ఏపీలో టీడీపీ, జనసేన కలవడం విన్నింగ్ కాంబినేషన్ అనుకున్నారు. కానీ పొత్తులు అంటే అంతర్గతంగా ఎంత పోరాడుకున్నా బయట మాత్రం స్మూత్ గా జరిగిపోవాలి. ఒకరి పై ఒకరు ద్వేషం పెంచుకునేలా రాజకీయం చేస్తే ఓటు బ్యాంక్ ట్రాన్స్ ఫర్ కాదు. అదే జరిగితే పొత్తుల వల్ల ప్రయోజనమే ఉండదు. ఈగోలకు పోతున్న టీడీపీ, జనసేన మధ్య అలాంటి పరిస్థితే కనిపిస్తోంది.
చంద్రబాబు రెండు సీట్లకు అభ్యర్థుల్ని ప్రకటించారు కాబట్టి తాను రెండు సీట్లను ప్రకటిస్తున్నానని పవన్ కల్యాణ్ కార్యకర్తలో.. అభిమానులో అర్థం కాని క్యాడర్ ను సంతృప్తి పర్చడానికి సినిమా డైలాగ్ తరహాలో ప్రకటన చేశారు. ఆ తర్వాత సాయంత్రానికి ఆయన సోదరుడు నాగబాబు.. ప్రతి చర్యకు ప్రతి చర్య ఉంటుందని హెచ్చరిక జారీ చేశారు. ఈ సోదరుల రాజకీయం చూసిన తర్వాత సహజంగానే చాలా మంది టీడీపీ క్యాడర్ కు మండిపోయింది. వీరితో పెట్టుకుంటే జరిగేదేమీ ఉండదని.. వారిని అలా వదిలేయాలన్న డిమాండ్లు ప్రారంభమయ్యాయి. కేవలం ఎన్నికల గురించి కాదని తర్వాత కలసి పరిపాలన చేయాల్సి వస్తుంది కాబట్టి అప్పుడు వీరి ఈగోలతో అసలు సాగదని.. పరిస్థితి అక్కడి వరకూ తెచ్చుకోకుండా.. తెంపేసుకోవడమే బెటర్ అనే సలహాలు ఎక్కువగా ఇస్తున్నారు. కానీ టీడీపీ అధినేత సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ రచ్చను పట్టించుకోలేదు.
ఈగో అనే కాన్సెప్ట్ తో ఖుషీ అనే ప్రేమ కథను తీసి సూపర్ హిట్ కొట్టిన పవన్ కల్యాణ్… ఆ ఈగో రాజకీయ పార్టనర్ల మధ్య కూడ ఉంటే సూపర్ హిట్ అవుతుందని అనుకుంటున్నారేమో కానీ.. ఇది సినిమాకాదనే సంగతిని ఆయన గుర్తు చేసుకుంటే బెటర్. రెండు చోట్ల పోటీ చేయాలని అనుకుంటే..ఆ రెండు చోట్ల పోటీ చేస్తామని చెప్పడం వేరు.. చంద్రబాబు ప్రకటించారు కాబట్టి మేము ప్రకటిస్తామని చెప్పడం వేరు. పొత్తు ధర్మం గురించి మాట్లాడేంత ఏం జరిగిందని ?. నిలకడలేని వ్యవహారాలు… రాజకీయాలు.. ఎప్పుడు ఏం చేస్తారో తెలియని మాటలతో గందరగోళపడే పవన్.. రాజకీయాల్లో మాటల్ని కూడా పొదుపుగా .. వాడాల్సి ఉటుంది. లేకపోతే ఎన్నో అనర్థాలకు దారి తీస్తుంది.
ఏ పొత్తులోనైనా సిట్టింగ్ స్థానాలను ఎవరూ వదులుకోరు. మండపేట సిట్టింగ్. అలాంటిలాంటి సిట్టింగ్ కాదు. కంచుకోట. ప్రజారాజ్యం ఉన్న సమయంలోనూ టీడీపీ గెలిచింది. అలాంటిది ఎలా ఇస్తారనుకుంటారు ?. అరకు నియోజకవర్గంలో అసలు జనసేన కు కనీస మద్దతు ఉందా?. ఈ రెండు చోట్ల చంద్రబాబు అభ్యర్థుల్ని ప్రకటించడం పొత్తు ధర్మం ఉల్లంఘించడం ఎలా అవుతుంది ?. ఎదుట ఓ రాక్షసుడ్ని ఎదుర్కొంటున్నప్పుడు ఇలాంటి మాటలతో ఎవరైన సొంత కుంపటి పెట్టుకుంటారా?. కానీ పవన్ కల్యాణ్ పెట్టుకుంటారు.. నాగబాబు పెట్టుకంటారు..?. ఎందుకంటే.. వారికి అసలు శత్రువుపై పోరాడటం కన్నా.. తమ ఓటమికి దగ్గర దారులు వెదుక్కోవడం చాలా ఇష్టం.
పొత్తు బలహీనపడితే నష్టం ఎవరికి.. జనసేన పార్టీకి.. టీడీపీకి ఏ నష్టం లేదు. ఏపీకే నష్టం. మరోసారి జగన్ వస్తే ఎంతటి భయంకర పరిస్థితులు ఉంటాయో ఇప్పటికే శాంపిల్ గా చూపించారు. ఇలాంటి పరిస్థితుల్లో బలానికి తగ్గట్లుగా వ్యవహరించక ఈగోలకు పోయి ఎవర్నో సంతృప్తి పర్చడానికి స్టేట్ మెంట్లు ఇస్తే మొదటికే మోసం వస్తోంది. పొత్తులపై నమ్మకం చెరిపేసి.. రెండు పార్టీల క్యాడర్ లలో ఒకరిపై ఒకరికి నమ్మకం పోయేలా చేస్తే.. మొదటికే మోసం వస్తుంది. అయినా తమ బలం పెరిగిపోయిందని .. అనుకునే జనసేన క్యాడర్ తెలంగాణలో ఫలితాల్ని గుర్తుకు తెచ్చుకుంటే బెటర్. పవన్ కు వచ్చే జనం అంతా ఓటర్లు కాదు. కోదాడలో పవన్ టూర్ కు వేల మంది వస్తే.. వచ్చిన ఓట్లు వందల్లోనే ఉన్నాయి. అదే ఫార్ములా ఏపీలోనూ వర్కవుట్ అవుతుంది. రాజకీయాల్లో ఎదుటి వారు తప్పులు చేస్తే.. ఉపయోగించుకోవాలి.. అంతే కానీ తప్పులు చేసి ఎదుటి వారికి అస్త్రాలిస్తే.. అస్త్ర సన్యాసమే చేసుకోవాలి. టీడీపీ, జనసేన కూటమిలో ఇప్పుడు అదే కనిపిస్తోంది.
అయితే వైసీపీ నేతలు ఈ గొడవను కూడా చంద్రబాబు ప్లాన్ లాగే చూస్తున్నారు. ఏ మాత్రం తగ్గడం లేదని.. జనసేనకు ప్రాధాన్యత లభిస్తోందని కాపు వర్గాన్ని నమ్మించడానికి ఇలా చేస్తున్నారని అంటున్నారు. రాజకీయ వ్యూహాలు అంతుబట్టనివిగా ఉంటాయి కాబట్టి ఎవరి విశ్లేషణలు వారికి ఉంటాయి. కానీ పొత్తుల్లో సామరస్యం లేకపోతే మాత్రం మొదటికే మోసం వస్తుందనేది బేసిక్ ప్రిన్సిపుల్…
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…