హిందూత్వం ఒక జీవన విధానం.భారతీయత ఒక సంస్కృతీ సంప్రదాయానికి నిదర్శనం. రామ తత్వం హిందూత్వం, భారతీయత రెండింటి మేళవింపేనని చెప్పక తప్పదు. అందుకే రామాలయ ప్రారంభోత్సవానికి ఇంతటి ప్రాధాన్యం ఏర్పడింది. నెల రోజులుగా ప్రతీ నోట రామ నామమే వినిపిస్తోంది.
అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం కోసం దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఆలయ నిర్మాణ పనులు దాదాపు పూర్తయ్యాయి. రామ్ లల్లా విగ్రహ ప్రతిష్టాపన శుభ సమయం 2024 జనవరి 22న మధ్యాహ్నం 12 గంటల 29 నిమిషాల 8 సెకన్లకు ప్రారంభమవుతుంది. ఇంతకీ విగ్రహ ప్రాణ ప్రతిష్ట అంటే ఏంటి? ఈ విధానం ఎందుకు ఫాలో అవుతారనేది పెద్ద ప్రశ్నే. నిజానికి ప్రాణ ప్రతిష్ట అనేది జైనమతం, హిందూ మతంలో ఒక ప్రసిద్ధ ఆచారం. ప్రాణ అనే పదానికి ప్రాణశక్తి, ప్రతిష్ట అంటే స్థాపన అని అర్థం. ప్రాణ ప్రతిష్ట లేదా ప్రతిష్టాపన కార్యక్రమం అంటే విగ్రహంలోని ప్రాణశక్తిని ఆవాహన చేయడం. ప్రాణ ప్రతిష్ట తర్వాత మాత్రమే దేవాలయాల్లో దేవతా విగ్రహాన్ని ప్రతిష్టిస్తారు. విగ్రహాల ప్రతిష్టాపన సమయంలో, పూజారులు వేద శ్లోకాల మంత్రోచ్ఛారణల మధ్య క్రతువులను నిర్వహిస్తారు. ఈ పూజల అనంతరం సుముహూర్తంలో విగ్రహంలోకి దైవత్వాన్ని ఆవాహనం చేసి ప్రతిష్టిస్తారు. అప్పటివరకూ అది రాయి మాత్రమే. ప్రాణప్రతిష్ట జరిగిన తర్వాత మాత్రమే అందులో దైవత్వం నిండుతుంది. ఏ ఆలయంలోనైనా ప్రాణ ప్రతిష్ట ఒక ముఖ్యమైన ఆచారంగా పరిగణిస్తారు. ప్రాణ ప్రతిష్ట ప్రక్రియకు ముందు ప్రతి విగ్రహం ఇతర బొమ్మలు, విగ్రహాలతో సమానమేనని భావిస్తారు.
ఏ విగ్రహాన్ని గర్భగుడిలో ప్రతిష్టిస్తారో ఆ విగ్రహాన్ని ఊరేగింపుగా ఆలయానికి తీసుకొస్తారు. ఆ విగ్రహాన్ని శుద్ధి చేస్తారు అనంతరం పాలతో అభిషేకం చేస్తారు. పసుపు, గంధం రాసి వేద మంత్రాల మధ్య గర్భగుడిలోకి తీసుకొచ్చి ప్రాణం పోస్తారు. అనంతరం విగ్రహ ప్రతిష్టాప ప్రారంభమవుతుంది. ఈ సమయంలో విగ్రహాన్ని ప్రధాన పూజారి తూర్పు దిశలో ఉంచుతారు. దానిని సరైన స్థలంలో ఉంచిన తరువాత, పూజారులు శ్లోకాలు, మంత్రాలు చదువుతారు. మొదటగా విగ్రహం కళ్లు తెరుస్తారు. ఈ ప్రక్రియ మొత్తం పూర్తైన తర్వాతే ఆ విగ్రహం దేవుడిగా మారుతుంది.
ఈ మందిరం పొడవు 380 అడుగులు, వెడల్పు 250 అడుగులు కాగా ఎత్తు 161 అడుగులు. మూడంతుస్తులుగా నిర్మితమవుతున్న ఈ మందిరంలోని ఒక్కొక్క అంతస్తు 20 అడుగుల ఎత్తుతో ఉంటుంది. మొత్తం 392 స్తంభాలు, 44 తలుపులు ఉన్నాయి. ప్రధాన గర్భగుడిలో శ్రీరాముని చిన్ననాటి రూపం అంటే శ్రీరామ్ లల్లా విగ్రహం ఉంటుంది. మొదటి అంతస్తులో శ్రీరామ్ దర్బార్ ఉంటుంది. నృత్య మండపం, రంగ మండపం, సభా మండపం, ప్రార్థన మండపం, కీర్తన మండపం వంటి ఐదు మండపాలు ఉంటాయి. ఆలయ స్తంభాలు, గోడలపై దేవతల విగ్రహాలు చెక్కారు. తూర్పు ద్వారం నుంచి 32 మెట్లు ఉన్నాయి. ఆలయం చుట్టూ 732 మీటర్ల పొడవు, 14 అడుగుల వెడల్పుతో దీర్ఘచతురస్రాకార గోడ నిర్మించారు. నాలుగు మూలల్లో సూర్య దేవ్, దేవి భగవతి, వినాయకుడు, శివుడికి సంబంధించిన నాలుగు ఆలయాలు ఉంటాయి. ఉత్తరం వైపు అన్నపూర్ణ, దక్షిణం వైపు హనుమంతుని మందిరం ఉంటాయి. సమీపంలో పురాతన కాలం నాటి చారిత్రక బావి అయిన సీతాకూప్ ఉంటుంది. శ్రీ రామ జన్మభూమి మందిర్ కాంప్లెక్స్‌లో వాల్మీకి, వశిష్ఠ, విశ్వామిత్ర, అగస్త్య, నిషాద్ రాజ్, మాతా షబ్రి, దేవీ అహల్య మందిరాలు ఉంటాయి. కాంప్లెక్స్ నైరుతి భాగంలో కుబేర్, శివాలయం, జటాయుని స్థాపన జరుగుతుంది…
ఒక భారతీయుడు తప్పక దర్శించాల్సిన ఆలయం అయోధ్యలోనే ఉందని చెప్పుకునే స్థాయిలో నిర్మాణం తుది దశకు చేరుకుంది. ఆలయంలో ప్రతీ అడుగు పవిత్రతను సంతరించుకుంటోంది. రామజన్మభూమికి వెళ్లిన ప్రతీ ఒక్కరికీ ఒక అనిర్వచనీయమైన అనుభూతి కలగడం మాత్రం ఖాయం…
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…