల రామకృష్ణారెడ్డి మంగళగిరి నుంచే పోటీ చేయడం ఖాయమా.అక్కడి  సమీకరణాలేమిటి.. అన్ని  పార్టీల ఆత్మవిశ్వాసానికి కారణం ఏమిటి… ఓసారి చూద్దాం…

మంగళగిరి  మండుతోంది. బ్లేజువాడగా పిలిచే బెజవాడకు పక్కన ఉండే మంగళగిరి నియోజకవర్గం రాజకీయంగా మంటపుట్టిస్తోంది. ఈ సారి అక్కడ నారా లోకేష్ గెలిచి తీరుతారని టీడీపీ చెప్పుకుంటుండగా, అంత సీన్ లేదు.. ఆయన్ను ఓడించడమెలాగో మాకు  తెలుసని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. అందుకే మంగళగిరి అన్ని పార్టీలకు టెన్షన్ పుట్టిస్తోందని చెప్పాల్సి వస్తోంది. వారం రోజులుగా జరుగుతున్న  పరిణామాల్లో మంగళగిరి ముఖచిత్రమే మారిపోయింది. వైసీపీ నుంచి ఆళ్ల పోటీ  చేస్తారనుకుంటే ఆ పార్టీకే  ఆయన రాజీనామా చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. షర్మిల వెంట నడుస్తానని ఆళ్ల ప్రకటించడం ఒక ట్విస్టేనని చెప్పాలి. ఆళ్ల కాంగ్రెస్ పార్టీలో చేరి మంగళగిరి టికెట్ దక్కించుకుంటే షర్మిల ఆయన  తరపున ప్రచారం చేస్తారా అన్నది చూడాలి…

మంగళగిరి ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. గత రెండు ఎన్నికల్లో మాత్రం వైసీపీ గెలిచింది. అదీ కాంగ్రెస్ నుంచి వైసీపీలో చేరిన ఆళ్ల రామకృష్ణరెడ్డి విజయం సాధించారు. కులాల సమీకరణలు కూడా మంగళగిరిలో బాగానే పనిచేస్తాయని చెప్పక తప్పుదు. రాజధాని ప్రాంతం కావడంతో అమరావతి ఉద్యమాల ప్రభావం కూడా ఈ సారి మంగళగిరి ఫలితంపై ఉండొచ్చని చెప్పక తప్పుదు…

వైసీపీ అభ్యర్థిగా ఆళ్ల రామకృష్ణారెడ్డి 2014లో  పోటీ చేశారు.టీడీపీ అభ్యర్థి గంజి చిరంజీవిపై కేవలం 12 ఓట్ల తేడాతో ఆయన గెలిచారు.  అప్పట్లో అదో సెన్సేషన్ అయితే.. 2019లో గెలుపు అంతకంటే గొప్ప సెన్సేషన్. టీడీపీకి రాజకీయ వారసుడిగా భావించే  చంద్రబాబు తనయుడు, ఎన్టీయార్ మనవడు నారా  లోకేష్… మంగళగిరిలో పోటీ చేశారు. ఆయన్ను గెలిపించుకునేందుకు టీడీపీ కేడర్, లీడర్స్ చేయని  ప్రయత్నం లేదు. ఎంత  ఖర్చు చేసినా లోకేష్ ఓడిపోయారు. దాదాపు రెండు శాతం  ఓట్ల తేడాతో మళ్లీ ఆళ్ల రామకృష్ణారెడ్డే గెలిచారు. అయితే తరువాతి పరిణామాలతో మంగళగిరి ప్రజలు  వైసీపీ పట్ల తీవ్ర వ్యతిరేకతను పెంచుకున్నారు. సీఎం జగన్ మూడు రాజధానుల ప్రతిపాదన చేయడం, అమరావతిని చంపెయ్యాలని చూడడంతో ఉవ్వెత్తున ఉద్యమం ఎగిసిపడింది. జగన్ కుట్రలో ఆళ్ల కూడా  భాగమేనని జనం నిర్ణయించుకున్నారు. అమరావతి రైతులకు మద్దతివ్వడంలో ఆళ్ల ఫెయిల్ అయ్యారు. ఇప్పటిదాకా  జగన్ వెంటే ఉన్న ఆళ్ల ఇప్పుడు తన అవసరాల కోసం బయటకు వచ్చారన్న చర్చ కూడా జరుగుతోంది. మరో పక్క ఓడిపోయినప్పటికీ  టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా  లోకేష్.. మంగళగిరిని తన సొంత నియోజకవర్గంగా చూసుకున్నారు. నిత్యం  మంగళగిరి ప్రజల్లో ఉంటూ వారి సమస్యలు తెలుసుకున్నారు. సొంత  నిధులతో వాటిని పరిష్కరించేందుకు ప్రయత్నించారు. మరో పక్క ఆళ్ల రామకృష్ణారెడ్డికి  జగన్ కు చెడిన  తర్వాత  2014లో  టీడీపీ తరపున పోటీ చేసి ఓడిపోయిన గంజి చిరంజీవిని సీఎం ప్రోత్సహించారు..ఆయనకు  మంగళగిరి ఇంచార్జ్ ఇచ్చారు.  వచ్చే  ఎన్నికల్లో  బీసీలకు ఎక్కువ స్థానాలివ్వాలని నిర్ణయించిన జగన్ ఆ దిశగా చేనేత వర్గానికి చెందిన గంజికి టికెట్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు.మంగళగిరిలో యాభై వేల వరకు పద్మశాలీల ఓట్లున్నాయి…

నారా లోకేష్ ఈ సారి మంగళగిరిలో  గెలుస్తారా..గెలవరా..ఇదే ఇప్పుడు మిలియన్ డాలర్  ప్రశ్న. ఆళ్ల రామకృష్ణారెడ్డి కంటే కూడా గంజి చిరంజీవే ఆయనకు గట్టి  పోటీదారు అవుతారని కూడా భావిస్తున్నారు. ఎన్నికల నాటికి సమీకరణాలు ఎలా మారతాయో చూడాలి…

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి