ముఖ్యమంత్రి రూల్స్ ఉల్లంఘించమని చెప్పవచ్చా ? పబ్లిసిటీ కోసం .. ఇమేజ్ బిల్డింగ్ కోసం అధికారుల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయవచ్చా ? అసలు అలాంటి పనులు చేయకూడదు. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేశారు. సోషల్ మీడియాలో పబ్లిసిటీ వస్తుందన్న కారణంగా కుమారి అనే ఫుడ్ స్టాల్ మహిళకు భరోసా ఇచ్చారు. ట్రాఫిక్ కు అంతరాయం కలిగిస్తున్నా అక్కడే వ్యాపారం చేసుకోవాలన్న భరోసా ఇచ్చారు. మరి అందరికీ ఇవే రూల్స్ వర్తింప చేయగలరా ?. అందరిపైనా కేసులు ఉప సంహరింపచేయగలరా ?. విధి నిర్వహించిన పోలీసులకు ఎవరు నైతిక స్థైర్యం ఇస్తారు ?
కుమారి అనే మహిళ పుట్ పాత్ మీద ఫుడ్ స్టాల్ పెట్టుకుని బిజినెస్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఒక్క సారిగా పాపులర్ అయింది. ఈ కారణంగా ఆమె ఫుడ్ స్టార్ పెట్టుకునే ఐటీ కారిడార్ ఏరియాకు తమ వ్యాపారాల్ని ప్రమోటం చేసుకునేందుకు సినిమా వాళ్ల దగ్గర నుంచి ఇన్ ఫ్లూయన్సర్స్ వరకూ అందరూ క్యూ కట్టారు. చివరికి రాజకీయ పార్టీల తరపున కూడా సోషల్ మీడియా ప్రమోషన్లు రోడ్ మీదనే చేసుకోవడం ప్రారంభించారు. దీంతో ఆ రోడ్డు పూర్తి జామ్ అయిపోవడం ప్రారంభించిది. అదేదో కుమారి అనే మహిళ సొంత అడ్డా అన్నట్లుగా మారిపోయింది. చూసి చూసి సహనం నశించిన పోలీసులు ఒక వారం రోజుల పాటు స్టాల్ పెట్టవద్దని చెప్పారు. ఇది కూడా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఆయనకు ఎవరైనా సలహాలిచ్చారో లేకపోతే ఆయన నిర్ణయం తీసుకున్నారో కానీ.. అక్కడ దుకాణం పెట్టుకునేందుకు అనుమతించాలని ఆదేశించారు. పోలీసులు నమోదు చేసిన న్యూసెన్స్ కేసును కూడా మళ్లీ పరిశీలించాలన్నారు. అంతే కాదు.. తానే స్వయంగా ఫుడ్ స్టాల్‌కు వస్తానని కూడా చెప్పుకొచ్చారు.
సీఎం రేవంత్ రెడ్డి పీఆర్ టీం అనుకున్నట్లుగా వెంటనే రేవంత్ రెడ్డి ప్రజా పాలన అంటే ఇదే అంటూ.. సోషల్ మీడియాలో ఉదరగొట్టడం ప్రారంభించారు. కానీ కాస్త తరచి చూస్తే బాధ్యత గల ముఖ్యమంత్రి చేసే పనేనా అని ఎవరికైనా అనిపిస్తుంది. ఎందుకంటే కుమారి అనే మహిళ ఫుట్ పాత్ ను ఆక్రమించి వ్యాపారం చేస్తున్నారు. ఇటీవలి కాలంలో ఆమె ఫుడ్ వ్యాపారం మాత్రమే కాదు.. తన స్టాల్ కు సినిమావాళ్లు సహా రాజకీయ మీడియాను ఆహ్వానించి ప్రమోషన్లు చేస్తున్నారు. అదే సమయంలో పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వచ్చిన ప్రచారంతో రెస్టారెంట్లకు వచ్చినట్లుగా జనం వస్తున్నారు. ఆ రోడ్ పూర్తిగా బ్లాక్ అయిపోతోంది. ఆమె ఒక్కరి వల్ల ఐటీ కారిడార్ ట్రాఫిక్ మొత్తం ప్రభావితమవుతోంది. ఇప్పుడు సీఎం తీసుకున్న నిర్ణయం వల్ల.. ఆమె అక్కడే అంటే ఫుట్ పాత్‌ను తన సొంత వ్యాపార స్థలంగా చేసేసుకుంటారు. హైదరాబాద్ లో ఫుట్ పాత్ మీద ఫుడ్ అమ్ముకునేవాల్లు ఆమె ఒక్కరే కాదు.. కొన్ని వేల మంది ఉంటారు. మరి వారందరికీ కూడా రేవంత్ రెడ్డి ఆదేశాలు వర్తిస్తాయా ?. రేవంత్ చేసిన ప్రకటనతో.. మరింత మంది ఫుట్ పాత్‌లు తమవేనని వ్యాపారాలతో రెడీ అయ్యే వారుంటారు. మరి ట్రాఫిక్ కు వచ్చే సమస్యలపైఎవరు బాధ్యత వహిస్తారు. ఫుట్ పాత్ ఆక్రమణకు ఎవరు సమాధానం చెబుతారు.
సీఎం రేవంత్ రెడ్డి పేద మహిళకు సాయం చేశాననే పబ్లిసిటీ కోసం .. నిబంధనలు కూడా ఉల్లంఘించారు. ఉల్లంఘించమని ఆదేశాలిచ్చారు. పోలీసు అధికారులకూ అలాంటి ఆదేశాలు ఇచ్చారు. దీంతో పోలీసులు, అధికారులు దీన్నే అలుసుగా తీసుకుని అక్రమాలకు పాల్పడే అవకాశం ఉంది. రేవంత్ రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత ఏదైనా రూల్స్ ప్రకారమే జరగాలని పెద్ద పెద్ద ప్రకటనలు చేస్తున్నారు. పోలీసుల్ని.. అధికారుల్ని లాబీయింగ్ లేకుండా నియమిస్తున్నామంటున్నారు. కానీ జరుగుతున్నది వేరుగా కనిపిస్తున్నది.
నిజానికి ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి స్పందించాల్సిన అవసరం లేదు. కానీ పబ్లిసిటీ అవసరం కాబట్టి స్పందించాలని అనుకున్నా.. ఇక రూల్స్ ప్రకారం వెళ్లాల్సి ఉంటుంది కానీ ఏకపక్షంగా అధికార యంత్రాంగానిదే తప్పన్నట్లుగా చేయడం..తన ప్రభుత్వాన్ని తాను కించపర్చుకున్నట్లే. ఆమెకు నిబంధనలకు అనుగుణంగా ప్రత్యామ్నాయ స్థలం చూపిస్తామనడమో మరో విధంగా సాయం చేయడమో చేయాలి కానీ.. ఇలా రూల్స్ కు విరుద్ధమైన ఆదేశాలు ఇవ్వడం అధికార దుర్వినియోగం అయ్యే అవకాశం ఉంది. ఈ ఆదేశాల వల్ల సీఎంకు తాత్కలిక పొగడ్తలు రావొచ్చు కానీ దీర్ఘకాలికంగా కీడు చేస్తుంది.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…