దేశమంతా ఇప్పుడు అయోధ్య వైపే చూస్తోంది. విష్ణువు ఏడవ అవతారాన్ని కనులారా చూసేందుకు ప్రజలు అయోధ్యకు తరలి వెళ్తున్నారు. కష్టాలకు ఓర్చి, అన్ని ఇబ్బందులను భరించి జీవితాన్ని ఆదర్శప్రాయంగా మలుచుకున్న శ్రీరామచంద్రుడి గుడి నిర్మాణం తుది దశకు చేరుకుంది. ప్రధాని మోదీ చేతుల మీదుగా జనవరి 22న ఆలయం ప్రారంభమవుతోంది. త్రేతాయుగంలో అయోధ్యనేలిన మహరాజుకు కలియుగంలో ఆకాశమంత ఆలయాన్ని నిర్మిస్తున్నామని కేంద్రంలో అధికార బీజేపీ చెప్పుకుంటోంది….
అందరి బంధువయా.. అయోధ్య రామయ్య అంటూ జనం పాడుతూ ముందుకు సాగే తరుణం రానే వస్తోంది. రాముండంటే మర్యాదా పురుషోత్తముడని చెబుతారు. ప్రతీ పురుషుడు రాముడిగా ఉండాలని ఇంట్లోని మహిళలు కోరుకుంటారు. మనిషిగా పుట్టి, రాజ్యమేలి, ఆదర్శమూర్తిగా నిలిచి, ప్రతీ హిందువు గుండెల్లో దేవుడిగా స్థిరపడిపోయిన శ్రీరాముడి కోసం ఒక మహోన్నత ఆలయం సిద్ధవుతోంది. ఆదర్శ పురుషుడు ఎలా ఉండాలంటే రాముడిలా ఉండాలంటారు కష్టాలకు ఎదురీది, సహనానికి, సంయమనానికి మారుపేరుగా రాముడు నిలిచాడు. రాముడు నిత్య పోరట యోధుడు, రాముడు నిత్య యాత్రికుడు .ఓ వ్యక్తి మంచోడు అని చెప్పాలంటే వెంటనే గుర్తొచ్చే పేరు రాముడు. పడినా నిలబడాలి. నిలబడి పడినా మళ్లీ నిలబడాలి. కష్టమే కానీ సుఖం ఎరుగని జీవితాన్ని ఆస్వాదించడం కూడా నేర్చుకోవాలి.
రాముడిది ఫెయిల్యూర్ లా కనిపించే సక్సెస్ స్టోరీ. ఎన్ని కష్టాలు వచ్చినా సంయమనం కోల్పోకుండా, సహనంగా కనపించే ఆదర్శమూర్తి రాముడు. తాను నిరాశ చెందితే ఇతరులు కుంగిపోతారన్న ఫిలాసఫీతో కష్టాలను ఓర్చి సంతోషంగా కనిపించే రాజు కమ్ దైవం శ్రీరాముడు. చివరి దాకా ఒకే ధోరణి…కష్టాలను నువ్వుతూ భరించే ధోరణి అది. అందుకే ఈ యుగంలో కూడా భారతీయులు రాముడిని కొలుస్తారు. రాముడినే భారతీయతగా భావిస్తారు…
కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించినట్లుగా ఆధ్యాత్మిక నగరం అయోధ్యలో ఆకాశమంత ఎత్తు రామాలయం నిర్మితమవుతోంది. జనవరి 22న వైభవోపేతంగానూ, కన్నులపండువగానూ ఆ కార్యక్రమం జరుగుతుంది. ఈ ప్రక్రియ రాత్రికి రాత్రి జరిగింది మాత్రం కాదు. ఆ దిశగా శతాబ్దాల సంఘర్షణ, దశాబ్దాల పోరాటం ఉందని చెప్పక తప్పదు. . స్వాతంత్ర భారతావనిలో .. మందిర్ వహీ బనాయేంగే అంటే రామ జన్మభూమిలోనే ఆలయాన్ని నిర్మిస్తామని వీహెచ్పీ ఆరెస్సెస్ నినదించడానికంటే చాలా రోజుల ముందే ఆలయంపై అనేక వివాదాలు, వివరణలూ వచ్చాయి. నిజానికి రాముడు మానవ శరీరాన్ని వదిలేసిన తర్వాత చాన్నాళ్లకు అయోధ్యలో ఆయనకు ఒక ఆలయం ఏర్పాటైంది. క్రీస్తు శకం 1529లో అప్పటి మొఘల్ చక్రవర్తి బాబర్ .. ఆలయాన్ని పడగొట్టి మసీదును నిర్మించాడు. దానికి బాబ్రీ మసీదు అని కూడా పేరు. రామజన్మభూమిని హిందువులకు అప్పగించాలని, అక్కడ తిరిగి మందరం నిర్మించాలన్న ఉద్యమం బాబ్రీ మసీదు కూల్చివేతతో హింసాత్మకమైంది. ముందుగా 19వ శతాబ్దం నుంచే మసీదు, మందిర్ వివాదాలు కొనసాగాయి. 1949లో హిందూ మహాసభ కార్యకర్తలు మసీదు లోపల రాముని విగ్రహాలు ఉంచారు. వివాదం పెద్దది కావడంతో ప్రభుత్వం ఆ భవనాన్ని మూసేసింది. అప్పటి నుంచి కోర్టు వివాదాలు కొనసాగుతుండగా.. 1992 డిసెంబరు 6న కరసేవకులు మసీదులోకి ప్రవేశించి దాన్ని కూల్చేశారు. అప్పుడు జరిగిన అల్లర్లలో రెండు వేల మంది చనిపోయారు. మందిర్, మసీద్ వివాదం చాలరోజులు కోర్టుల్లో నలిగింది . రామ జన్మ స్థలం అని నమ్ముతున్న ప్రదేశంలోనే మసీదును నిర్మించారనే హిందువుల వాదనను అలహాబాద్ హైకోర్టు 2010 సెప్టెంబరులో సమర్థించింది. కేంద్ర గోపురం ఉన్న స్థలాన్ని రామాలయ నిర్మాణం కోసం ఇచ్చింది. మసీదు నిర్మాణం కోసం ముస్లింలకు మూడవ వంతు స్థలం కూడా లభించింది.ఈ నిర్ణయం తరువాత అన్ని పార్టీలు సుప్రీంకోర్టుకు అప్పీల్ చేసాయి. ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం 2019 ఆగస్టు నుండి అక్టోబరు వరకు దావాను విచారించింది.2019 నవంబరు 9 న, సుప్రీంకోర్టు దిగువ కోర్టు తీర్పును రద్దు చేసి, మొత్తం 2.77 ఎకరాల భూమిని హిందూ దేవాలయాన్ని నిర్మించడానికి ఒక ట్రస్టుకు అప్పగించాలని ఆదేశించింది. కూల్చివేసిన బాబ్రీ మసీదు ఉన్న స్థలానికి బదులుగా ఐదు ఎకరాల స్థలాన్ని ఉత్తర ప్రదేశ్ సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డుకు ఇవ్వాలని కూడా ప్రభుత్వాన్ని ఆదేశించింది.
బీజేపీ అజెండాలో ఆలయం ప్రధానమైనదిగా చెప్పుకోవచ్చు. ట్రిపుల్ తలాఖ్, ఆర్టికల్ 370 కంటే రామాలయమే అజెండాలో ముఖ్యమైనదిగా కూడా చెబుతారు. 2020 ఆగస్టు 5న స్వయంగా ప్రధానమంత్రి చేతుల మీదుగా భూమిపూజ కార్యక్రమం జరిగింది.. వేర్వేరు ప్రాంతాల నుంచి సాధుసంతులు, నేతలు, సామాన్యులు వచ్చి ఆ చారిత్రక ఘట్టాన్ని తిలకించారు. దాదాపు మూడేళ్ల నిర్మాణ ప్రక్రియ తర్వాత ఇప్పుడు ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమవుతోంది. జనవరి 22 దేశమంతా పండుగ జరుపుకుంటుంది…
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…