ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమితురాలైన వై.ఎస్.షర్మిల ఎవరు వదిలిన బాణం? కొన్నేళ్ల క్రితం ఆమె జగనన్న వదిలిన బాణాన్ని అని చెప్పుకున్నారు. కానీ ఇపుడు అదే జగన్ మోహన్ రెడ్డిని గురి చూసి ఆమె మాటల బాణాలు సంధిస్తున్నారు. ఆమె కాంగ్రెస్ అధినాయకత్వం వదిలిన బాణమా? లే ఏపీలో వైసీపీకి ప్రధాన ప్రత్యర్ధి అయిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వదిలిన బాణమా? వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ నేతలు అయితే షర్మిల వ్యాఖ్యలు చూస్తోంటే ఆమె చంద్రబాబు చివరి అస్త్రంలా కనిపిస్తున్నారని అంటున్నారు. ఆమె ఎవరి బాణమో తెలీదు కానీ.. ఏపీ రాజకీయాల్లో ఆమె ఎంట్రీ మాత్రం రాజకీయ వర్గాల్లో ప్రకంపనలే సృష్టిస్తోంది. అయితే షర్మిల రాక వల్ల తమకొచ్చిన ఇబ్బందేమీ లేదని వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఏపీ పిసిసి అధ్యక్షురాలిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలి ప్రసంగంలోనే వై.ఎస్. షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక హోదా తీసుకురావడంలో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ తో పాటు తెలుగుదేశం పార్టీ కూడా ఘోరంగా విఫలం అయ్యిందని ఆమె ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా కాదు కదా కనీసం ప్రత్యేక ప్యాకేజీ కూడా తెచ్చుకోలేకపోయారని అన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వెంటనే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారని ఆమె అంటున్నారు. రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలన్నదే తన తండ్రి కల అని దాన్ని నిజం చేయడానికే తాను కాంగ్రెస్ పార్టీలో చేరానని షర్మిల అన్నారు. కాంగ్రెస్ సిద్ధాంతాలు నచ్చడం వల్లనే ఆ పార్టీలో చేరానన్నారు. కాంగ్రెస్ విజయం కోసం కష్టపడతానని అన్నారు.
తెలంగాణాలో రాజకీయాలు చేస్తానన్న షర్మిల అక్కడి నుంచి ఏపీకి షిఫ్ట్ అయ్యారు. దీని వెనుక రాజకీయ కుట్ర ఉందన్నది వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ నాయకత్వం అనుమానం. కుటుంబాలను చీల్చడంలో చంద్రబాబు నాయుడు ..కాంగ్రెస్ పార్టీలూ రెండూ ఒక్కటే నని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. కుటుంబాలను చీల్చే కుట్రలు జరుగుతాయని షర్మిల పిసిసి ప్రెసిడెంట్ కాకముందే జగన్మోహన్ రెడ్డి ఆరోపించడం గమనార్హం. పిసిసి అధ్యక్షురాలైన షర్మిల ఏపీలో అధికారంలో ఉన్న తన సోదరుడు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్రమైన విమర్శలే చేశారు. చంద్రబాబు నాయుడు రెండు లక్షల కోట్లు అప్పులు చేస్తే.. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్ని రకాల అప్పులూ కలుపుకుని మొత్తం మీద ఏపీ అప్పులను పది లక్షలకు పెంచారని తీవ్రమైన వ్యాఖ్య చేశారు. ఇంతకాలం చంద్రబాబు నాయుడు అండ్ కో చేసిన ఆరోపణనే షర్మిల చేయడం విశేషం.
అప్పుల విషయం ఒక్కటే కాదు రాజధానుల విషయంలోనూ షర్మిల వ్యాఖ్యలు చంద్రబాబు నాయుడి లైన్ లోనే ఉన్నాయి. మూడు రాజధానులు తెస్తామని ఒక్క రాజధాని కూడా తేలేకపోయారని..ఇపుడు ఏపీ ప్రజలను మీ రాజధాని ఏదంటే ఏం చెప్పాలో తెలీని దుస్థితి ఉందని షర్మిల విమర్శించారు. లక్షల కోట్ల అప్పులు చేసినా అభివృద్ధి ఎక్కడా జరగలేదన్నారు. దళితులపై దాడులు చాలా దుర్మార్గంగా పెరిగిపోయాయని అన్నారు. రైతుల పరిస్థితి మరీ అధ్వాన్నంగా ఉందన్నారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి తన తండ్రి వై.ఎస్.ఆర్. హయాంలోనే కుడి ఎడమ కాలువల తవ్వకాలు పూర్తయితే ఆ తర్వాత చెప్పుకోదగ్గ పనులేవీ జరక్కపోడానికి చంద్రబాబు, జగన్ మోహన్ రెడ్డి ఇద్దరూ కారణమే అన్నారు.
తెలుగుదేశం, వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీలు రెండూ కూడా బిజెపితో కుమ్మక్కు అయ్యి రాజకీయాలు చేస్తున్నాయని షర్మిల నిప్పులు చెరిగారు. ప్రత్యేక హోదా కోసం ప్రతిపక్ష నేతగా దీక్షలు చేసిన జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక చెప్పుకోదగ్గ ఉద్యమం ఏమీ చేయలేదన్నారు. వైసీపీ టిడిపిలు రెండింటికీ కలిపి 25 లోక్ సభ స్థానాలు ఉన్నప్పటికీ కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడం లేదని షర్మిల విమర్శించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ , విజయవాడ మెట్రో, విభజన హామీలు ఏవీ కూడా వైసీపీ,టిడిపిలు సాధించలేకపోయాయన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే ఆంధ్ర ప్రదేశ్ అభివృద్దికి బాటలు పడతాయని…అప్పుడే మంచి రోజులు వస్తాయని ఆమె అన్నారు. షర్మిల చేసిన వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రకంపనలే సృష్టించాయి. ఆమె తన సోదరుడిపై ఇంత ఘాటుగా విమర్శలు చేస్తారని ఎవరూ ఊహించలేదు. కానీ ఆమె నిర్మొహమాటంగా దుమ్ము దులిపేయడంపై చర్చ జరుగుతోంది.
షర్మిల యాస భాష గతంలో లా లేవని వైసీపీ అంటోంది. బహుశా ఆమె చంద్రబాబుకు ఆఖరి అస్త్రంగా పనిచేస్తున్నారేమో అని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డే అనుమానం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ గురించి అసలు షర్మిలకు ఏం తెలుసును అని ఆయన నిలదీశారు. ఆంధ్ర ప్రదేశ్ కు నష్టం చేసిందే కాంగ్రెస్ కాగా ప్రత్యేక హోదాను ఇస్తామన్న కాంగ్రెస్ చట్టంలో ఎందుకు పెట్టలేదో చెప్పాలని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. తన తండ్రి మరణానంతరం ఆయన పేరును ఎఫ్.ఐ.ఆర్. లో చేర్చి వై.ఎస్. కుటుంబాన్ని అనేక విధాలుగా వేధించిన కాంగ్రెస్ లో ఆమె ఎందుకు చేరారో అర్ధం కావడం లేదంటున్నారు వైసీపీ నేతలు. జగన్ మోహన్ రెడ్డిపై అక్రమ కేసులు పెట్టామని అప్పటి సీనియర్ కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాదే ఒప్పుకున్నారని వైసీపీ గుర్తు చేస్తోంది. అటువంటి కాంగ్రెస్ పార్టీలో చేరి ఏం సాధించదలచుకున్నారని వారు షర్మిలను నిలదీస్తున్నారు.మొత్తానికి షర్మిల ఎంట్రీతో ఏపీ రాజకీయాలు కొత్త పుంతలు తొక్కేలా కనిపిస్తోందంటున్నారు రాజకీయ పండితులు..
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…