రామజన్మభూమిలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠాపనకు సన్నాహాలు చివరి దశలో ఉన్నాయి, ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని వీక్షించేందుకు యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ప్రతిష్టాపన కార్యక్రమం జనవరి 22న జరగబోతున్నప్పటికీ వారం ముందునుంచే సందడి మొదలుకానుంది. జనవరి 16 నుంచి 22 వరకూ రోజూ ఏదోక కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది.
జనవరి 15న మకర సంక్రాంతిలో ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. అంటే ఏ కార్యక్రమానికైనా శుభ ఘడియలు మొదలైనట్లేనని చెప్పుకోవాలి. జనవరి 16న శ్రీరాముని విగ్రహానికి ప్రతిష్ఠాపన ఆచారాలు మొదలు పెడతారు. జనవరి 17 విగ్రహాల ఊరేగింపుతో పాటూ సరయు నదినుంచి నీటిని కలశాలతో తీసుకెళ్తారు.జనవరి 18న మండప ప్రవేశ పూజ, వాస్తు పూజ, వరుణ పూజ, విఘ్నహర్త గణేశ పూజ, మార్తిక పూజ వంటి ఆచారాలతో పవిత్రోత్సవం ప్రారంభమవుతుంది.జనవరి 19న రామమందిరంలో యజ్ఞ అగ్నిగుండం స్థాపన జరుగుతుంది.దాన్నొక మహాక్రతువుగా నిర్వహిస్తారు. జనవరి 20న వివిధ నదుల నుంచి సేకరించిన నీటిని సేకరించి 81 కలశాలతో రామమందిరం గర్భగుడిని పవిత్రం చేస్తారు..వాస్తు శాంతి కార్యక్రమాలు కూడా అదే రోజున నిర్వహిస్తారు జనవరి 21న యజ్ఞం సందర్భంగా.. ప్రత్యేక పూజలు హవనాల మధ్య శ్రీరామ చంద్రుడు 125 కలశాలతో దివ్య స్నానమాచరించే ప్రక్రియ కొనసాగుతుంది. జనవరి 22నప్రధాన ఘట్టమైన ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుంది. మృగశిర నక్షత్రం సందర్భంగా మధ్యాహ్న సమయంలో శ్రీరామునికి ప్రత్యేక పూజలు చేస్తారుజనవరి 22 మధ్యాహ్నం పన్నెండు గంటల 29 నిమిషాల నుంచి 12 గంటల 30 నిమిషాల 32 సెకన్ల వరకు ప్రాణ ప్రతిష్ఠా ముహూర్తం ఉంటుంది.
అయోధ్య రామాలయం ప్రారంభోత్సవం రోజు జనవరి 22న దేశ ప్రజలందరూ దీపావళి జరుపుకోవాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఈ రోజు సాయంత్రం ప్రతి ఇంట్లో దీపం వెలిగించాలన్నారు. అందుకే జనవరి 22 వ తేదీన అయోధ్యలో ఉండే రద్దీ కారణంగా భక్తులు ఎవరూ అయోధ్యకు రావొద్దని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఆ తర్వాతి రోజు అంటే జనవరి 23 వ తేదీ నుంచి జీవితాంతం శ్రీరాముడిని దర్శించుకోవచ్చని సూచించారు. మరో పక్క అయోధ్య రాముడి ప్రసాదానికి కూడా అనేక ప్రత్యేకతలు ఉన్నాయి…
అయోధ్య ప్రాణప్రతిష్ట సందర్భంగా లక్ష లడ్డూలు పంపించాలని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించింది. ఒక్కో లడ్డూ 25 గ్రాముల బరువు ఉండే విధంగా తయారు చేస్తున్నారు. నిజానికి దేశంలో ఎన్నో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో వేర్వేరు వంటకాలను ప్రసాదంగా అందజేస్తుంటారు. పూరీలోని జగన్నాథస్వామి ఆలయంలో ఏకంగా 56 రకాల నైవేద్యాలను సమర్పిస్తుంటారు. ఆలయాల్లో ప్రసాదాలకు ఎంతో ప్రత్యేకత కూడా ఉంటుంది. భక్తులు ఎంతో ఇష్టంగా వాటిని స్వీకరిస్తుంటారు. రామాలయ సందర్శనకు వచ్చే భక్తులకు అందజేసే ప్రసాదం విషయంలో శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రసాదంగా ఇలాచీదానా అందించాలని ట్రస్టు నిర్ణయించింది. ఇది తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుందని అంటున్నారు. పంచదార, ఏలకులతో తయారుచేసే ఇలాచీదానాను ఇప్పటికే దేశంలోని కొన్ని ఆలయాల్లో భక్తులకు అందిస్తున్నారు. దీంతో ఈ ప్రసాదం తయారీ బాధ్యతను రామ్‌విలాస్ అండ్ సన్స్ దుకాణానికి రామజన్మభూమి ట్రస్ట్ అప్పగించింది. ఇలాచీదానా ఉదర సంబంధిత సమస్యలను పరిష్కరిస్తుంది..
ఒక విషయం మాత్రం ప్రతీ ఒక్కరూ గుర్తుపెట్టుకుంటే మంచిది. ప్రాణప్రతిష్ట రోజే అయోధ్యకు వెళ్లాలన్న కోరిక సహేతుకం కాదు. ఆ రోజు నగరంలో నిలబడే చోటు కూడా ఉండకపోవచ్చు. అందుకే కాస్త ఆగి వెళితే ప్రశాంతంగా దర్శనం చేసుకోవచ్చు. ఇలాచీదానా ప్రసాదం ఎప్పుడైనా దక్కుతుంది. ఎందుకంటే అయోధ్య రాముడు అందరివాడు కదా….
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…