చిలకలూరిపేట పేరు వింటేనే రెండు ప్రధాన పార్టీలు భయపడిపోతున్నాయి. ఇంతవరకు గెలిచిన అభ్యర్థులను నిలబెట్టేందుకు వణికిపోతున్నాయి. ఈ సారి గెలుపుపై రెండు పార్టీలు ధీమాగా ఉండలేకపోతున్నాయి. వైసీపీ ఇంచార్జీని మార్చేస్తే.. ఈ సారి ప్రత్తిపాటికి టికెట్ ఇవ్వకూడదని టీడీపీ అధినేత డిసైడ్ అయినట్లు వార్తలు వస్తున్నాయి…..
పేటలో కోటకట్టేదెవరో చెప్పడం కష్టమేనన్న చర్చ జరుగుతోంది. టీడీపీలో రాజకీయ జీవితం ప్రారంభించి.. తర్వాత వైసీపీలో చేరి చిలకలూరిపేట ఎమ్మెల్యే అయిన విడదల రజనీ.. ఓటమి ఖాయమని జగన్ భావించారో ఏమో రూటు మార్చేశారు. రజనీకి ట్రాన్స్ ఫర్ ఇచ్చేశారు. చిలకలూరిపేట ఇంచార్జీగా ఉన్న విడదల రజనీని గుంటూరు పశ్చిమకు పంపారు. దానికి కారణాలు లేకపోలేదు. చిలకలూరిపేటలో రజనీ పట్ల వ్యతిరేకత బాగా పెరిగిందని జగన్ జరిపించిన ఐ ప్యాక్ సర్వేలో తేలిందట. ఆమె నియోజకవర్గ ప్రజలకు చేరువగా లేరని వారి సమస్యలు పట్టించుకునే పరిస్థితిలో ఆమె లేరని నివేదికలు వచ్చాయి. అలాగని ఆమెను పూర్తిగా వదులుకోవడం ఇష్టం లేక గుంటూరు పశ్చిమానికి మార్చేశారు. అక్కడ కూడా ఎమ్మెల్యే టికెట్ దొరుకుతుందా లేదా అన్నది వేరే విషయం. అయితే గుంటూరు పశ్చిమ ఓట్ల గోల్ మాల్ లో రజనీ హస్తం ఉందని ఇప్పుడు టీడీపీ, జనసేన ఆరోపిస్తున్నాయి. హైదరాబాద్ కేంద్రంగా ఆమె గేమ్ ఆడుతున్నారని, కొన్ని వేల ఓట్లు తొలగింపజేశారని ఈసీకి ఫిర్యాదు చేశారు. అదీ ఒక కోణమైతే చిలకలూరిపేట వైసీపీ కష్టాలు మరో కోణం. మల్లెల రాజేష్ నాయుడుకి చిలకలూరిపేట ఇంచార్జీ పదవి ఇచ్చారు. అదీ వర్కవుట్ కాదన్న అనుమానాలు తాడేపల్లి ప్యాలెస్ వర్గాల్లో వినిపిస్తోంది. కాపు సామాజిక వర్గానికి చెందిన రాజేష్ నాయుడుకు ఇంచార్జీ పదవి ఇవ్వడం ద్వారా ఓట్లు దండుకోవచ్చని భావించినా.. ఆయనకు అంత సీన్ లేదని ఐ ప్యాక్ తాజా సర్వే తేల్చింది. దానితో ప్రస్తుతానికి మౌనంగా ఉండి.. ఎన్నికల నాటికి అభ్యర్థిని మార్చాలని వైసీపీ అధిష్టానం భావిస్తోందట…
వైసీపీ పరిస్థితి అలా ఉంటే టీడీపీ తీరు కూడా ఏమంత బాగోలేదు. మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పట్ల నియోజకవర్గంలో అంత సానుకూలత లేదని కూడా వార్తలు వస్తున్నాయి. దానితో మార్పు అనివార్యమని చెప్పుకుంటున్నారు…
విడదల రజనీని రాజకీయాల్లోకి తెచ్చి దెబ్బతిన్న న్యాయకుడు ప్రత్తిపాటి పుల్లారావు. గురువును ఓడించిన శిష్యురాలిగా రజనీ చరిత్రకు ఎక్కారు. ఓడినప్పటి నుంచి పుల్లారావు నియోజకవర్గంలో యాక్టివ్ గా ఉన్నప్పటికీ టీడీపీలో ఏదో వెలితి కనిపిస్తోంది. పుల్లారావు చిలకలూరిపేటలో మూడు సార్లు గెలిచారు. 2014-19 మధ్య మంత్రిగా కూడా పనిచేశారు. ఇంతటి చరిత్రున్న ప్రత్తిపాటికి రాబోయే ఎన్నికల్లో టికెట్ గ్యారెంటీ లేదని పార్టీలో ప్రచారం జరుగుతోంది. చిలకలూరిపేటలో ప్రత్తిపాటి అంటే పార్టీనేతల్లోనే బాగా వ్యతిరేకత పెరిగిపోయిందని సమాచారం.అందుకని చిలకలూరిపేటలో పోటీచేయించటం కన్నా నరసరావుపేటలో పోటీచేయిస్తే ఎలాగుంటుందని చంద్రబాబునాయుడు ఆలోచిస్తున్నట్లు పార్టీలో టాక్ వినబడుతోంది. చిలకలూరిపేట నేతలు ఈమధ్యనే చంద్రబాబును కలిసి ప్రత్తిపాటికి తప్ప ఇంకెవరికైనా టికెట్ ఇవ్వాలని గట్టిగానే చెప్పారట. అందుకనే చంద్రబాబు కూడా టెలిఫోనిక్ సర్వే చేయిస్తున్నట్లు సమాచారం. నరసరావుపేటలో అయితే ప్రత్తిపాటితో పాటు అట్లా చిన్నవెంకటరెడ్డి, డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు ఇద్దరిపైనా టెలిఫోనిక్ సర్వే జరుగుతోంది. ఇపుడు నరసరావుపేట ఇన్చార్జిగా చదలవాడ పనిచేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో తనకే టికెట్ అని చదలవాడ చాలా ఆశలు పెట్టుకున్నారు. అలాంటిది సడెన్ గా చంద్రబాబు టెలిఫోనిక్ సర్వే జరిపిస్తుండటంతో చదలవాడలో టెన్షన్ పెరిగిపోతోంది. అది వేరే విషయం. ఇప్పుడు టీడీపీ తరపున చిలకలూరిపేటలో ఎవరిని పోటీ చేయించాలన్నదే పెద్ద సమస్య. ఎందుకంటే పుల్లారావు ఓడిపోతారని చిలకలూరిపేట టెలిఫోనిక్ సర్వేలో తేలిందట…
వైసీపీలో జగన్మోహన్ రెడ్డి ఎంఎల్ఏలకు టికెట్లు నిరాకరిస్తున్నారు. కొందరు మంత్రులు, ఎంఎల్ఏలను నియోజకవర్గాలు మార్చేస్తున్నారు. అభ్యర్ధుల విషయంలో జగన్ ధైర్యంగా మార్పులు చేస్తున్నట్లే చంద్రబాబు కూడా చేయగలరా ? అలా చేయగలిగితే ఫలితం సానుకూలంగా ఉంటుందని తమ్ముళ్ళు అభిప్రాయపడుతున్నారు. రజనీని ట్రాన్స్ ఫర్ చేసినట్లు పుల్లారావును బదలీ చేయగలరా అన్నది పెద్ద ప్రశ్న. ఎందుకంటే రా కదలి రా సభల్లో వైసీపీ ట్రాన్స్ ఫర్లపై చంద్రబాబు సెటైర్లు వేస్తున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో…
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…