లోక్‌సభకు కేటీఆర్

By KTV Telugu On 11 January, 2024
image

KTV TELUGU :-

లోక్‌సభకు కేటీఆర్ పోటీ చేయబోతున్నారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. అదే సమయంలో కవిత లోక్‌సభకు పోటీ చేయడం లేదని కూడా స్పష్టత వస్తోంది. కేసీఆర్ ప్రతిపక్ష నేతగానే ఉంటారని కేటీఆర్ క్లారిటీ ఇచ్చారు. అంటే బీఆర్ఎస్ ప్లాన్ రెడీ చేసుకుందని అర్థమైపోతుంది.  తెలంగాణ రాజకీయాల్లోనే కేసీఆర్, కవిత ఉంటారు. జాతీయ రాజకీయాల్లోకి కేటీఆర్ వెళ్తారు. ఈ వ్యూహం వెనుక ఎదురయ్యే  పెను సవాళ్లకు సమాధానాలు వెదుక్కునే ప్రయత్నం చేశారని అనుకోవచ్చు.

సీఎం అనే రెండక్షరాల కంటే కేసీఆర్ అనే మూడు అక్షరాలే పవర్ ఫుల్ అని … కేసీఆర్ సీఎంగా ఉండటం కన్నా ప్రతిపక్ష నేతగా ఉండటమే కాంగ్రెస్ పార్టీకి డేంజర్ అని కేటీఆర్ భారీ స్టేట్‌మెంట్ ఇచ్చారు.   రానున్న రోజుల్లో కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ఎలా ఉంటుందో ఊహించుకోవాలని ఎలివేషన్లు ఇచ్చారు.  కాంగ్రెస్‌కు కేసీఆర్ ఎంత డేంజర్ అవుతారన్న సంగతి  పక్కన పెడితే.. కేసీఆర్ పూర్తిగా రాష్ట్ర రాజకీయాల్లోనే ఉండబోతున్నారని కేటీఆర్ స్పష్టమైన హింట్ ఇచ్చారు.

భారత రాష్ట్ర సమితి పరాజయం తర్వాత కేసీఆర్ చేయబోయే రాజకీయంపై అనేక విశ్లేషణలు వచ్చాయి. జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టి టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్‌గా మార్చినందున కేసీఆర్ ఇక జాతీయ  రాజకీయాలకే ప్రాధాన్యం ఇస్తారని అనుకున్నారు. నిజానికి కేసీఆర్ చాలా కాలంగా తెలంగాణలో పార్టీ వ్యవహారాలను పూర్తిగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు అప్పగించారు. కేసీఆర్ పూర్తిగా పార్టీని ఇతర రాష్ట్రాల్లో విస్తరించడంపైనే దృష్టి పెట్టారు. కేసీఆర్‌కు సహాయంగా కవిత ఉంటున్నారు. కవిత ఎంపీగా చేసి ఉండటంతో  పాటు జాతీయ పార్టీలతో అనేక విషయాల్లో అభిప్రాయాలు పంచుకునే విషయంలో ముందు ఉంటున్నందున.. బీఆర్ఎస్‌కు ఢిల్లీలో గట్టి వాయిస్‌గా కవిత ఉన్నారు. ఈ కారణంగా కేసీఆర్  ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత కూడా జాతీయ రాజకీయాలపైనే దృష్టి పెడతారని అనుకున్నారు.  కేసీఆర్ మెదక్ నుంచి లోక్ సభకు పోటీ చేయడం ఖాయమని ఎక్కువ మంది నమ్ముతున్నారు.

కానీ హఠాత్తుగా కేటీఆర్ లోక్‌సభకు పోటీ చేస్తారని బీఆర్ఎస్ వర్గాలు చెప్పడం ప్రారంభించాయి.  కేటీఆర్ లోక్‌సభకు పోటీ చేస్తారన్న  సమాచారం బయటకు వచ్చిన రెండు రోజులకే.. కవిత నిజామాబాద్ నుంచి పోటీ చేయడం లేదన్న సంకేతాలు ఇచ్చారు. ఇది బీఆర్ఎస్ నేతల్ని ఆశ్చర్య పరుస్తోంది.  కవిత నిజామాబాద్ నుంచి  పోటీ చేయడం లేదా అసలు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయడం లేదా అన్నదానిపై స్పష్టత లేదు. కానీ కేటీఆర్ లోక్‌సభకు పోటీ చేస్తే కవిత ఎమ్మెల్సీగానే కొనసాగే అవకాశం ఉంది. ఇప్పుడు కేటీఆర్ కూడా లోక్‌సభకు వెళ్తున్నారు కాబట్టి కవిత ఎమ్మెల్సీగా రాష్ట్ర రాజకీయాల్లోనే ఉండనున్నారు. బీఆర్ఎస్ తాజా ప్రకటనలను చూస్తే.. ఎంపీగా కేటీఆర్ వెళ్తే.. తెలంగాణలో కేసీఆర్ మళ్లీ చార్జ్ తీసుకుంటారని అనుకోవచ్చు.

ఈ నిర్ణయాల వెనుక పార్టీని బతికించుకోవాలన్న వ్యూహం ఉందని అర్థం చేసుకోవచ్చు.  భారత రాష్ట్ర సమితి ఇప్పుడు అత్యంత క్లిష్టమైన  పరిస్థితుల్లో ఉంది.  కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో.. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌తో ఏక కాలంలో పోరాడాల్సి ఉంది.  బీఆర్ఎస్ కు ఎలాంటి అధికార బలం లేదు సరి కదా.. పదేళ్ల పాటు పాలన చేసినందున అనేక రకమైన ఆరోపణలు, విచారణలు ఎదుర్కోవడానికి రెడీగా ఉండాల్సి ఉంది.  అదే సమయంలో..  కవచ కుండలం లాంటి తెలంగాణ సెంటిమెంట్ ను వదిలేశారన్న అపవాదు తెచ్చుకున్నారు. పైగా ఇప్పుడు జరగబోయేది  పార్లమెంట్ ఎన్నికలు. అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయంతో క్యాడర్ చాలా వరకూ సైలెంట్ అయిపోయారు. పార్లమెంట్ ఎన్నికల్లో గతంలో గెలుచుకున్నన్ని సీట్లు అయినా గెల్చుకోకపోతే.. పార్టీ క్యాడర్ దిక్కులు చూసే అవకాశం ఉంది.

ఇప్పుడు కనీసం పది సీట్లు గెల్చుకోవాలంటే..కేసీఆర్ కు ఉన్న ఒకే ఒక్క బలం సెంటిమెంట్. తామే తెలంగాణ వాయిస్ అని.. పార్లమెంట్ లో తెలంగాణ అస్థిత్వం కనిపించాలంటే.. తమకే ఓటేయాలని ప్రజల్ని నమ్మించాల్సి ఉంది. అలా చేయాలంటే కేసీఆర్ జాతీయరాజకీయాల్లోకి వెళ్తే సాధ్యం కాదు. రాష్ట్రంలోనే ఉండాలి. రాష్ట్రం తరపునే పోరాడతానని నమ్మించాలి. అందుకే కేసీఆర్ రాష్ట్రంలోనే ఉంటారని.. ప్రతిపక్ష నేతగా పోరాడతారని ప్రజలను నమ్మించాల్సి ఉంది.  అందుకే కేటీఆర్ లోక్‌సభకు వెళ్తున్నారు. కేసీఆర్ రాష్ట్రంలోనే ఉండబోతున్నారని అనుకోవచ్చు. .

కేసీఆర్ సీఎంగా ఉన్నంత కాలం రేవంత్ రెడ్డిని కీసం  గుర్తించేందుకు ఇష్టపడలేదు. ఆయన పేరు కూడా పలికేవారు కాదు. కానీ రేవంత్ రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యారు. కేసీఆర్ ప్రతిపక్ష నేత అయ్యారు. ప్రజాస్వామ్యం, రాజకీయాల్లో ఉంటే  ప్రత్యేకత అదే. ఇప్పుడు పాత్రలు రివర్స్ అయ్యాయి. మళ్లీ రాజకీయంగా పుంజుకోవాలంటే… రేవంత్ రెడ్డిపై పోరాడి ప్రజల అభిమానాన్ని మళ్లీ పొందడమే మార్గం. ఆ మార్గాన్ని కేటీఆర్ కు అప్పగించడం కన్నా.. తానే తీసుకుంటనే ఎక్కువ ప్రబావం ఉంటుందని కేసీఆర్ నమ్ముతున్నారని అనుకోవచ్చు…

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి