వారసులకు నో అంటోన్న చంద్రబాబు

By KTV Telugu On 2 February, 2024
image

KTV TELUGU :-

దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనుకుంటున్నారు ముగ్గురు మాజీ మంత్రులు.  అయితే ఆ లోపే దీపం కొడిగట్టేలా కనిపిస్తోంది. దాంతో ఆ సీనియర్ నేతల వెన్నులో చలి జర జర కిందకు పాకుతోంది. తమ స్థానాల్లో తమ పుత్రరత్నాలకు  వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇవ్వాలంటూ ఆ ముగ్గురు మాజీలూ టిడిపి అధినేత చంద్రబాబు నాయుణ్ని అదే పనిగా కోరుతున్నారు. అయితే చంద్రబాబు మాత్రం ఈ ఎన్నికల్లో  అందరూ త్యాగాలకు సిద్దంగా ఉండాలని త్యాగరాజు మార్క్ డైలాగ్ వల్లిస్తున్నారు. దీంతో తమ వారసుల భవిష్యత్తు ఏంటా అని వారు ఆందోళన చెందుతున్నారు. టిడిపి అధికారంలో ఉన్నప్పుడు చక్రాలు తిప్పిన ఈ ముగ్గురు మాజీ మంత్రులు  ఇపుడు  చేష్ఠలుడిగి చూస్తున్నారు.

తెలుగుదేశం  పార్టీ అధికారంలో ఉన్నప్పుడు  ఉత్తరాంధ్రలో ముగ్గురు సీనియర్ నేతలు  ఇష్టారాజ్యంగా వ్యవహరించేవారు. ముగ్గరూ కూడా చంద్రబాబు నాయుడి కేబినెట్ లో  కీలక మంత్రి పదవులు అనుభవించారు. పార్టీలోనూ ప్రభుత్వంలోనూ  ఆధిపత్యం చెలాయించారు. తమ అనుచరులకు కూడా కావల్సిన చోట టికెట్లు ఇప్పించుకోగలిగారు. కావల్సిన పైరవీలు క్షణాల్లో చేసుకోగలిగారు. వీరిలో అందరికన్నా సీనియర్  నాయకుడు నర్సీపట్నం నియోజక వర్గ మాజీ ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్న పాత్రుడు. ఎన్టీయార్ టిడిపి స్థాపించిన క్షణం నుంచి పార్టీలో కొనసాగుతున్న  కొద్ది మంది నేతల్లో  అయ్యన్న పాత్రుడు ఒకరు. ఎన్టీయార్ మంత్రి వర్గంలోనే కీలక పదవి అనుభవించిన అయ్యన్న పాత్రుడు  చంద్రబాబు కేబినెట్లోనూ  మంత్రిగా వ్యవహరించారు. గత ఎన్నికల్లో తన సొంత నియోజక వర్గంలో ఘోరంగా ఓటమి చెందారు అయ్యన్న పాత్రుడు.

ముగ్గురు మాజీ మంత్రుల్లో రెండో కీలక నేత  బండారు సత్యనారాయణ మూర్తి. 1994  ఎన్నికల్లో మొదటి సారి పరవాడ నియోజక వర్గం నుండి పోటీ చేసి గెలిచారు బండారు. 1999 ఎన్నికల్లోనూ పరవాడ నుంచే గెలిచిన బండారు  చంద్రబాబు నాయుడి మంత్రి వర్గంలో మున్సిపల్ వ్యవహారాల మంత్రిగా వ్యవహరించారు. నియోజక వర్గాల పునర్విభజన అనంతరం పెందుర్తి నియోజక వర్గం నుంచి  పోటీచేసిన బండారు సత్యనారాయణ మూర్తి 2004,2009 ఎన్నికల్లో ఓటమి చెందారు. రాష్ట్ర విభజన అనంతరం 2014లో  పెందుర్తి నుంచి పోటీ చేసి  గెలిచారు. అయితే గత ఎన్నికల్లో అదే నియోజక వర్గంలో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అభ్యర్ధి చేతిలో ఓడిపోయారు. ఈ ఎన్నికల్లో  ఏం తేడా జరిగినా రాజకీయంగా కనుమరుగు కావడం ఖాయమన్న ఆందోళనలో ఉన్నారు బండారు.

ఇక ముగ్గురు మాజీల్లో మూడో  నేత గంటా శ్రీనివాసరావు. 1999 ఎన్నికల్లో  అనకాపల్లి లోక్ సభ నియోజక వర్గం నుంచి పోటీ చేసి ఎంపీగా గెలిచారు గంటా. 2004 ఎన్నికల్లో  చోడవరం నియోజక వర్గం నుంచి 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం తరపున అనకాపల్లి అసెంబ్లీ నియోజక వర్గం నుంచి 2014లో భీమిలినుంచి టిడిపి తరపున 2019లో విశాఖ నార్త్ నుంచి  పోటీ చేసి వరుస విజయాలు సాధిస్తూ వచ్చారు గంటా శ్రీనివాసరావు. తాను పోటీ చేసిన ప్రతీ నియోజక వర్గాన్నీ ఆయన మారుస్తూ వచ్చారు. తాను ఒక సారి గెలిచిన చోట మరోసారి పోటీ చేస్తే ఓటమి ఖాయమన్న భయంతోనే  గంటా నియోజక వర్గాలు మారుస్తూ పోతారని ఆయన గురించి బాగా తెలిసిన వారు అంటారు. గంటా ఈసారి కూడా నియోజక వర్గం మార్చాలని చూస్తున్నారు. అయితే ఎక్కడ్కనుంచి పోటీ చేయాలో అర్ధం కావడం లేదు.

చింతకాయల అయ్యన్న పాత్రుడు  ఈ ఎన్నికల్లో తాను నర్సీపట్నం నుంచే పోటీ చేయాలని భావిస్తున్నారు. తన కుమారుడు చింతకాయల విజయ్ ని అనకాపల్లి లోక్ సభ స్థానం నుంచి పోటీ చేయించాలని ఆయన తహ తహ లాడుతున్నారు.  మరో మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి కూడా తన కుమారుని  ఈ ఎన్నికల్లో అనకాపల్లి లోక్ సభ స్థానం నుంచి బరిలో దింపాలని భావిస్తున్నారు. తన కుమారుడికి టికెట్ ఇవ్వాల్సిందిగా చంద్రబాబు నాయుడి వద్ద అర్జీ పెట్టుకున్నారు. ఇక గంటా శ్రీనివాసరావు కూడా తన కుమారుని రాజకీయ ఆరంగేట్రానికి ఈ ఎన్నికలనే ముహూర్తంగా భావిస్తున్నారు. తాను మొదటి సారి ఎమ్మెల్యేగా గెలిచిన చోడవరం నియోజక వర్గం నుంచి తన కుమారుని నిలబెట్టాలని ఆయన  ఆశపడుతున్నారు. తాను మాత్రం నెల్లిమర్ల కానీ భీమిలి కానీ ఇస్తే ఎక్కడో ఒక చోట నుండి పోటీ చేయాలని అనుకుంటున్నారు.

ముగ్గురు మాజీ మంత్రులకూ చంద్రబాబు నాయుడు కోలుకోలేని షాకే ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. ముగ్గురి తనయులకూ ఈ ఎన్నికల్లో టికెట్లు లేనే లేవని చంద్రబాబు నాయుడు  బల్లగుద్ది మరీ చెప్పేశారని అంటున్నారు. కావాలంటే 2029 ఎన్నికల్లో చూద్దాంలే అన్నారట చంద్రబాబు.  తాము  ఓపిగ్గా జనంలో ఉన్న సమయంలోనే తమ కుమారులను చట్టసభలోకి పంపాలన్నది ఈ నేతల ఆలోచన. చంద్రబాబు దానికి మోకాలడ్డుతున్నారు. టిడిపి-జనసేన పొత్తులో భాగంగా  ఈ ముగ్గరు నేతలు కోరుతున్న స్థానాలు జనసేనకు  కేటాయించే  అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు నాయుడిపై ఒత్తిడి పెంచడంతో పాటు ఆయన దృష్టిలో పడ్డానికి ముగ్గురు సీనియర్లూ పాలకపక్షంపై నిత్యం విమర్శలు సంధిస్తూ చంద్రబాబును మెప్పించడానికి ఆపసోపాలు పడుతున్నారని రాజకీయ పండితులు అంటున్నారు. చంద్రబాబు ఒకసారి డిసైడ్ అయితే తన మాట తానే వినడని  టిడిపి సీనియర్లు అంటున్నారు. అదే జరిగితే ఈ ముగ్గురు సీనియర్ల కలలు కల్లలు కాక తప్పదంటున్నారు.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి