రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ కు కష్టకాలం తప్పదా. ఓటమి నుంచి తప్పించుకునేందుకు రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే స్థానానికి ఆయన మారిపోయినా అక్కడ కూడా వ్యతిరేకత వ్యక్తమవుతోందా. భరత్ ను ఓడించేందుకు వైసీపీ వారే స్కెచ్ వేశారా. రాజమంత్రి అర్బన్ పై టీడీపీ ప్రత్యేక దృష్టి పెట్టి వ్యూహాలు అమలు చేయడంతో భరత్ కు దిక్కుతోచడం లేదా…
2019లో రాజమండ్రి ఎంపీ టికెట్ మార్గాని భరత్ కు ఇచ్చినప్పుడు ఒక యువనేతకు అవకాశం వచ్చిందని వైసీపీ శ్రేణులు సంతోషించాయి. పార్టీ కార్యకర్తలంతా ఒకటై భరత్ ను గెలిపించుకున్నారు. పైగా బీసీ సామాజికవర్గం యువకుడు కావడంతో ఆయన్ను బీసీ సంఘాలన్నీ ఆదరించాయి. కట్ చేసి చూస్తే ఎన్నికల తర్వాత భరత్ తీరు మారిపోయింది. ఏకపక్షంగా వ్యవహరించడం, సొంత పార్టీ వారినే అవమానాలకు గురిచేయడం లాంటి చర్యలతో ఆయన ప్రజా వ్యతిరేకత మూటగట్టుకున్నారు. ప్రజల కోసం ఒక్క మంచి పని కూడా చేయకపోగా, జనంపై పెత్తనానికి మాత్రం వెనుకాడలేదు. మార్గాని భరత్ అంటే అవీనితి అన్న ముద్ర పడిపోయింది.రాజమండ్రి సుందరీకరణ ప్రాజెక్టులో చేసిన పనులకంటే తిన్నది ఎక్కువన్న పేరు పడిపోయింది. దీనితో ప్రజా వ్యతిరేకత బాగా పెరిగిపోయిందన్న సంగతి తెలుసుకునే ఆయన చల్లగా జారుకుని సీఎం జగన్ ను మేనేజ్ చేసి రాజమండ్రి అర్బన్ నియోజకవర్గాన్ని తీసేసుకున్నట్లుగా చెబుతున్నారు. వైసీపీలోని బీసీ సంఘాలు మాత్రం భరత్ ను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాయి. రాజమండ్రి అర్బన్ టికెట్ ను భరత్ కు కాకుండా కొత్తవారికి ఇవ్వాలని, అదీ అంకిత భావంతో పనిచేసే యువనేతలకే ఇవ్వాలని బీసీ సంఘాలు కోరుతున్నాయి. త్వరలో బీసీ నేతలు నేరుగా వెళ్లి జగన్మోహన్ రెడ్డిని కలవాలనుకుంటున్నారు. ఎన్నికల్లోపు మనసు మార్చుకుని భరత్ కు టికెట్ ఆపేయ్యాలని కోరబోతున్నారు…
భరత్ చేసిన ఓవరాక్షన్ ఇప్పుడు ఆయన మెడకు చుట్టుకుందని చెప్పక తప్పదు. పార్టీలో బలమైన నేతలను ఢీకొని హీరోయిజం చూపిద్దామని ఆయన అనుకుంటే సీన్ రవర్సయ్యింది. పైగా ఇప్పుడు రాజమండ్రి అర్బన్ లో టీడీపీ బలపడింది. వైసీపీకి ముచ్చెమటలు పట్టిస్తోంది…
రాజమండ్రి లోక్ సభా నియోజకవర్గం పరిధిలో వైసీపీ ఎమ్మెల్యేలంతా భరత్ తీరుపై అసంతృప్తితో ఉన్నారు. వారిని బుజ్జగించడం అధిష్టానం వల్ల కూడా కావడం లేదని చెబుతున్నారు. జక్కంపూడితో జరిగిన కీచులాట కూడా భరత్ కు శాపంగా మారింది. రాజానగరం ఎమ్మెల్యే,వైసీపీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు జక్కంపూడి రాజాతో విభేదించటం కూడా ఎంపీ కి మైనస్ గా మారింది.
తూర్పుగోదావరి జిల్లాలో అత్యంత బలమైన క్యాడర్ ఉన్న జక్కంపూడి రాజా తో విభేదాలు వల్ల ఎంపీ రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ప్రజా వ్యతిరేకత మూటకట్ఠకున్నారనే భావన వ్యక్తమవుతోంది.జగన్ స్వయంగా జోక్యం చేసుకున్న తర్వాతే జక్కంపూడి మెత్తబడ్డారని చెబుతున్నారు. నారా లోకేష్ యువగళం పాదయాత్ర సందర్భంగా భరత్ ప్రవర్తించిన తీరు తటస్థులకు కూడా కోపం తెప్పించింది.పాదయాత్రను అడ్డుకోవాలని చూడటం, లోకేష్ ను అనరాని మాటలు అనడం తీవ్ర చర్చకు దారి తీసింది. ఇప్పుడు రాజమండ్రిలోని రెండు నియోజకవర్గాలపైనా టీడీపీ ప్రత్యేక దృష్టి పెట్టింది. రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యేగా ఉన్న టీడీపీ సీనియర్ నేత బుచ్చయ్య చౌదరి ఈ సారి అర్బన్ లో పోటీ చేయాలనుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నట్లు సమాచారం. అదే జరిగితే భరత్ కు కష్టకాలమేనని చెప్పక తప్పదు…
అన్ని వైపుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్న మార్గాని భరత్ ను జగన్ ఎందుకు ప్రోత్సహిస్తున్నారనేదే పెద్ద ప్రశ్న. సరైన సమాచారం లేకపోవడం ఒక కారణం కావచ్చని భావిస్తున్నారు. తాడేపల్లి ప్యాలెస్ లో కొందరిని భరత్ బాగా మేనేజ్ చేశారని దానితో వారు ఆయన పట్ల సీఎంకు పాజిటివ్ సమాచారం అందించారని చెబుతున్నారు. ఆ సంగతి తెలుసుకున్న భరత్ వ్యతిరేకులు ఇప్పుడు సీఎంను కలిసి మొత్తం వ్యవహారాన్ని వివరించాలనుకుంటున్నారు.వారికి జగన్ అప్పాయింట్ మెంట్ దొరుకుతుందో లేదో చూడాలి…
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…