ఏపీ ప్ర‌జ‌లు ఈ సారి అయినా కాంగ్రెస్ ను క్ష‌మిస్తారా?

By KTV Telugu On 29 January, 2024
image

KTV TELUGU :-

ఆంధ్ర ప్ర‌దేశ్ లో  రెండు వ‌రుస ఎన్నిక‌ల్లో  బోణీ కూడా కొట్ట‌లేక చ‌తికిల ప‌డిపోయిన కాంగ్రెస్ పార్టీని ఏపీ ప్ర‌జ‌లు మ‌రోసారి  త‌రిమి త‌రిమి కొట్ట‌డం ఖాయ‌మంటున్నారు  రాజ‌కీయ ప‌రిశీల‌కులు. ఇప్ప‌టికీ కాంగ్రెస్ పార్టీ చేసిన అన్యాయాన్ని కానీ..అది చేసిన గాయాల‌ను కానీ ఏపీ ప్ర‌జ‌లు మ‌ర్చిపోలేకుండా ఉన్నారు. అయితే రెండు  ఎన్నిక‌ల్లో  ఒక్క సీటు కూడా గెల‌వ‌లేక‌పోయిన కాంగ్రెస్  ఈ సారి అయినా  ఎన్నో కొన్ని సీట్లు గెల‌వ‌క‌పోతామా అన్న ఆశ‌తో  పావులు క‌దుపుతోంది. అయితే క్షేత్ర స్థాయిలో కాంగ్రెస్ జెండా మోసేవాళ్లు కూడా లేక‌పోవ‌డం  భ‌యంక‌ర వాస్త‌వం అంటున్నారు రాజ‌కీయ పండితులు. ఎన్నిక‌ల‌కు రెండు నెల‌ల ముందు కాంగ్రెస్  దింపుడు క‌ళ్లెం ఆశ‌తో ఏవేవోప్ర‌యోగాలు చేస్తోన్నా అవి  విక‌టించ‌డం ఖాయ‌మంటున్నారు వారు.

కర్నాట‌క ఎన్నిక‌ల్లో   గెలిచి అధికారంలోకి వ‌చ్చిన కాంగ్రెస్ పార్టీ  ఆ త‌ర్వాత  మ‌రో ద‌క్షిణాది రాష్ట్ర‌మైన తెలంగాణాలోనూ అధికారంలోకి వ‌చ్చింది. ఈ రెండు విజ‌యాల‌తో కాంగ్రెస్ పార్టీ  మితిమీరిన విశ్వాసంతో ఆలోచ‌న‌లు చేస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆంధ్ర ప్ర‌దేశ్ లోనూ స‌త్తా చాటేయాల‌ని  భావిస్తోంది. అయితే ఈ క్ర‌మంలో ఏ మాత్రం వాస్త‌వాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవ‌డం లేదు కాంగ్రెస్ అగ్ర‌నాయ‌క‌త్వం. గుడ్డెద్దు చేల్లో ప‌డ్డ‌ట్లు  ఏపీ ఎన్నిక‌ల బ‌రిలోకి దూకేసి కొమ్ము విసిరేయాల‌ను అనుకుంటోంది కానీ  శృంగ‌భంగం కాక త‌ప్ప‌ద‌ని తెలుసుకోలేక‌పోతోందంటున్నారు  విశ్లేష‌కులు. ప్ర‌శాంతంగా ఉన్న ఉమ్మ‌డి ఆంధ్ర ప్ర‌దేశ్ ను  నిట్ట‌నిలువునా చీల్చి.. ఆంధ్రుల‌మ‌నోభావాల‌ను తుంగ‌లో తొక్కి నిరంకుశంగా వ్య‌వ‌హ‌రించిన కాంగ్రెస్ పార్టీని  ఏపీ ప్ర‌జ‌లు ఎప్ప‌టికీ క్ష‌మించ‌లేరు.

2014 ఎన్నిక‌ల‌కు ముందు కేంద్రంలో అధికారంలో ఉన్న యూపీయే ప్ర‌భుత్వం చాలా నియంత పోక‌డ‌లు పోయింది. తెలంగాణా ప్రాంతంలో ఓట్ల కోసం ఆంధ్ర ప్ర‌దేశ్  పై గొడ్డ‌లి వేటు వేసింది. ఏపీ ప్రాంత ప్ర‌జ‌ల  ఆత్మ‌గౌర‌వాన్ని  ఉక్కుపాదంతో తొక్కేసుకుంటూ పోయింది. రాష్ట్ర విభ‌జ‌న విష‌యంలో అస‌లు ఏపీ మేథావులు, రాజ‌కీయ నేత‌ల  అభిప్రాయాల‌కు ఏ మాత్రం గౌర‌వం ఇవ్వ‌లేదు. అస‌లు ఏపీ ప్ర‌జ‌ల‌కంటూ కొన్ని ఆకాంక్ష‌లు ఉంటాయ‌ని  అనుకోలేదు. కేవ‌లం త‌మ పుర్రెలో రాష్ట్రాన్ని చీల్చేయాల‌న్న ఆలోచ‌న వ‌చ్చింది కాబ‌ట్టి ..కేంద్రంలో అధికారం త‌మ చేతుల్లో ఉంది కాబ‌ట్టి … ఎవ్వ‌రు అడ్డొచ్చినా  ఏపీని రెండు ముక్క‌లు చేసి తీరాల‌న‌న  క‌సితోనే నాటి కాంగ్రెస్ ప్ర‌భుత్వం అడ్డ‌గోలుగా తెలంగాణా రాష్ట్రాన్ని ప్ర‌క‌టించి ఏపీ ప్రాంత ప్ర‌జ‌ల గుండెల‌పై గొడ్డ‌లితో వేటు వేసిందని ఏపీ ప్రాంత మేథావులు ఇప్ప‌టికీ మండిప‌డుతున్నారు

రాష్ట్ర విభ‌జ‌న చేసిన తీరు కూడా అత్యంత  దుర్మార్గ‌మే. పార్ల‌మెంటు త‌లుపులు మూసివేసి… లోక్ స‌భ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారాలు నిలిపివేసి.. విభ‌జ‌న బిల్లుపై అస‌లు చ‌ర్చే జ‌ర‌క్కుండా.. ఏపీ ప్రాంత ఎంపీల‌ను స‌స్పెండ్ చేసి.. తెలంగాణా బిల్లును నిరంకుశంగా ఆమోదించుకుంది కాంగ్రెస్ పార్టీ. విభ‌జ‌న స‌మ‌యంలో ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇస్తామ‌ని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ దాన్ని చ‌ట్టంలో చేర్చ‌కుండా మోసం చేసింది. రాష్ట్ర విభ‌జ‌న చేస్తే రెండురాష్ట్రాల మ‌ధ్య   ఆస్తులు, నీటి వ‌న‌రుల పంప‌కాలు స‌క్ర‌మంగా చేయాల్సి ఉంది. అవేవీ ప‌ట్టించుకోకుండా..వాటిపై ఎలాంటి క‌స‌ర‌త్తులు చేయ‌కుండా ఏపీని నిలువునా ముంచేసింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్  నాయ‌క‌త్వ  దుర్మార్గ వైఖ‌రి కార‌ణంగా ఏపీ రాష్ట్రం  చాలా న‌ష్ట‌పోయింది. ఉమ్మ‌డి రాష్ట్రంలో ఉమ్మ‌డి ప్ర‌జాధ‌నం అంతో రంగ‌రించి అభివృద్ధి చేసిన రాజ‌ధాని హైద‌రాబాద్ ను తెలంగాణాకు ఇచ్చేసింది. దాంతో ఏపీకి ఎలాంటి ఆదాయ వ‌న‌రూ లేకుండా పోయింది.

విశాఖ రైల్వేజోన్ కానీ, మెట్రో రైల్ కానీ.. పెట్రో కారిడార్ కానీ ఏర్పాటుకు ఎలాంటి విధి విధానాలు రూపొందించ‌కుండానే  కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఏపీని న‌రికేసింది. ఆ గాయాలు ఇప్ప‌టికీ ఏపీని బాధిస్తూనే ఉన్నాయి. ఆ నొప్పి ఇప్ప‌టికీ  న‌ర‌క‌వేత‌న పెడుతూనే ఉంది కాంగ్రెస్ అంత ద్రోహం చేసింది కాబట్టి విభ‌జ‌న త‌ర్వాత జ‌రిగిన మొద‌టి ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ ఒక్క నియోజ‌క‌వ‌ర్గంలోనూ డిపాజిట్ కూడా ద‌క్కించుకోలేక‌పోయింది. కాంగ్రెస్ పార్టీ చ‌రిత్ర‌లో ఏపీలో ఇంత‌టి  దుర‌వ‌స్థ ఎన్న‌డూ లేదు. అయిదేళ్ల త‌ర్వాత 2019లో జ‌రిగిన ఎన్నిక‌ల్లోనూ కాంగ్రెస్ పార్టీని ఏపీ ప్ర‌జ‌లు క్ష‌మించ‌లేదు. త‌రిమి కొట్టండిరా కాంగ్రెస్  ను అని ఎవ‌రో పిలుపు ఇచ్చిన‌ట్లు  కాంగ్రెస్ అభ్య‌ర్ధుల క‌న్నా నోటాకి ఎక్కువ ఓట్లు వేశారు. రాబోయే ఎన్నిక‌ల్లో ముచ్చ‌ట‌గా మూడోసారి కాంగ్రెస్ ను ఏపీ పొలిమేర‌ల వ‌ర‌కు త‌న్ని త‌రిమేయాల‌ని ఏపీ ప్ర‌జ‌లు  ఉక్కు సంక‌ల్పంతో ఉన్న  సంకేతాలే క‌న‌ప‌డుతున్నాయంటున్నారు  ఏపీ మేథావులు.

తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు   స‌హ‌క‌రించిన బిజెపి కూడా  విభ‌జ‌న జ‌రిగిన తీరును  త‌ప్పుబ‌ట్టింది. ఆప‌రేష‌న్  చేశారు. త‌ల్లిని చంపేశారు అని  ప్ర‌ధాని న‌రేంద్ర మోదీయే యూపీయే హ‌యాంలో ఏపీ విభ‌జ‌న జ‌రిగిన‌తీరును వ‌ర్ణించారు. కాంగ్రెస్ ప‌ట్ల ఏపీ  ప్ర‌జ‌ల్లో న‌ర న‌రాన   అగ్గి ర‌గులుతూ ఉంది కాబ‌ట్టే కాంగ్రెస్  లో  జ‌నాద‌ర‌ణ ఉన్న నేత‌లంతా కూడా కాంగ్రెస్ ను విడిచి పెట్టారు. వారిలో మెజారిటీ నేత‌లు జ‌నాక‌ర్ష‌ణ క‌లిగిన జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పార్టీలో చేరిపోయారు.  ఇపుడు ఏపీ ప్ర‌భుత్వంలో కీల‌క ప‌ద‌వుల్లో ఉన్న చాలా మంది ఒక‌ప్ప‌టి కాంగ్రెస్ నేత‌లే. కాంగ్రెస్ పార్టీకి ఏపీలో ఇక భ‌విష్య‌త్తు అన్న‌దే లేదంటున్నారు మేథావులు…

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి