తెలుగుదేశం పార్టీకి త్వరలో రాజీనామా చేస్తున్నానని విజయవాడ ఎంపీ కేశినేని నాని ప్రకటించారు. స్పీకర్ అపాయింట్మెంట్ ఇస్తే అప్పుడు వెళ్లి ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని నాని ప్రకటించారు. తర్వాత తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తానని తెలిపారు. పార్టీకి అత్యంత విధేయుడిగా భావించే నాని వెళ్లిపోవడానికి దారి తీసిన కారణాలేమిటి.. ఆయన ఎందుకు అసంతృప్తి చెందారు. పొమ్మనకుండా పొగబెట్టిన పెద్ద తలకాయ ఎవరూ. నాని వైసీపీలో చేరతారన్న ప్రచారం నిజమేనా….
2014,2019 ఎన్నికల్లో కేశినేని నాని విజయవాడ ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. అయితే రెండోసారి గెలిచిన తర్వాత నాని స్వరం మారింది. స్థానిక టీడీపీ నాయకులతో గొడవలు పెట్టుకున్నారు. పార్టీ ఆదేశాలను సైతం పాటించడం మానేశారు. టీడీపీ కార్యాలయం పై దాడి చేసినప్పుడు కనీసం స్పందించలేదు. లోకేష్ పాదయాత్రకు దూరంగా ఉన్నారు. విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల సమయంలో పార్టీ కంటే తానే గొప్ప అని.. తానే గెలిపించుకుంటానని సవాల్ చేశారు. పార్టీని చాలా విధాలుగా డ్యామేజ్ చేశారు. అయినా చంద్రబాబు ఏనాడు ఆగ్రహం వ్యక్తం చేయలేదు. పైగా కేశినేని నాని కుమార్తె వివాహానికి కుటుంబ సమేతంగా హాజరయ్యారు. చివరికి పార్టీ నుంచి వైదొలుగుతున్నట్లు నాని ప్రకటించారు..
నాని తమ్ముడు కేశినేని చిన్నిని పార్టీ అధిష్టానం ప్రోత్సహించడం ఆయనకు ఏ మాత్రం నచ్చడం లేదు. చంద్రబాబు తనయుడు నారా లోకేష్ స్వయంగా రంగంలోకి దిగి చిన్ని భుజం తడుతున్నారని నాని అనుమానిస్తున్నారు. దానితో విజయవాడ టీడీపీలో తనకు గౌరవం లేకుండా పోయిందని నాని అనుమానిస్తున్నారు. ఇక ఉండి లాభం లేదని డిసైడయ్యారని సమాచారం..
ఆదివారం తిరువూరులో జరగాల్సిన చంద్రబాబు రా కదిలి రా కార్యక్రమ ఏర్పాట్లలో నాని, చిన్ని వర్గాలు కొట్టుకున్నాయి. పోలీసులపై కూడా దాడులు చేశాయి. దీనిపై అధిష్టానం సీరియస్ అయ్యింది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు కొణకళ్ల నారాయణ నేతృత్వంలోని బృందాన్ని నాని వద్దకు పంపింది. చంద్రబాబు సభను జయప్రదం చేసేందుకు చిన్నితో కలిసి పనిచేయాలని అధిష్టానం మాటగా చెప్పడంతో నానికి బాగా కోపమొచ్చంది. సభకే తాను రాబోవడం లేదని ఆయన ప్రకటించేశారు. పార్టీలోంచి బయటకు వచ్చే నిర్ణయానికి ఇదీ ఫైనల్ కారణం. అసలు కారణాలు చాలా ఉన్నాయి. తన నియోజకవర్గంలో చిన్ని రెచ్చిపోవడం వెనుక నారా లోకేష్ ఉన్నారని నాని చాలా కాలంగా అనుమానిస్తున్నారు. ఎక్కడో ఉన్న చిన్నిని తీసుకొచ్చి విజయవాడ టీడీపీ రాజకీయాలో కుర్చీ వేసి కూర్చోబెట్టారని నాని ఆగ్రహం చెందుతున్నారు.మరో పక్క విజయవాడ టీడీపీ నేతల తీరుపై కూడా నానిలో అసంతృప్తి పెరిగిపోయింది. పార్లమెంట్ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ స్థానాలకు గాను.. ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్చార్జిలతో ఆయనకు తీవ్ర విభేదాలు ఉన్నాయి. బుద్దా వెంకన్న లాంటి నేతలంటే ఆయనకు అసలు పడటం లేదు. దానితో వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు.
నాని వైసీపీలోకి వెళ్లినా ఆశ్చర్య పడాల్సిన అవసరం లేదన్నది ఒక టాక్. గతంలో వైసీపీ నేతల అయోధ్య రామిరెడ్డి ఆయన్ను ఆహ్వానించారు. అప్పుడు నాని వెళ్లలేదు. మరి ఈ సారి ఎవరైనా డైరెక్టు ఆఫరిస్తారా లేక మరేదైనా ఉందా అన్నది చూడాలి…
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…