ఎన్నికలు తరుముకొస్తోన్న వేళ ఆంధ్ర ప్రదేశ్ లో రెండు ప్రధాన పార్టీల్లో అసంతృప్తులు..పార్టీలకు ఝలక్ఇస్తున్నారు. పార్టీలకు గుడ్ బై చెప్పి ప్రత్యర్ధి పార్టీల్లో చేరడానికి సిద్ధమవుతున్నారు. ఇలా పార్టీలను వీడిన నేతల వల్ల ఆయా పార్టీలకు నష్టం ఉంటుందా? అంటే ఎన్నికలు పూర్తయితేనే కానీ చెప్పలేం అంటున్నారు రాజకీయ పండితులు. ఇటు తెలుగుదేశం..అటు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీల నాయకత్వాలకు చిన్నా చితకా తలనొప్పులుతప్పడం లేద.అయితే నాయకత్వాల ఆలోచనలు వేరేలా ఉన్నాయంటున్నారు రాజకీయ పండితులు. కొందరు నేతలు పార్టీకి గుడ్ బై చెప్పినంత మాత్రాన పార్టీకి నష్టం లేదని నాయకత్వాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
ఏపీలో అధికారంలో ఉన్న వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి నియోజక వర్గాల ఇన్ ఛార్జులను మారుస్తూ పోతున్నారు. అంతే కాదు అసెంబ్లీ..లోక్ సభ నియోజక వర్గాల్లో అభ్యర్ధులను అటూ ఇటూ మారుస్తున్నారు. ఇలా మార్చడానికి ఆయన కొన్ని సర్వేల ప్రాతిపదికన నిర్ణయాలు తీసుకుంటున్నారు. వీటితో పాటే సామాజిక సమీకరణలనూ దృష్టిలో పెట్టుకుంటున్నారు. గత ఎన్నికలతో పోలిస్తే ఈ సారి బడుగు బలహీన వర్గాలకు ఎక్కువ స్థానాలు కట్టబెట్టే దిశగా పావులు కదుపుతున్నారు. దీంతో సహజంగానే కొన్ని చోట్ల టికెట్లు ఆశించిన నేతలు అసంతృప్తికి గురవుతున్నారు. వారిలో కొందరు పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. ఇలా గుడ్ బై చెప్పిన వారిని తమ పార్టీలో చేర్చుకోడానికి టిడిపి నాయకుడు చంద్రబాబు ఏ మాత్రం వెనకాడ్డం లేదు.
ఉత్తరాంధ్ర లో అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే..మాజీ మంత్రి దాడి వీరభద్రరావు కొద్ది రోజుల క్రితమే తన కుమారులు అనుచరులతో కలిసి వైసీపీకి గుడ్ బై చెప్పారు. ఆ మర్నాడే చంద్రబాబు నాయుడి దగ్గరకు వెళ్లి పచ్చకండువా కప్పుకున్నారు. అలాగే రాయలసీమకు చెందిన మాజీ ఎంపీ సి.రామచంద్రయ్య కూడా వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ కు రాజీనామా చేశారు. ఆయన కూడా దాడి తో పాటే టిడిపిలో చేరారు. గతంలోచంద్రబాబు నాయుడి వైఖరిని చీల్చిచెండాడిని ఈ ఇద్దరూ ఇపుడు చిరునవ్వు చెదరకుండా చంద్రబాబు పార్టీలో చేరిపోయారు. దాడి వీరభద్రరావు చేరికతో అనకాపల్లిలో పార్టీ బలోపేతం అవుతుందని బాబు ఆలోచన. ఇక రామచంద్రయ్య రాకతో సీమలో బలిజ ఓటు బ్యాంకు తమకే దక్కుతుందని బాబు లెక్కగా చెబుతున్నారు.
తాజాగా వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీలో ఈ మధ్యనే చేరిన వెటరన్ క్రికెటర్ అంబటి రాయుడు అనూహ్యంగా పార్టీకి రాజీనామా చేశారు. అంబటి రాయుడు గుంటూరు లోక్ సభ స్థానాన్ని ఆశించారు. అయితే పార్టీ నాయకత్వం నుండి సీటుకు హామీ రాకపోవడంతో రాయుడు పార్టీకి గుడ్ బై చెబుతున్నట్లు ట్వీట్ చేశారు. కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉండాలనుకుంటున్నానని ఆయన అందులో పేర్కొన్నారు. అయితే మరో పార్టీలో చేరతారా లేక స్వతంత్ర అభ్యర్ధిగా బరిలోకి దిగుతారా అన్నది ఆయన క్లారిటీ ఇవ్వలేదు.అయితే అంబటి రాయుడికి గ్రామీణ ప్రజల్లో అంత జనాదరణ లేదన్నది వాస్తవం. పట్టణ ప్రాంతాల్లో క్రికెట్ అభిమానులకు మాత్రమే రాయుడు తెలుసు. మిగతా వారికి ఆయన ఎవరో కూడా తెలీదు. అంచేత రాయుడు వెళ్లడం వల్లవైసీపీకి పెద్దగా నష్టం ఉండదంటున్నారు రాజకీయ పండితులు.
ఇక తెలుగుదేశం పార్టీలోనూ లుక లుకలున్నాయి. అయితే టిడిపి-జనసేనల మధ్య సీట్ల సర్దుబాటు అయితే ఆ లుక లుకలు ఒక్కసారిగా బయటపడే అవకాశాలుంటాయి. ప్రస్తుతం విజయవాడ టిడిపి ఎంపీ కేశినేని నానిని చంద్రబాబు నాయుడు పక్కన పెట్టి ఆయన తమ్ముడు కేశినేని చిన్నిని ప్రోత్సహించడంతో నాని అసంతృప్తితో ఉన్నారు. కేవలం పక్కన పెట్టడమే కాకుండా నానికి వచ్చే ఎన్నికల్లో టికెట్ లేదని ఇప్పుడే చెప్పడంతో దాన్ని నాని అవమానంగా భావిస్తున్నారు. ఈ కారణంతోనే తిరువూరులో చంద్రబాబు నాయుడి సభకు కేశినేని నాని దూరంగా ఉన్నారు. ఆ సభకు రావల్సిందిగా రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర చేత సభకు రావల్సిందిగా రాయబారం పంపినా కేశినేని సభకు వెళ్లలేదు.
చంద్రబాబు నాయుడు తనను వాడుకుని వదిలేశారని భావిస్తోన్న కేశినేని నాని తాను త్వరలోనే కీలక నిర్ణయం తీసుకుంటానని ప్రకటించారు. టిడిపికి ఆయన రాజీనామా చేస్తారని ప్రచారం జరిగింది. కేశినేని నాని పార్టీని వీడితే ఆయన ఒక్కరే పోరు. ఆయనతో పాటు ఆయనతో సన్నిహితంగా ఉండే మాజీ ఎమ్మెల్యేలు అనుచరులు పెద్ద సంఖ్యలో టిడిపిని వీడే అవకాశాలున్నాయి. ఎన్టీయార్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి దేవినేని ఉమా పరిస్థితి కూడా సంకటంగానే ఉందని పార్టీ వర్గాలంటున్నాయి. దేవినేని నియోజక వర్గంలో మరో కొత్త అభ్యర్ధిని తెరపైకి తీసుకురాడానికి చంద్రబాబు సిద్ధం అయ్యారట. దీంతో తనకు టికెట్ రాకపోతే దేవినేని రాజకీయ సన్యాసం అయినా తీసుకోవాలి..లేదంటే పార్టీ అయినా మారాలి. ఎన్నికల నగారా మోగేసరికి రెండు పార్టీల్లోనూ ఇలా రాజీనామాలు చేసే వారి సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయి…
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…