ఒత్తిడి పెంచితే అంతేనా…!

By KTV Telugu On 30 January, 2024
image

KTV TELUGU :-

రాజకీయాల్లో ప్రతీ రోజు ఒక్కరిదే కాదు. అతి చేస్తే తాడే పామై కరిచే ప్రమాదం ఉంటుంది. ఏపీ సీఎం వైఎస్  జగన్ కు కూడా ఇప్పుడు  అదే పరిస్థితి ఎదురవుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ఎమ్మెల్యేలు, ఎంపీలపై ఒత్తిడి  పెట్టాలని జగన్ చేస్తున్న ప్రయత్నాలు బెడిసి కొడుతున్నారు. అంత తీసుకురా..ఇంత తీసుకురా…అని ఆయన డిమాండ్ చేస్తుంటే నేతలు చల్లగా జారుకునేందుకే మొగ్గు చూపుతున్నారు…..

అధికారం ఉంది కదా అని ఎదుటి వాళ్ళతో ఎలా పడితే ఎలా వ్యవహరిస్తే.. రాజకీయాల్లో అసలు కుదరదు. తన మాటే వేదం, తాను చెప్పిందే శాసనం అనుకునే నేతలకు అప్పుడప్పుడు రివర్స్ లో ఎటాక్ లు ఎదురవుతున్నాయి. కనపడినప్పుడల్లా 140 కోట్లు డిమాండ్ చేస్తుంటే…ఆ ఎంపీ తీవ్ర అసహనానికి లోనయ్యారు. ప్రజా సేవకు మాత్రమే  అంకితమైన తనకు, అవినీతి తెలియని తనకు అంత డబ్బు ఎక్కడ నుంచి వస్తుందని ఆయన ఆలోచించారు. ఏకంగా వైసీపీకి గుడ్ చెప్పేందుకు సిద్ధమయ్యారు. పైగా నరసరావుపేట నుంచి బీసీని పోటీ చేయిస్తామని జగన్ బెదిరించడం కూడా ఆయనకు ఏ మాత్రం నచ్చలేదు….

సఖ్యతకు మారుపేరు లావు శ్రీకృష్ణదేవరాయలు. ఎవరింటికి పిలిచినా  వెళ్లి ఆదరించే  తత్వమున్న నాయకుడు కూడా ఆయనే కావచ్చు. వైసీపీలో అవినీతి తెలియని బహుకొద్దిమందిలో ఆయన కూడా ఒకరనే చెప్పాలి. అలాంటి యువనేతను ఇప్పుడు జగన్ దూరం చేసుకున్నారు….

విజ్ఞాన్ రత్తయ్య కుమారుడు లావు శ్రీకృష్ణదేవరాయలు 2019 ఎన్నికలలో నరసరావుపేట ఎంపీ స్థానం నుంచి వైసీపీ అభ్యర్దిగా పోటీ చేసి లక్షా 40వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అందరినీ కలుపుకుపోతూ, ఎంపీ నిధులను అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లకు పంచుతూ ఆయన మంచి పేరు  తెచ్చుకున్నారు. కేంద్రం నుంచి అనేక పధకాలను కూడా ఆ నియోజకవర్గానికి తీసుకు వచ్చారు. దాదాపుగా మూడు సంవత్సరాల పాటు వైసీపీలో శ్రీకృష్ణదేవరాయలు ప్రయాణం బాగానే సాగింది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నాలుగు నెలల క్రితం ఆయన ముఖ్యమంత్రిని కలిశారు. తర్వాత  రెండు మూడు సార్లు అప్పాయింట్ మెంట్ తీసుకుని వెళ్లారు. మరో సారి పార్టీ టికెట్ కావాలంటే 140 కోట్ల రూపాయలు జమ చేయాలని జగన్ స్వయంగా చెప్పడంతో లావు శ్రీకృష్ణదేవరాయలు ఖంగుతిన్నారు. లాండ్, శాండ్, మైనింగ్ తెలియని తనకు ఇలాంటి పనులు అప్పగిస్తున్నారేమిటని ఆలోచించి… అవినీతి తెలియని తను అలాంటి పనులు చేయలేనని చెప్పేసి వచ్చేశారు. సరే జగన్ అంతటితో వదిలేశారా అంటే అదీ లేదు.  చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ను తిట్టాలని మధ్యవర్తుల ద్వారా సమాచారం పంపారు. తెలుగుదేశంలో చేరతానని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుందని, ఆ ప్రచారాన్ని ఖండించాలని కూడా సూచించారు. అయితే ఈ షరతులకు శ్రీకృష్ణదేవరాయలు అంగీకరించలేదు. ఇటీవల ముఖ్యమంత్రిని కలిసి సీటు విషయం ప్రస్తావనకు వచ్చిన సమయంలో నరసరావుపేట టిక్కెట్ బీసీలకు ఇస్తున్నామని, గుంటూరు నుంచి పోటీ చేయాలని సూచించారు. తాను గుంటూరు నుంచి పోటీ చేసే ప్రసక్తే లేదని, 2019 ఎన్నికలలోనే గుంటూరులో టీడీపీ గెలిచిందని, ఇప్పుడు కూడా అక్కడ అదే పరిస్థితి నెలకొని ఉందని, అంతకంటే తెలుగుదేశం మెరుగు పడిందని కూడా సీఎంకు వివరించారు. అయితే సీఎం మాత్రం గుంటూరు నుంచే పోటీ చేయాలని మరోసారి కోరగా, అందుకు ఆయన తిరస్కరించారు. దీంతో శ్రీకృష్ణ దేవరాయలు వెనక్కి వచ్చేశారు. నరసరావుపేట లోక్ సభ నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ శ్రీకృష్ణకే టిక్కెట్ ఇవ్వాలని హైకమాండ్ పై ఒత్తిడి తెచ్చారు. దీంతో జగన్ శ్రీకృష్ణ దేవరాయలు వద్దకు రాయభారం పంపారు. విజయసాయి రెడ్డి, ఇతర నేతలు నరసరావుపేట టిక్కెట్ ఇస్తామని, ఒక్కసారి జగన్ తో మాట్లాడాలని పదే పదే అభ్యర్ధించారు. అయినప్పటికీ శ్రీకృష్ణ దేవరాయలు జగన్ వద్దకు వెళ్లలేదు.ఇప్పుడాయన వైసీపీలో నామ్ కే వాస్తే ఉన్నట్లే లెక్క..

జగన్ ఓవరాక్షన్ భరించలేక శ్రీకృష్ణదేవరాయలు వైసీపీని  వీడే ఆలోచనలో ఉన్నారు. ఆయన్ను ఆహ్వానించేందుకు టీడీపీ సిద్ధమవుతోంది. అదే నరసరావుపేట టికెట్ ఆయనకు కేటాయిస్తారని చెబుతున్నారు. తాజా పరిణామాలు ముమ్మాటికి జగన్ తప్పిదమేనని చెప్పక తప్పదు. ఎవరిని ఎలా  డీల్ చేయాలో తెలీక ఆయన బోల్తా పడుతున్నారని చెప్పాల్సి ఉంటుంది…

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి