BRSకు మొదటి గండం రాజ్యసభ ఎలక్షన్

By KTV Telugu On 2 February, 2024
image

KTV TELUGU :-

పార్లమెంట్ ఎన్నికలకు ముందే రాజ్యసభ ఎన్నికలు బీఆర్ఎస్ కు టెన్షన్ పుట్టిస్తున్నాయి. సింపుల్‌గా గెలుచుకోవాల్సిన ఓ సీటు విషయంలో ఇప్పటి వరకూ ఏం చేయాలన్నదానిపై ఆ పార్టీలో చర్చ జరగడం లేదు.  కాంగ్రెస్ పోటీ పెట్టకపోతే ఏకగ్రీవం చేసుకోవచ్చు. కానీ కాంగ్రెస్ మూడో అభ్యర్థిని పెడితే మాత్రం తమ ఎమ్మెల్యేలు ముందే జంపింగ్ కాకుండా కాపాడుకోవడానికి పోటీ నుంచి విరమించుకోవాల్సి ఉంటుంది. అదే జరిగితే నైతికంగా మరింత దెబ్బతగిలినట్లే. ఇప్పుడు బీఆర్ఎస్ నాయకత్వం ఏం చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.

తెలంగాణలో రాజ్యసభ ఎన్నికలు రాజకీయంగా కాక రేపే అవకాశాలు  కనిపిస్తున్నాయి.    బీఆర్ఎస్ ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, జోగినపల్లి సంతోష్‌కుమార్‌, బడుగుల లింగయ్యయాదవ్‌ పదవీకాలం ముగియనుంది. వీరిస్థానంలో కొత్తవారిని ఎన్నుకోవాల్సి ఉంది. ఫిబ్రవరిలోనే ఎన్నికలు పెట్టేస్తున్నారు. షెడ్యూల్ విడుదలయింది. ఇప్పుడు ఉన్న బలాబలాల ప్రకారం అయితే  కాంగ్రెస్ కు రెండు సీట్లు ఖాయం. బీఆర్ఎస్ ఒకటి వస్తుంది. కానీ కాంగ్రెస్ మూడో స్థానానికి పోటీ పెడితే మాత్రం బీఆర్ఎస్ కఠిన పరీక్షన ఎదుర్కోవాల్సి ఉంంటుంది.

రాజ్యసభ ఎన్నికల్లో  పోలైన ఓట్లలో  గెలవడానికి ఓ అభ్యర్థి  నిర్దిష్ట సంఖ్యలో మొదటి ప్రాధాన్యత ఓట్లను దక్కించుకోవాల్సి ఉంటుంది. ముగ్గురు అభ్యర్థులకు నలుగురు పోటీలో ఉండి.. వంద మంది ఓట్లేస్తే మొదటి రౌండ్ పోల్స్‌లో, ప్రతి మొదటి ప్రాధాన్యత ఓటు విలువ 100 పాయింట్లుగా నిర్ణయిస్తారు. అభ్యర్థి ఓటు వేసిన మొత్తం ఎమ్మెల్యేల సంఖ్యను ఎన్నికలు జరిగే సీట్ల సంఖ్యతో డివైడ్‌ చేయడం ద్వారా పొందిన పాయింట్స్  కంటే ఒక పాయింట్ ఎక్కువ సాధించాలి. కౌంటింగ్ తర్వాత ఎవరికి ఎక్కవ పాయింట్లు వస్తాయో ఆ ముగ్గిరినే విజేతగా ప్రకటిస్తారు. తెలంగాణలో  రాష్ట్రంలో 119 మంది శాసనసభ్యులు ఉన్నారు. మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఒక్కొక్కరికి నలభై మంది మద్దతు తెలిపితే సరిపోతుంది. కాంగ్రెస్ పార్టీకి సీపీఐతో కలిసి 65 మంది ఎమ్మెల్యేలు,  బీఆర్ఎస్‌కు 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. బీజేపీకి 8, మజ్లిస్ పార్టీకి ఏడుగురు ఉన్నారు. రాజ్యసభ బరిలో ఒక అభ్యర్థిని బరిలోకి దింపడానికి 10 మంది శాసనసభ్యులు ఆయన పేరును ప్రతిపాదించాలి.  బీజేపీ, మజ్లిస్ పోటీ  చేసే అవకాశం ఉండదు. బీజేపీ పోటీ చేయదు.. అలాగని అటు బీఆర్ఎస్ కానీ ఇటు కాంగ్రెస్ అభ్యర్థులకు కానీ మద్దతుగా ఓటేసే అవకాశం ఉండదు. మజ్లిస్ సాధారణంగా మజ్లిస్ అధికారంలో ఉన్న పార్టీకే మద్దతుగా ఉంటుంది.   కాంగ్రెస్ కే మజ్లిస్ మద్దతు తెలిపినా ఆశ్చర్యం లేదు.  అలా కాదంటే ఓటింగ్ బహిష్కరిస్తుంది  కానీ బీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతు ఇవ్వకపోవచ్చు.  బీజేపీ, మజ్లిస్ ఈ రెండు పార్టీలకు చెందిన 15  మందిని  లెక్కలోంచి తీసేస్తే.. 104 మంది సభ్యుల ప్రకారం చూస్తే.. ఒక్కొక్కరి 35  మంది అభ్యర్థులు సరిపోతారు. ఈ లెక్కన బీఆర్ఎస్‌కు ఒకటి ఖాయం.  పోటీ ఉండదు కాబట్టి మిగిలిన రెండూ కాంగ్రెస్‌కు ఖాయం.

మూడు స్థానాలు ఖాళీ అవుతున్నందున ముగ్గురే అభ్యర్థులు బరిలో నిలిస్తే పోలింగుతో, సంఖ్యాబలంతో సంబంధం లేకుండా వారి ఎన్నిక ఏకగ్రీవమవుతుంది. ముగ్గురికి మించి అభ్యర్థులు బరిలో ఉంటే పోలింగ్ అనివార్యమవుతుంది.  బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో అత్యధిక మంది ఫిరాయింపు జాబితాలో ఉన్నారని ప్రచారం జరుగుతోంది.    రేవంత్ రెడ్డితో ఆరుగురు ఎమ్మెల్యేలు మర్యాదపూర్వక భేటీలు నిర్వహించారు. మిగిలిన వారిలో చాలా మంది  తెర వెనుక రేవంత్ రెడ్డికి స్నేహహస్తం పంపారన్న  పుకార్లూ ఊపందుకున్నాయి. చాలా మంది ఎమ్మెల్యేలు నోరు తెరవడం లేదు. పదేళ్ల పాటు అధికారంలో ఉండటం..  వివిధ రకాల వ్యాపారాల్లో మునిగి ఉండటం వల్ల ప్రభుత్వాధినేతతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో వారికి తెలుసు. అందుకే వీలైనంత వరకూ సామరస్యంగా ఉండాలని అనుకుంటున్నారు.   పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు రకరకాల సమస్యలు ఉన్నాయి. వారు ప్రభుత్వంపై  యుద్ధం చేయలేకపోవచ్చు. అలాంటి వారిని కాంగ్రెస్ పార్టీ ఆకర్షించడం పెద్ద విషయం కాదన్న అభిప్రాయం ఉంది. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని మూడో స్థానం కోసం కాంగ్రెస్ అభ్యర్థిని నిలబెడితే మాత్రం రాజకీయం రచ్చ అవుతుంది.

కాంగ్రెస్ ఒత్తిడిని ఎమ్మెల్యేలు తట్టుకోలేరని అభ్యర్థిని నిలబడితే ఎమ్మెల్యేలు తప్పని సరిగా కాంగ్రెస్ అభ్యర్థికి ఓటేస్తారని బీఆర్ఎస్ చీఫ్ అనుకుంటే ముందే వారిని వదులుకోవడం ఇష్టం అభ్యర్థిని పోటీ పెట్టకపోవచ్చు. కానీ  బలం ఉన్నా  ఓ అభ్యర్థిని నిలబెట్టలేకపోతే  బీఆర్ఎస్‌కు  పెను సమస్యగా మారుతుంది. పార్లమెంట్ ఎన్నికలకు ముందే నైతికంగా దెబ్బతగులుతుంది. లోక్ సభ ఎన్నికల్లో కేడర్ స్థైర్యం జారిపోతుంది. అది అనేక సమస్యలకు దారి తీస్తుంది. అందుకే ఇప్పుడు రాజ్యసభ ఎన్నికలు బీఆర్ఎస్‌కు పెను సమస్యగా మారాయి…

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి