జగ్గంపేటలో గెలుపెవరిది ?

By KTV Telugu On 23 January, 2024
image

KTV TELUGU :-

తూర్పు గోదావ‌రి జిల్లాలోని కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం జ‌గ్గంపేట‌. కాపు సామాజిక వ‌ర్గానికి పెట్టని కోటగా ఉన్న ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ఇప్పుడు రాజ‌కీయం రసవత్తరంగా మారింది. 1983 నుంచి ఈ నియోజకవర్గంలో జ్యోతుల, తోట ఫ్యామిలీలు చక్రం తిప్పుతున్నాయి. గడచిన ఎన్నికల్లో జ్యోతుల చంటిబాబు గెలిచారు. అయితే జగ్గంపేటలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. అభ్యర్థి మార్పు తథ్యమని తేలడంతో వైసీపీలోనే అంతర్గత కుమ్ములాటలు జరుగుతుండగా.. మరోవైపు జనసేనతో కలిసి టీడీపీ అడుగులు వేస్తుండటంతో ఈక్వేషన్స్‌ అన్ని మారిపోతున్నాయి. అయితే జనసేన నేత పాటంశెట్టి సూర్య చంద్ర ఈ నియోజకవర్గంలో కీరోల్‌ ప్లే చేయడం పక్కా అని తెలుస్తోంది. మరి ఈ సారి ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు ?

జగ్గంపేట నియోజకవర్గంలో 2019 ఎన్నికల్లో వైసీపీ ఇక్కడ భారీ ఓట్‌ షేర్‌తో విజయం సాధించింది. వైసీపీ నుంచి బరిలోకి దిగిన జ్యోతుల చంటిబాబుకు  52 శాతం ఓట్లు పడ్డాయి. రాష్ట్రవ్యాప్తంగా కనిపించిన వైసీపీ వేవ్‌.. ఈ నియోజకవర్గంలో కూడా కనిపించింది. ఇక టీడీపీ నుంచి బరిలోకి దిగిన జ్యోతుల నెహ్రూకు 39 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి.   జనసేన నుంచి పోటీ చేసిన పాటంశెట్టి సూర్య చంద్రకు 6 శాతం ఓట్లు వచ్చాయి.  ఇవి గత ఎన్నికల లెక్కలు కాగా.. ఈ సారి పరిస్థితులు మారాయన్న ప్రచారం జోరుగా సాగుతోంది. . రాజకీయ పరిణామాలైతే ఊహించనంతగా మారాయి. జ్యోతుల చంటిబాబు మళ్లీ పోటీ చేయడం లేదు,  ఆయనకు వైసీపీ టిక్కెట్ నిరాకరించింది. కొత్తగా మాజీ మంత్రి  తోట నర్సింహాన్ని ఇంచార్జుగా నియమించారు.  గత ఎన్నికల్లోనే ఆయనకు ఆరోగ్యం బాగోలేకపోవడంతో  ఆయన భార్యకు పెద్దాపురం టిక్కెట్ ఇచ్చారు.  ఆక్కడ ఆమె ఓడిపోయింది. ఈ సారి ఆరోగ్యం బాగోలేకపోయినా తోట నరసింహానికీ అదీ కూడా జగ్గంపేట టిక్కెట్ ఇవ్వాలని డిసైడయ్యారు.   మరోవైపు టీడీపీ, జనసేన కూటమిగా ఎన్నికలకు వెళుతుండటంతో ఈ ఎన్నికల్లో  కూటమికి చాలా విషయాలు అనుకూలంగా మారే అవకాశం ఉంది.

జగ్గంపేట కాపు సామాజిక వర్గానికి పెట్టని కోట. ఈ నియోజకవర్గంలో మెజారిటీ జనాభా ఆ సామాజిక వర్గానిదే. 38 శాతం ఉన్న కాపు ఓటర్లలో మెజార్టీ ఈ సారి టీడీపీ, జనసేన కూటమి వైపు ఉండనున్నారు.   మాములుగానే తమ సామాజిక వర్గ నేత అయిన జ్యోతుల నెహ్రూకు కాపు వర్గాల్లో మద్దతు ఉంది.  జనసేన కూడా కలిసి రావడంతో ఓట్ షేర్‌ మరింత పెరిగే అవకాశం ఉంది.  అయితే పథకాల వల్ల లబ్ది  పొందిన వారు  వైసీపీకి మద్దతు పలికే అవకాశం కనిపిస్తోంది.  ఇక 19 శాతం ఉన్న ఎస్సీ జనాభాలో వైసీపీకి మెజార్టీ మద్దతు లభిస్తోంది.  14 శాతం ఉన్న తూర్పు కాపుల్లో  టీడీపీకి మొగ్గు కనిపిస్తోంది.  వైసీపీకి మద్దతు పలికేవారంతా సంక్షేమ పథకాల లబ్ధిదారులే అనుకోవచ్చు.    జనసేన మద్ధతుతో టీడీపీ బరిలోకి దిగితే జ్యోతుల నెహ్రూ గెలిచే అవకాశం ఉందని నియోజకవర్గంలో చర్చ జరుగుతోంది.

జనసేన, టీడీపీ మధ్య పొత్తు ఉన్నా.. స్థానికంగా జనసేన నేత సూర్యచంద్ర కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఆయనకు  జ్యోతుల నెహ్రూకు మధ్య సంబంధాలు సరిగ్గా లేవు.  ఆయన మద్దతివ్వకపోతే  ఓట్లు బదిలీ అయ్యే అవకాశాలు తక్కువ.  ఇది వైసీపీకి పాజిటివ్ గా మారి తోట నర్సింహానికి మేలు చేసే అవకాశం ఉంది.   జగ్గంపేట జంగ్‌లో గెలుపోటములను డిసైడ్ చేసేది కేవలం జనసేన సపోర్ట్‌ మాత్రమే అన్నట్టుగా కనిపిస్తోంది.  మరో వైపు వైసీపీ టిక్కెట్ దక్కని సిట్టింగ్ ఎమ్మెల్యే ఏం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. టిక్కెట్ నిరాకరించినప్పుడు ఆయన  టీడీపీలో చేరుతానని లీకులు పంపారు. నిజానికి ఆయన చాలా కాలం టీడీపీలోనే పని చేశారు. జ్యోతుల నెహ్రూ టీడీపీలో చేరడంతో ఆయన వైసీపీలో చేరాల్సి వచ్చింది.  ఇప్పుడు వైసీపీలోనూ టిక్కెట్ రావడం లేదు.

ప్రస్తుతానికి జ్యోతుల చంటిబాబు సైలెంట్ గా ఉన్నారు. ఎన్నికల సమయానికి ఏదో ఓ స్టెప్ తీసుకోనున్నారు. ఇండిపెండెంట్ గా పోటీ చేసే అవకాశాలు లేవు. ఈ మధ్య కాలంలో పవన్ తో సుదీర్ఘంగా చర్చించారు. అయితే సీటు విషయంలో ఆయన కూడా క్లారిటీ ఇవ్వలేదని తెలుస్తోంది. ఈ కారణంగా ఆయన ఏం చేస్తారన్నదానిపైనా రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇండింపెండెంట్గా పోటీ చేస్తే చాలా వరకూ వైసీపీ క్యాడర్ ఆయనతో వెళ్తుంది. అది విపక్ష కూటమికి మేలు చేస్తుంది. టీడీపీలో చేరినా విపక్షకూటమికి మేలే జరుగుతుంది. మొత్తంగా జగ్గంపేటలో టీడీపీ, జనసేన కూటమికి అడ్వాంటేజ్ ఉందని అనుకోవచ్చు…

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి