లోక్ సభలో సత్తా చాటుతారా?

By KTV Telugu On 2 February, 2024
image

KTV TELUGU :-

అయోధ్య రామమందిరంలో బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంతో దేశ వ్యాప్తంగా  జోష్ లో ఉన్న బిజెపి  లోక్ సభ ఎన్నికల్లో వీలైనన్ని ఎక్కువ స్థానాలను కైవసం చేసుకునే లక్ష్యంతో పావులు కదుపుతోంది. ఈక్రమంలో భాగంగానే తెలంగాణాలోనూ  మెజారిటీ స్థానాలు సొంతం చేసుకోవాలని కమలనాథులు పంతంగా ఉన్నారు. 17 లోక్ సభ స్థానాలున్న తెలంగానాలో మొదటి జాబితాలో 10 మంది పేర్లు ఖరారు చేసే అవకాశాలున్నాయంటున్నారు. ఈ పది నియోజక వర్గాల్లో అభ్యర్ధుల పేర్లతో  ఓ నివేదికను పార్టీ అధిష్టానానికి పంపించారు తెలంగాణా బిజెపి నేతలు.హై కమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత తొలి జాబితా విడుదల చేస్తారు.

తెలంగాణాలో అసెంబ్లీ ఎన్నికల్లో గతంతో పోలిస్తే  చెప్పుకోదగ్గ ప్రగతి సాధించినప్పటికీ  వచ్చిన ఫలితాల పట్ల కమలనాధులు అంత ఆనందంగా ఏమీ లేరని పార్టీ వర్గాలంటున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో  తామనుకున్న మ్యాజిక్ ఫిగర్ ను అందుకోలేకపోయామన్న అసంతృప్తితోనే  బిజెపి నాయకత్వం ఉందంటున్నారు. దానికి ప్రతీకారం తీర్చుకోవాలంటే లోక్ సభ ఎన్నికల్లో మెజారిటీ సీట్లలో కాషాయ జెండా ఎగరేయాలని బిజెపి చాలా పట్టుదలగా ఉన్నట్లు చెబుతున్నారు. ఎక్కువ స్థానాలు గెలుచుకోవాలంటే..  ప్రతీ నియోజక వర్గంలోనూ గెలుపు గుర్రాన్నే నిలబెట్టాల్సి ఉంటుంది. అందుకే అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియలోనే  రక రకాల కసరత్తులు చేసి పకడ్బందీగా నిర్ణయాలు తీసుకోవాలని  పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణా బిజెపి నేతలకు  సూచించినట్లు చెబుతున్నారు. ఆ దిశగానే తెలంగాణా బిజెపి అగ్రనేతలు పావులు కదుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

మొదటి జాబితాలో   ముగ్గురు సిటింగ్ ఎంపీల పేర్లు ఉండే అవకాశాలున్నాయంటున్నారు.  సికింద్రాబాద్ లోక్  సభ స్థానం నుండి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి  మరోసారి పోటీ చేస్తారని పార్టీ వర్గాలంటున్నాయి. పార్టీ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ గత ఎన్నికల్లో గెలిచిన కరీంనగర్ పార్లమెంటు నియోజక వర్గం నుంచే పోటీ చేస్తారని అంటున్నారు. ఇక నిజామాబాద్   లోక్ సభ నియోజక వర్గం నుంచి గత ఎన్నికల్లో గెలిచిన ధర్మపురి అరవింద్ నే బరిలో దింపుతారని అంటున్నారు. గత ఎన్నికల్లో బిజెపి తరపున నలుగురు ఎంపీలు గెలిచారు.  ఆదిలాబాద్ నుంచి గెలిచిన సోయం బాపూరావు ను మాత్రం ఈ సారి మారుస్తారని అంటున్నారు. ఆదిలాబాద్ కు కొత్త అబ్యర్ధి పేరును కూడా తెలంగాణా బిజెపి నాయకత్వం  ఖరారు చేసి పెట్టుకుందని అంటున్నారు. మొదటి జాబితాలోనే సిటింగ్ ఎంపీల పేర్లు ప్రతిపాదించిన జాబితాను కేంద్ర నాయకత్వానికి పంపినట్లు సమాచారం.

చేవెళ్ల, మహబూబ్ నగర్, భువనగిరి, మెదక్, హైదరాబాద్ లోక్ సభ స్థానాలకు  ఇద్దరేసి అభ్యర్ధులను ఎంపిక చేసి ఆ జాబితాను పంపినట్లు చెబుతున్నారు. మల్కాజగిరి, జహీరా బాద్ లోక్ సభ స్థానాల్లో టికెట్ కోసం విపరీతమైన పోటీ ఉండడంతో  ఈ స్థానాలను ప్రస్తుతానికి పక్కన పెట్టినట్లు    ప్రచారం జరుగుతోంది.కాంగ్రెస్, బి.ఆర్.ఎస్.  పార్టీల కన్నా  ముందుగానే లోక్ సభ అభ్యర్ధుల జాబితాను ప్రకటించడం ద్వారా దూకుడు ప్రదర్శించాలని బిజెపి భావిస్తోంది. అభ్యర్ధుల పేర్లు ప్రకటించేస్తే ప్రచారంలో మిగతా పార్టీలకన్నా  ముందుగానే జనంలోకి చొచ్చుకుపోయే అవకాశం ఉంటుందన్నది  వ్యూహకర్తల భావనగా తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియ ఆలస్యం చేయడం వల్లనే ప్రచారానికి సమయం సరిపోలేదని పార్టీలో ఓ వర్గం వాదించినట్లు సమాచారం. దాన్ని అధిగమించేందుకే ఈ సారి జాబితాపై  ప్రత్యేక దృష్టి సారించారు.

ఖమ్మం, నల్లగొండ, మహబూబాబాద్  లోక్ సభ స్థానాల పరిధిలో  మొదట్నుంచీ కూడా భారతీయ జనతా పార్టీకి అంత పట్టులేదు. ఈ నియోజక వర్గాల్లో  కాషాయ పార్టీ  చాలా బలహీనంగా ఉందనే చెప్పాలి. ఈ నేపథ్యంలో ఇతర పార్టీల నుంచి బలమైన అభ్యర్ధులను ఆకర్షించి వారిని బరిలో దించితే ఎలా ఉంటుంది? అన్న ఆలోచనలో కమలనాథులు ఉన్నారు. మిర్యాల గూడ ఉప ఎన్నికల్లో  కాంగ్రెస్ పార్టీలో బలమైన కోమటి రెడ్డి రాజగోపాల రెడ్డిని బిజెపిలో చేర్చుకుని  పోటీ చేసినా బిజెపి గెలవలేకపోయింది. ఆ తర్వాత రాజగోపాల రెడ్డి తిరిగి కాంగ్రెస్ లోకి వెళ్లిపోయారు. లోక్ సభ ఎన్నికల్లోనూ అటువంటి బలమైన  నాయకులకోసం బిజెపి అన్వేషిస్తోంది.

ఎస్సీ రిజర్వుడు నియోజక వర్గాలైన నాగర్ కర్నూల్, పెద్దపల్లి, వరంగల్ లోక్ సభ స్థానాల్లో  విజయపతాక ఎగరేయడానికి బిజెపి వద్ద ప్రత్యేక వ్యూహం సిద్ధంగా ఉంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే  ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణా వచ్చినపుడు   మాదిగ రిజర్వేషన్ల పోరాట సమితి నాయకుడు మందకృష్ణ మాదిగను అక్కున చేర్చుకున్నారు  మోదీ. మంుదకృష్ణ కంటతడి పెడితే మోదీ ఊరడించారు. ఎస్సీ వర్గీకరణకు తాము సానుకూలంగా ఉన్నామని  ప్రకటించిన మోదీ దాని అమలు కోసం సాధ్యాసాధ్యాల అధ్యయనానికి ఒక కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఇపుడు వర్గీకరణ అంశంపై కేంద్ర ప్రభుత్వం ఏదైనీ కీలక నిర్ణయం తీసుకుంటే  ఎస్సీ నియోజక వర్గాలన్నింటా బిజెపి జెండా ఎగరేయచ్చని బిజెపి అగ్రనేతలు భావిస్తున్నట్లు చెబుతున్నారు…

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి