ఈడీ ఏకంగా ఓ రాష్ట్ర ముఖ్యమంత్రిని అరెస్టు చేయడంతో మరోసారి రాజకీయంగా దుమారం రేగుతోంది. మరో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ను అరెస్టు చేయడానికి రంగం సిద్ధమవుతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీఐడీని వాడుకున్నట్లుగా కేంద్రం ఈడీని వాడేసుకుని రాజకీయ ప్రత్యర్థుల్ని జైళ్లకు పంపే ప్రయత్నం చేస్తోందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సీబీఐకి అధికారాల విషయంలో పరిమితులు ఉండటంతో ఈడీని రగంలోకి దించారు. వేల కొద్దీ కేసులు నమోదు చేస్తున్నారు. వాటిలో రాజకీయ ప్రత్యర్థులపైనే అత్యధికం. అందుకే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రతిపక్ష నాయకులపై కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ప్రతిపక్ష నేతలపై ఆరోపణలు చేయడానికి ఈ దాడులను బీజేపీ ఆయుధాలుగా మలచుకుంటోంది. దీంతో దేశంలో రాజకీయ అలజడి చెలరేగుతోంది. తాజాగా ఈడీ అధికారులు బుధవారం జార్ఖండ్ ముఖ్యమంత్రి, జేఎంఎం అధినేత హేమంత్ సొరేన్ ను అరెస్టు చేశారు. దీంతో ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది. ఈడీ వేటాడుతున్న ప్రతిపక్ష ముఖ్యమంత్రుల్లో సొరేన్ నాలుగో వారు. గతంలో ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన భూపేష్ బఘేల్, ఆయన సన్నిహితులపై ఈడీ పంజా విసిరింది. రాష్ట్ర శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో వారిపై అక్రమ ఆన్‌లైన్ బెట్టింగ్ కేసు నమోదు చేసింది. దీనిని బీజేపీ ఎన్నికల ప్రచార అస్త్రంగా ఉపయోగించుకుంది. బీహార్‌లో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుమారుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్‌లను కూడా ‘ఉద్యోగాలకు భూమి’ కేసులో ప్రశ్నిస్తోంది.
ఇక ఢిల్లీ ముఖ్యమంత్రి, అమ్‌ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు కూడా మద్యం పాలసీ కేసులో పలుమార్లు సమన్లు జారీ చేసింది. ఈ కేసులో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, అమ్‌ఆద్మీ ఎంపీ సంజరు సింగ్ ఇప్పటికే జైలులో ఉన్నారు. ఢిల్లీకి చెందిన మరో ఆప్ మంత్రి సత్యేంద్ర జైన్ గత రెండేళ్లుగా కటకటాలను లెక్కిస్తూ కాలం గడుపుతున్నారు. ఈడీ విచారణకు గైర్హాజరు అవుతున్న కేజ్రీవాల్‌ను కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తారని వదంతులు వ్యాపిస్తున్నాయి. రాజకీయ దురుద్దేశంతోనే తనను ప్రశ్నించాలని ఈడీ భావిస్తోందని, రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ప్రచారం చేయకుండా ప్రతిపక్షాలను అడ్డుకునేందుకు కుట్ర పన్నుతోందని ఆయన ఆరోపించారు.
ఇక బెంగాల్‌లో ఈడీ చూపిస్తున్న దూకుడు గురించి చెప్పాల్సిన పన ిలేదు. ప్రజా పంపిణీ పథకంలో కుంభకోణం జరిగిందన్న ఆరోపణపై తృణమూల్ కాంగ్రెస్ నేత షేక్ షాజహాన్ నివాసంపై దాడులు చేశారు. ఇదే కేసులో తృణమూల్ మంత్రి జ్యోతి ప్రియ మల్లిక్‌ను గత సంవత్సరం అక్టోబర్ 23న ఈడీ అరెస్ట్ చేసింది. ఈ విధంగా పలువురు ప్రతిపక్ష నేతలను లక్ష్యంగా చేసుకొని కేంద్ర దర్యాప్తు సంస్థలు చర్యలు చేపడుతున్నాయి. రాజస్థాన్ మాజీ మంత్రి మహేష్ జోషీ పైన, హర్యానా, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల కాంగ్రెన్ నేతల పైన ఈడీ కేసులు బనాయించి వేధిస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. ఈడీ కేసుల బారిన పడిన ప్రతిపక్ష నేతల సంఖ్య తక్కువేం లేదు. .చిదంబరం, సంజయ్ సింగ్, మనీష్ సిసోడియా, సంజయ్ రౌత్, డీఎంకే నేత పొన్ముడి, సెంథిల్ బాలాజీ, దేవంద్ర యాదవ్, రాంగోపాల్ అగర్వాల్ అశోక్ గెహ్లాట్ .. ఈ జాబితా చాలా ఎక్కువగానే ఉంది.
2014 నుండి ఈడీ దాఖలు చేసిన కేసుల సంఖ్య నాలుగు రెట్లు పెరిగింది. గత సంవత్సరం మార్చి వరకూ ఈడీ 5,906 కేసులు నమోదు చేసింది. ఈడీ, సీబీఐ పెట్టిన కేసుల్లో 95శాతం కేసులు ప్రతిపక్ష నాయకులపై పెట్టినవే. అందుకే దర్యాప్తు సంస్థలను బీజేపీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. ప్రతిపక్షాల అనుమానాలను నివృత్తి చేయడానికి బదులు ఈడీ, సీబీఐ నమోదు చేయబోయే కేసుల వివరాలను బీజేపీ నాయకులు ముందుగానే ప్రకటిస్తున్నారు. ఎవరు ఎప్పుడు అరెస్టవుతారో చెబుతున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ప్రతిపక్ష నేతలపై పుంఖానుపుంఖాలుగా కేసులు పెడుతున్న ఈడీ, ఆ ఆరోపణలను నిరూపించలేక చతికిలపడుతోంది. ఉదాహరణకు అయితే 1,142 కేసుల్లో మాత్రమే విచారణ పూర్తి చేసి, ఛార్జిషీట్లు దాఖలు చేసింది.
విచారణల పేరిట ప్రతిపక్ష నేతలపై దూకుడు పెంచుతున్న ఈడీ, బీజేపీ నేతలపై ఎన్ని అవినీతి ఆరోపణలు వచ్చినప్పటికీ ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. ఆర్థిక అవకతవకలకు పాల్పడ్దారంటూ అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మపై పలు కేసులు ఉన్నాయి. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్‌పై అవినీతి ఆరోపణలు ఉన్నాయి. బీజేపీలో చేరకముందు పవార్‌పై కేసుల దర్యాప్తు విషయంలో అధికారులు ఎంతో ఉత్సాహం ప్రదర్శించారు. అయితే ఆయన కాషాయదళంలో చేరగానే కడిగిన ముత్యమై పోయారు. మధ్యప్రదేశ్‌లో శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వ హయాంలో నమోదైన వ్యాపమ్ వంటి అనేక పాత కేసులు ఇప్పుడు అటకెక్కాయి. కర్నాటకలో యడ్యూరప్ప, బీఎస్ బొమ్మై ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు నమోదైన అనేక చిన్న, పెద్ద అవినీతి కేసుల గతీ అంతే. ఆర్థిక అవకతవకలకు సంబంధించిన ఈ కేసుల్లో పలువురు మంత్రులు నిందితులుగా ఉన్నారు. అందుకే ఈడీ పూర్తిగా రాజకీయ ఆయుధంగా మారిందని ఎక్కువ మంది ప్రజలు నమ్ముతున్నారు.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…