కోమటిరెడ్డి దూకుడు..!

By KTV Telugu On 26 January, 2024
image

KTV TELUGU :-

మంత్రి  పదవిని చేపట్టిన తర్వాత నల్లొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి యమ దూకుడును ప్రదర్శిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, ఇతర మంత్రుల కంటే కూడా ఆయన ఎక్కువ మాట్లేడేస్తున్నారు. అందులోనూ   బీఆర్ఎస్ నేతలను కార్నర్ చేయడంలో కాంగ్రెస్ నేతలందరి కంటే కోమటిరెడ్డి ముందున్నారనే చెప్పక తప్పదు. ఒక ఉద్దేశంతోనే ఆయన అలా చేస్తున్నారని కాంగ్రెస్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది….

గులాబీ నేతల నోటికి తాళ్లం వేసేదెవ్వరన్న ప్రశ్నకు వచ్చే తొలి సమాధానం  కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని చెప్పాల్సిందే. తమలపాకుతో నువ్వొకటంటే తలుపుచెక్కతో నేను ఒకటి అంటానన్న  రేంజ్ లో కాంగ్రెస్ నేతలకు కోమటిరెడ్డి  బదులిస్తున్నారు. అవినీతి అయినా, ఆరు గ్యారెంటీలైనా సరే బీఆర్ఎస్ కు గట్టి కౌంటర్లు ఇస్తున్నదీ కోమటిరెడ్డేనని చెప్పాలి. ఇతర కాంగ్రెస్ నేతలు కూడా ఎదురుదాడి చేస్తున్నప్పటికీ వాళ్లెవ్వరూ కోమటిరెడ్డికి సరితూగరని చెప్పాల్సిందే.ఉచిత కరెంటును లోక్ సభ ఎన్నికలు ముగిసే దాకా వాయిదా వేస్తారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తుంటూ  చూడండెహే… ఫిబ్రవరి నెల నుంచి అమలు చేస్తామని కోమటిరెడ్డి గట్టిగా సమాధానమిస్తున్నారు. ఫిబ్రవరి నుంచి కరెంట్ బిల్లులు కట్టొద్దని  పేద, మధ్య తరగతి ప్రజలకు కేటీఆర్ చెబుతుంటే… ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చి తీరుతామని  కోమటిరెడ్డి చెబుతున్నారు. బీఆర్ఎస్ నేతలు టెన్షన్ పడాల్సిన పనిలేదని, ఇచ్చిన హామీలన్నింటినీ వంద రోజుల్లో అమలు  చేసి తీరుతామని ఆయన కుండబద్దలు కొడుతున్నారు.

కోమటిరెడ్డి టార్గెట్ బీఆర్ఎస్సేనని చెప్పక తప్పదు. బీఆర్ఎస్ పూర్తిగా భూస్థాపితం కావాలన్నదే ఆయన ఆకాంక్షగా  చెప్పుకోవాలి. పైగా కేసీఆర్ అంటే కోమటిరెడ్డి ఒంటికాలిమీద లేస్తుంటారు. అందుకు వేరు కారణం కూడా లేకపోలేదు..

బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య మాటల తూటాలు పేలుతున్న రోజుల్లో ఎక్కువ స్కడ్లు వదులుతున్నది కూడా కోమటిరెడ్డి మాత్రమేనని చెప్పాలి. గత ప్రభుత్వంలో అక్రమాలను  బయటపెట్టడంపై ఆయన దూకుడును పెంచారు.  తమ ప్రభుత్వంపై మాట్లాడుతున్న వాళ్లు ఐదారు నెలల్లో తీహార్ జైల్లో ఉంటారని హెచ్చరించారు. కారు వెళ్లింది సర్వీసింగ్ కు కాదని, పర్మినెంట్ గా షెడ్డుకేనని ఆయన ఆరోపించారు. లోక్ సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పూర్తిగా తుడిచి పెట్టుకు పోవడం ఖాయమని కోమటిరెడ్డి జోస్యం చెబుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత పదిమంది ఎమ్మెల్యేలు కూడా మిగలరన్నారు. లోక్ సభ ఎన్నికల తరువాత బీఆర్ఎస్ పార్టీకి చెందిన 30 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వస్తారన్నది కోమటిరెడ్డి లెక్క. బీఆర్ఎస్‌కు ఒక్క పార్లమెంట్ సీటు కూడా రావడం కష్టమన్నారు.భద్రాద్రి థర్మల్‌ విద్యుత్ కేంద్రాల్లో అక్రమాలతో పాటు ఛత్తీస్‌గఢ్‌లో కరెంటు కొనుగోళ్లలో అవినీతి బయటపడుతుందన్న అక్కసుతోనే తనపై మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి ఆరోపణలు చేస్తున్నారని ఆయన చెప్పారు. కేసీఆర్ పార్టీలో గొడవలు నడుస్తున్నాయన్నారు. బీఆర్ఎస్‌లో బావ బావమరిది మధ్య కొట్లాటలు నడుస్తున్నాయని కోమటి రెడ్డి ఆరోపించారు. మరోవైపు బిడ్డ కవిత,ఎంపీ సంతోష్ మధ్యలో కూడా కొట్లాట నడుస్తుందన్నారు. కోమటిరెడ్డి దూకుడుకు  ప్రత్యేకమైన కారణం ఉందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు అంటున్నాయి. పార్టీలో మార్పులు జరిగి రేవంత్ రెడ్డి దిగిపోవాల్సి వస్తే తనకు సిఎం అయ్యే అవకాశాలు మెరుగుపరుచుకునేందుకు కోమటిరెడ్డి ప్రయత్నిస్తున్నారని చెబుతున్నారు.నిత్యం ఏదోటి మాట్లాడితే  అధిష్టానం దృష్టిలో పడతామని ఆయన విశ్వసిస్తున్నారు. అసలు ఈ పాటికే తనకు ముఖ్యమంత్రి పదవి వచ్చి ఉండాల్సిందన్నది కోమటిరెడ్డి ఆలోచన..

కోమటిరెడ్డికి ఆకాంక్షలు చాలా ఎక్కువే. తమ కుటుంబం మొత్తం కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తోందన్నది ఆయన ఆలోచనగా చెప్పాలి. అలాంటిది తనను ఒక్క నల్లొండ జిల్లా నేతగానే చూస్తున్నారని కూడా ఆయనకు చాలా రోజులుగా ఆందోళన ఉంది. ఇప్పుడు ఆ పరిధిని దాటుకుని రాష్ట్ర స్థాయి నేతగా, ముఖ్యమంత్రిగా ఎదగాలన్న ప్రయత్నాలను కోమటిరెడ్డి కొనసాగిస్తున్నారు..

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి