అసెంబ్లీ ఎన్నికల విజయం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి కొత్త జోష్ నిచ్చింది. పార్టీలో పోటీ పెరగడానికి కూడా కారణమైంది. వెనువెంటనే లోక్ సభ ఎన్నికలు రావడంతో ప్రతీ ఒక్కరూ పార్లమెంటుకు వెళ్లాలని చూస్తున్నారు. దానితో నియోజకవర్గాల్లో ఆశావహుల సంఖ్య బాగా పెరిగిపోతోంది. టికెట్ కోసం పైరవీలు కూడా మొదలు పెట్టేశారు. అలాంటి నియోజకవర్గాల్లో పెద్దపల్లి కూడా ఒకటని చెప్పక తప్పదు.
ఇప్పటికీ అక్కడ ఆయన వారసుల ఆధిపత్యమే కొనసాగుతోంది. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా పెద్దపల్లి రిజర్వ్ సీటుపై అన్ని పార్టీల్లో పెద్ద చర్చే జరుగుతోంది. మంచిర్యాల -పెద్దపల్లి-జగిత్యాల మూడు జిల్లాల్లో విస్తరించి ఉన్న పెద్దపల్లి పార్లమెంట్ స్థానం హాట్ సీట్ గా మారుతోంది. గత రెండు ఎన్నికల్లో అక్కడ బీఆర్ఎస్ గెలిచినా ఈ సారి పెద్దపల్లిని తమ ఖాతాలో వేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ వ్యూహరచన చేసుకుంటోంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ లో ఆశావహుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దపల్లి లోక్ సభ పరిధిలోకి వచ్చే ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ కాంగ్రెస్ అభ్యర్థులే గెలిచారు. దానితో లోక్ సభ ఎన్నికల్లోనూ హస్తం పార్టీకే విజయం ఖాయమన్న ధీమా పార్టీ నేతల్లో పెరిగిపోయింది. ఎలాగైనా టికెట్ దక్కించుకోవాలన్న పట్టుదల కనిపిస్తోంది.
వెంకటస్వామి కుటుంబానికే మళ్లీ టికెట్ దక్కుతుందా. మాజీ మంత్రి ఆగం చంద్రశేఖర్ కు పోటీ చేసే అవకాశం వస్తుందా. రేసులో ఉన్నఇతర నేతలెవ్వరు. వెంకటస్వామి కుటుంబానికి ఉన్న ప్రత్యేకత ఏమిటి…
ఎటువంటి ఎన్నిక అయినా సరే వెంకటస్వామి కుటుంబంలో ఒకరైనా పోటీలో ఉంటారు. గెలుపు ఓటములతో సంబంధం లేకుండా ఫైట్ చేస్తారు.పైగా ఈ సారి అసెంబ్లీ ఎన్నికల గెలుపుతో ఆ కుటుంబంలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. టికెట్ ఆశిస్తున్న వారిలో చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకట స్వామి కుమారుడు వంశీ కృష్ణ ముందు వరసలో ఉన్నారు. విశాఖ ఇండస్ట్రీస్ అధినేతగా కొనసాగుతున్న వంశీ ప్రత్యక్ష రాజకీయాలపై ఆసక్తి తో ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నూరు నుంచి బరిలో నిలిచిన తండ్రి వివేక్ గెలుపులో కీలక పాత్ర పోషించారు. ఒక దశలో వంశీ చెన్నూరు నుంచి పోటీ చేయాలని అనుకున్నా… అప్పుడున్న పరిస్థితుల్లో వివేక్ అయితేనే బెటరని అధిష్టానం ఆలోచించి బరిలో దింపింది. వివేక్ భారీ మెజారిటీ తో గెలిచారు. వంశీ పెదనాన్న గడ్డం వినోద్ గతంలో చెన్నూరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి గా పని చేశారు. ఇటీవలి ఎన్నికల్లో బెల్లం పల్లి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. నాన్న, పెద్ద నాన్నలు అసెంబ్లీ లో ఉంటే, తాను పార్లమెంట్ కు వెళ్లాలని వంశీ ఆరాట పడుతున్నారు. ఇక మాజీ మంత్రి ఆగం చంద్రశేఖర్ పేరు కూడా గట్టిగానే వినిపిస్తోంది. ఆయన 2019లో పెద్ద పల్లి ఎంపీ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థి గా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి వెంకటేష్ నేతకు 4,41,321 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి ఆగం చంద్రశేఖర్‌కు 3,46,141 ఓట్లు పోలయ్యాయి. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో జహీరాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగి ఆగం చంద్రశేఖర్ ఓడి పోయారు. అధిష్టానం చంద్ర శేఖర్ అభ్యర్థిత్వాన్ని కూడా పరిశీలిస్తోంది. ఒకే కుటుంబానికి ఎక్కువ పదవులు ఇవ్వకూడదని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తే మాత్రం వంశీకి కాకుండా ఇతరులకు అవకాశం రావచ్చు. ఇదే ప్రాంతానికి చెందిన సీనియర్ నేత గొమాసె శ్రీనివాస్, నల్లాల ఓదెలు,పెర్క శ్యామ్ తదితరులు కూడా టికెట్ ఆశిస్తున్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో వచ్చిన ఓట్లను చూస్తే కాంగ్రెస్ గెలుపు సునాయాసమేనని చెప్పుకోవాలి.కాకాపోతే ఈ రెండు మూడు నెలల్లో వచ్చే మార్పులు, పార్టీల్లో అలకలు,ఫిరాయింపులు కూడా ఎన్నికలపై ప్రభావం చూపిస్తాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.అందుకే ఆశావహుల్లో కొంత టెన్షన్ ఉన్న మాట వాస్తవం…
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…