కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ కోసం ఆదేశించాలని గతంలో కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి వెళ్లి దర్యాప్తు సంస్థలు అన్నింటికీ ఫిర్యాదు చేశారు. కానీ పట్టించుకోలేదు. ఇప్పుడు బీజేపీ నేతలు దమ్ముంటే సీబీఐకి సిఫారసు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయిస్తున్నారు. ప్రాజెక్టు గుట్టు ముట్లు మొత్తం మాకు తెలుసని.. న్యాయవిచారణ చేయబోతున్నామని తెలిసిన తర్వాత కూడా బీజేపీ ఇలాంటి డిమాండ్లు చేయడంపై విస్తృత చర్చ జరుగుతోంది. విచారణ జరిగితే తప్పుడు పద్దతుల్లో అప్పులు, అనుమతులు ఇచ్చిన విషయం బయటపడుతుందని కంగారు పడుతున్నారా ? లేకపోతే కాళేశ్వరం కేసుతో బీఆర్ఎస్ జుట్టును తమ చేతుల్లోకి తెచ్చుకోవాలనుకుంటున్నారా ?
కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిపై విచారణ తమ చేతుల్లోనే ఉండాలంటూ కాంగ్రెస్, బీజేపీ కోరుకుంటున్నాయి. కాళేశ్వరం అక్రమాలపై జ్యూడిషియల్ విచారణకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ లోపు భారతీయ జనతా పార్టీ చాలా దూకుడుగా తెర ముందుకు వచ్చింది. సీబీఐ విచారణకు సిఫార్సు చేయాలని డిమాండ్ చేస్తోంది. కిషన్ రెడ్డి, లక్ష్మణ్ పదే పదే ప్రెస్ మీట్లు పెట్టి అదే డిమాండ్ చేస్తున్నారు. గతంలో సీబీఐ విచారణ అడిగారు కదా ఇప్పుడు ఎందుకు కాళేశ్వరం అవినీతిని సీబీఐకి ఇవ్వడం లేదని ప్రశ్నిస్తున్నారు. కానీ అడిగినప్పుడు సీబీఐకి ఇవ్వకుండా.. ఇప్పుడు న్యాయవిచారణ ప్రారంభమయ్యే సమయంలో ఎందుకు హడావుడి చేస్తున్నారని కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది.
కాళేశ్వరం ఎత్తిపోతల సాగునీటి పథకంపై కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయి పరిశీలనకు సిద్దమైంది. గోదావరి నదిపై మేడిగడ్డ వద్ద నిర్మించిన లక్ష్మీబ్యారేజ్ పిల్లర్లు భూ మిలోకి కుంగిపోయిన ఘటనను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సీరియస్‌గా తీసుకున్నారు. కాళేశ్వరం పై కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఒకటే చెబుతోంది. ప్రాణహిత చేవెళ్ల ని 35 వేల కోట్లతో నిర్మించాల్సిఉంటే.. అవినీతి కోసం డిజైన్ మార్చి కాళేశ్వరం పేరుతో లక్ష కోట్లకు ఖర్చు పెంచారని చెబుతోంది. అంతే కాదు ఈ ప్రాజెక్టు నిరర్థకం అని వాదిస్తోంది. ఒక్కో ఎకరానికి ఈ ప్రాజెక్టు ద్వారా నీరు ఇవ్వడానికి 46 వేల ఖర్చు అవుతుంది. లక్ష కోట్ల పెట్టుబడి పెట్టిన ప్రాజెక్టు నుంచి ఒక్క ఎకరానికి నీరివ్వానికి 46వేలు ఖర్చు అయితే ఇక ఎవరికి ఉపయోగం అనేది అర్థం కాని విషయం.
ఇదంతా బహిరంగరహస్యం. బీజేపీ కూడా కాళేశ్వరంపై ఆరోపణలు చేసింది. గతంలో కాంగ్రెస్ నేత రేవంత్ నేరుగా సీబీఐ, ఈడీలకు ఫిర్యాదు చేశారు. కానీ ఎలాంటి విచారణ జరగలేదు. సీబీఐ విచారణ జరగాలంటే రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేయాల్సి ఉందన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి గతంలో డిమాండ్ చేసినట్లుగా సీబీఐకి సిఫారసు చేయాలని.. రెండు రోజుల్లో విచారణ ప్రారంభిస్తామని కిషన్ రెడ్డి సవాల్ చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ మాత్రం ఇదంతా బీజేపీ – బీఆర్ఎస్ గేమ్ ప్లాన్ లో భాగమని నమ్ముతోంది.
సీబీఐ చేతికి ఇస్తే.. ఇతర కేసుల్లాగే రాజకీయ అవసరాలకు వాడుకుని బీఆర్ఎస్ నేతల్ని గుప్పిట్లో పెట్టుకుని కేసును పక్కన పెట్టేస్తారని .. కాళేశ్వరం బడా కాంట్రాక్టర్ బీజేపీకి కొన్ని వందల కోట్ల రూపాయలు విరాళం ఇచ్చారని కాంగ్రెస్ నేతలు గుర్తు చేస్తున్నారు. బీఆర్ఎస్, కాంట్రాక్టర్ ను తప్పించడానికే కేసు విచారణ తమ చేతికి రావాలని బీజేపీ నేతలు కోరుకుంటున్నారని అనుమానిస్తున్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీ.. కాళేశ్వరంలో ఎక్కడెక్కడ ఎంతెంత అవినీతి జరిగిందో తమకు పూర్తి సమాచారం ఉందని.. జ్యూడిషియల్ విచారణతో మొత్తం ప్రజల ముందు పెడతామని అంటున్నారు. మొత్తంగా రెండు పార్టీలు కాళేశ్వరంపై విచారణకు పోటీ పడుతున్నాయి. విచారణ ఎవరు చేస్తారు.. ఎవరు నిజాల్ని బయటపెడతారన్నది సస్పెన్స్ గా మారింది. ఇవన్నీ రాజకీయ ఆటలేనని రూపాయి కూడా అవినీతి బయటకురాదని నమ్మేవాళ్లు కూడా ఎక్కువే ఉన్నారు…
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…