విజయనగరం కోటలో రాజులు ఇక గెలవలేరా ?

By KTV Telugu On 8 January, 2024
image

KTV TELUGU :-

ఏపీలోని హై ప్రోఫైల్ నియోజకవర్గాల్లో ఒకటి విజయనగరం అసెంబ్లీ స్థానం. టీడీపీ నేత,  పూసపాటి రాజవంశీకుడు అశోక్ గజపతిరాజు కంచుకోటగా ఉన్న ఆ నియోజకవర్గంలో  టీడీపీ పట్టు క్రమంగా సడలుతోంది.  కుటుంబ గొడవలు తెరపైకి వస్తున్నాయి. ఈ క్రమంలో  గత ఎన్నికల్లో అశోక్ తో పాటు ఆయన కుమార్తె కూడా ఓడిపోయారు. ఇప్పుడు  మరోసారి ఎన్నికలు ముంచుకొచ్చేశాయి. వారి పరిస్థితి ఎలా ఉంది ? వైసీపీ అభ్యర్థిని మార్చి అయినా గోల్ కొడుతుందా ?

విజయనగరం  నియోజకవర్గంలో  మొట్టమొదటిసారిగా 2019లో వైసీపీ విజయం సాధఇచింది.  వైసీపీ వేవ్‌లో.. టీడీపీ కంచుకోట బద్దలైంది. అలాంటి చోట.. తాజా రాజకీయ పరిస్థితులు.. చర్చనీయాంశంగా మారాయ్. రాబోయే.. ఎన్నికల్లో గెలిచేదెవరన్నది..  సిట్టింగ్ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి,  టీడీపీ నేత అశోక్ గజపతిరాజు  మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. కానీ విచిత్రం ఏమిటంటే ఈ సారి వీరిద్దరు బరిలో ఉంటారా లేదా అన్నది మాత్రం స్పష్టత రాలేదు.

విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గంలో  1978లో తొలిసారి జనతా పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన అశోక్ గజపతి రాజు.. 1983 నుంచి 1999 వరకు వరుసగా.. ఐదు సార్లు తెలుగుదేశం నుంచి విజయనగరం ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మొత్తంగా.. ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి.. విజయనగరం సెగ్మెంట్‌లో కొత్త చరిత్ర సృష్టించారు. ఈ నియోజకవర్గంలో ఉన్న ఏకైక మండలం విజయనగరం. పట్టణంతో పాటు మండల పరిధిలో.. 2 లక్షల 30 వేల మందికి పైనే ఓటర్లున్నారు. వీరిలో.. బీసీల ఓట్ బ్యాంక్  ఎక్కువగా ఉంటుంది. వాళ్లే ఇక్కడ గెలుపోటములను నిర్దేశిస్తుంటారు. గత ఎన్నికల్లో  తొలిసారి వైసీపీ ఇక్కడ గెలుపు జెండా ఎగరేసింది. తెలుగుదేశం తరఫున పోటీ చేసిన అశోక్ గజపతిరాజు కుమార్తె అదితి గజపతిరాజుపై 6 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో  వైసీపీ అభ్యర్థి కోలగట్ల వీరభద్రస్వామి ఎమ్మెల్యేగా గెలిచారు.

సిట్టింగ్ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామికి విజయనగరంలో  మంచి ఇమేజ్ ఉంది. కానీ అధికారంలో ఉండటం వల్ల అడిగిన పనులు చేయలేక కొంత మందికి దూరమయ్యారు.  ఇటీవల జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో  విజయనగరంలో  వైసీపీకి ఓట్లు తెచ్చిపెట్టలేకపోయారు.    బీసీలు ఎక్కువగా ఉండే విజయనగరం  స్థానంలో.. వచ్చే ఎన్నికల్లో బీసీలకే టికెట్ ఇవ్వాలంటూ.. సొంత పార్టీ నేతలు హైకమాండ్ పై ఒత్తిడి చెస్తున్నారు.  వైశ్యవర్గానికి చెందిన వీరభద్ర స్వామికి డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చారు సీఎం జగన్. ఆ వర్గం నుంచి మంత్రిగా ఉన్న వెల్లంపల్లి పదవిని  తీసేసి ఆ పదవి ఇవ్వడంతో  కోలగట్లకూ సమస్యగా మారింది. అందుకే తనకు బదులుగా తన కుమార్తెకు టిక్కెట్ఇవ్వాలని ఆయన హైకమాండ్ పై ఒత్తిడి  పెంచుతున్నారు. ల

టీడీపీ తరఫున నేరుగా అశోక్ గజపతిరాజే పోటీ చేస్తారన్న గ్యారంటీ లేకపోయింది.  గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన ఆయన కుమార్తె అధితి గజపతిరాజు తానే పోటీ చేస్తానని ప్రచారం చేసుకుంటున్నారు. తానే పోటీ చేస్తానంటున్నారు. మరో వైపు మాజీ ఎమ్మెల్యే, ఒకప్పుడు అశోక్ ఆశీస్సులతో గెలిచిన మీసాల గీత విజయగనరంలో ప్రత్యేక ఆఫీస్ పెట్టుకుని టిక్కెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. తనకే చాన్సివ్వాలని కోరుతున్నారు. అయితే గత ఎన్నికల్లో టీడీపీ ఓటమితో.. ఈసారి ప్రయోగాలకు తావు లేకుండా.. నేరుగా అశోక్ గజపతినే బరిలోకి దించాలని చంద్రబాబు నిర్ణయించినట్లు టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.  దీంతో పోటీ హోరాహోరీగా ఉంటుంది.

విజయనగరంలో ఇప్పటి వరకూ రెండు సార్లు పూసపాటి కుటుంబంపై ఇతరులు గెలిచారు. ఆ ఇతరులు కోలగట్ల మాత్రమే. రెండు సార్లు ఆయన అతి స్వల్ప మెజార్టీతోనే గెలిచారు.  క్లీన్ రాజకీయాలు చేసే పూసపాటి అశోక్ గజపతిరాజు… ఎన్నికల్లో ఒక్క రూపాయి పంచరు.  మందు పంపిణీ లాంటి వాటి జోలికి పోరు. కానీ ఇతర పార్టీలు మాత్రం… వాటితో ఎలక్షనీరింగ్ చేస్తాయి.  మరి మారుతున్న రాజకీయంలో ఎవరిది పైచేయి అవుతుందన్నది చూడాల్సి ఉంది…

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి