కురుపాం కోటలో ఈ సారి సింహాసనం ఎవరికి ?

By KTV Telugu On 2 February, 2024
image

KTV TELUGU :-

విజయనగరం జిల్లా ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గాల్లో  ప్రముఖ మైనది కురుపాం.  మాజీ డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి ఇక్కడ వరుసగా గెలుస్తూ వస్తున్నారు. వైసీపీ కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గంలో  ఈ సారి గట్టి పోటీ కనిపిస్తోంది. అధికారంలో ఉండి ఏమీ చేయలేదన్న అసంతృప్తి ప్రజల్లో కనిపిస్తోంది. అయితే సంక్షేమ పథకాలు పెద్ద ఎత్తున ఇచ్చామని అందరూ ఓట్లేస్తారని వైసీపీ నాయకులు నమ్మకంతో ఉన్నారు. టీడీపీ అభ్యర్థిపై ఓ నిర్ణయానికి రాలేకపోవడం ఆ పార్టీకి సమస్యగా మారింది.

ఉత్తరాంధ్రలో  కీలకమైన ఎస్టీ నియోజకవర్గం కురుపాం. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వైరిచర్ల కిషోర్ చంద్రదేవ్, శత్రుచర్ల విజయ రామరాజు ఇక్కడి నుంచి ఎన్నికైన నేతలే. ఈ నియోజకవర్గం పేరుకే గిరిజన ప్రాబల్యం ఉన్న స్థానం అయినా మిగిలిన సామాజికవర్గాలు కూడా అదేస్థాయిలో గెలుపోటములను ప్రభావితం చేస్తాయి.  ఈ నియోజ‌క‌వ‌ర్గంలో శ‌త్రుచ‌ర్ల కుటుంబం తొలి నుంచి రాజ‌కీయంగా ఆధిప‌త్యం కొన‌సాగిస్తోంది. శ‌త్రుచ‌ర్ల ఆరుసార్లు ఎమ్మె ల్యేగా గెలిచారు. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో 2009లో కాంగ్రెస్ అభ్యర్ధిగా గెలిచిన జ‌నార్ధన థాట్రాజ్ 2014 ఎన్నిక‌ల ముందు టీడీపీలో చేరారు. ఈయ‌న 2014 ఎన్నిక‌ల ముందు శ‌త్రుచ‌ర్లతో క‌లిసి టీడీపీలో చేరారు. కానీ 2014 నుంచి సీన్ మారిపోయింది. అప్పటి నుంచి ఈ నియోజకవర్గం వైసీపీ కంచుకోటగా మారిపోయింది. గడచిన రెండు ఎన్నికల్లో పుష్ప శ్రీవాణి వరుసగా గెలిచారు. జగన్ కేబినెట్ ఉప ముఖ్యమంత్రి పనిచేశారు. పుష్ప శ్రీవాణిని ఢీకొట్టేందుకు తోయక జగదీశ్వరి.. వైరిచర్ల వీరేష్‌ చంద్రదేవ్‌ సై అంటే సై అంటున్నారు.

2019 ఎన్నికల ఫలితాల్లో  వైసీపీ అభ్యర్థిగా పుష్ప శ్రీవాణి ఘన విజయం సాధించారు. మొత్తం పోలైన ఓట్లలో 52 శాతం సాధించారు.  టీడీపీ తరపున బరిలోకి దిగిన ప్రియా థాట్రాజ్‌కు కేవలం 34 శాతం ఓట్లే వచ్చాయి. ఇక్కడ జనసేన ప్రభావం దాదాపుగా ఉండదు.   వైసీపీ అభ్యర్థిగా రెండోసారి బరిలోకి దిగి విజయం సాధించారు పుష్ప శ్రీవాణి.  2014 ఎన్నికలకు ముందు   ఇచ్చిన హామీలను విపక్షంలో ఉన్నందున అమలు చేయలేదని.. అధికారంలోకి వస్తే నెరవేరుస్తామని హామీ ఇవ్వడంతో ప్రజలు ఆమెకు గత ఎన్నికల్లో రెండో సారి ఛాన్స్‌ ఇచ్చారు.   వైసీపీ, టీడీపీలు రెండు కూడా నియోజకవర్గంలో గట్టి పట్టున్న ఎస్టీ కొండదొర సామాజిక వర్గానికి చెందిన నేతలకే టికెట్లు కేటాయించాయి . ఈ సారి కూడా అాలాగే కేటాయించే అవకాశాలు ఉన్నాయి.

వైసీపీ అభ్యర్థిగా పుష్పశ్రీవాణినే ఖరారు చేసే అవకాశం ఉంది.  టిక్కెట్ల కసరత్తు జరుగుతున్నా కురుపాంలో సీటు మారుస్తారన్న ప్రచారం ప్రారంభం కాలేదు. దీంతో టిక్కెట్ దక్కుతుందని పుష్పశ్రీవాణి నమ్మకంతో ఉన్నారు. అందుకే ప్రచారం కూడా ప్రారంభించారు.  పుష్పశ్రీవాణి భర్త  పరీక్షిత్ రాజు ఆమె తరపున వ్యవహారాలు చక్క బెడుతున్నారు.  అయితే ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను పూర్తిగా నెరవేర్చడంలో విఫలం అయ్యారు.  డిప్యూటీ సీఎంగా ఉన్న సమయంలోనూ అభివృద్ధికి నిధులు కేటాయింపచేయ.లేకపోయారు.  పూర్ణపాడు-లాబేసు వంతెన నిర్మాణం, ఇసుక అక్రమ తవ్వకాల్లాంటి వ్యవహారాలు వంటివి పుష్పశ్రీవాణికి మైనస్‌గా కనిపిస్తున్నాయి.  పైగా కుటుంబంలోనూ వివాదాలున్నాయి.  పుష్ప శ్రీవాణి మామ చంద్రశేఖరరాజు కొన్నాళ్ల క్రితం వైసీపీకి గుడ్ బై చెప్పారు. ఆయన టీడీపీలో చేరారు.  ఆయన కుమార్తెను కూడా టీడీపీలో చేర్పించి..  కురుపాంలో పోటీ చేయాలనే ఆలోచన చేస్తున్నారు.

టీడీపీ అభ్యర్థిగా తోయక జగదీశ్వరి పేరు ఎక్కువగా పరిశీలనలోకి వస్తోంది.  ఈమెకు కురుపాంలో బలమైన నేతగా ఉన్న  శతృచర్ల విజయ రామరాజు మద్దతు ఉంది.  మరో వైపు మాజీ ఎంపీ కిషోర్ చంద్రదేవ్ కుమారుడు వైరిచర్ల వీరేశ్‌ చంద్రదేవ్‌  కూడా టిక్కెట్ ఆశిస్తున్నారు.    పుష్ప శ్రీవాణి పనితీరు నచ్చని వారంతా టీడీపీకి ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్నారు.పూర్ణపాడు బ్రిడ్జ్‌ పూర్తికాకపోవడంతో కొంతమంది ప్రజలు అసంతృప్తిలో ఉన్నారు. నియోజకవర్గ ప్రజల్లో రెండో స్థానంలో ఉన్న కొప్పుల వెలమ సామాజిక వర్గ ముఖ్య నేతల్లో ఒకరైన దట్టి లక్ష్మణ్‌ రావు టీడీపీకి మద్ధతు తెలుపుతున్నారు. జనసేన మద్దతు ఇక్కడ కీలకం కాబోవడం లేదు. ఆ పార్టీకి పెద్దగా మద్దతు కూడా లేదు.

అయితే తెలుగుదేశం పార్టీ ఎంత వేగంగా అభ్యర్థిని ఖరారు చేస్తే అంతగా గట్టి పోటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.  వైరిచర్ల, శత్రుచర్ల కుటుంబాలు రెండింటిని ఏకతాటిపైకి తెస్తే టీడీపీకి అడ్వాంటేజ్ అవుతుంది. ప్రభుత్వ వ్యతిరేక.. పథకాలు అందని వారి అసంతృప్తి  ఒకే తాటిపైకి తెస్తే గెలుపు సులువు కావొచ్చన్న అంచనాలున్నాయి…

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి