అధికారంలో ఉన్న వారు ఏదైనా ఎన్నికలు వస్తే తమకు ఓటేయకపోతే మీ సంగతి చూస్తామని బ్లాక్ మెయిలింగ్ చేస్తూ ఉంటారు. ఇలా ఎక్కువగా ఎందుకు చేస్తారంటే తమకు ఓటేయరేమోన్న భయంతో చేస్తూంటారు. తమ పరిపాలన మధ్యలో ఉన్నప్పుడో.. చివరి దశకు వచ్చినప్పుడో ఇలా చేస్తారు. కానీ అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే ఇలా బెదిరింపులకు దిగితే మాత్రం అది ఖచ్చితంగా నెగెటివ్ అవుతుంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పదవి చేపట్టిన రెండు నెలల్లోనే ఓటర్లను ఇలా బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. ఇప్పుడీ అంశం సోషల్ మీడియాలోనే కాదు ప్రజల్లోనూ చర్చనీయాంశమవుతుంది.
కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే ఆరు గ్యారంటీలను వంద శాతం అమలు చేయడానికి అవకాశం ఉంటుందని రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో నిర్మొహమాటంగా చెప్పేశారు. ఇప్పుడు ఆయన స్టేట్మెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో మొత్తం వెదికినా హామీలు అమలు చేయాలంటే కేంద్రంలో కూడా కాంగ్రెస్ అధికారంలోకి రావాలనే షరతును ఎక్కడా పెట్టలేదు. మరి ఎందుకు రేవంత్ రెడ్డి ఈ మాట అంటున్నారు ? . హామీలు అమలు చేయడం కష్టమని అంచనాకు వచ్చారా అన్న విశ్లేషణలు ప్రారంభమయ్యాయి. రేవంత్ రెడ్డి ఈ మాటలు చెప్పింది లోక్సభ ఎన్నికల ప్రిపరేషన్స్ పై ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో. ఈ ప్రకారం చూస్తే రేవంత్ రెడ్డి ఆరు గ్యారంటీలు పొందాలంటే కాంగ్రెస్ పార్టీకి మరోసారి ఓటు వేయాలన్న సందేశాన్ని బ్లాక్మెయిలింగ్ తరహాలో ప్రజలకు జారీ చేశారని అనుకోవచ్చు.
తమకు ఓటేయకపోతే పథకాలు అందవు అని ప్రతి ప్రభుత్వం అవసరమైనప్పుడల్లా ఓటర్లను బెదిరిస్తూనే ఉంటాయి. అయితే ఈ బెదిరింపులు అందుతున్నప్పుడే చేస్తారు. అంటే అమల్లోకి వచ్చిన తర్వాత ఆగిపోతాయని బెదిరిస్తారు. కానీ ఇక్కడ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇంకా పథకాల అమలు ప్రారంభించలేదు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మాత్రమే నికరంగా అమల్లోకి వచ్చింది. ఇంకా ఆరు గ్యారంటీల్లో అత్యంత కీలకమైన పథకాలు అమలు కావాల్సి ఉంది. ఈ లోపే పార్లమెంట్ ఎన్నికలు ముంచుకు రావడం ఖాయంగా కనిపిస్తోంది. ఎన్నికల ప్రచార సమయంలో ముఫ్పై రోజుల్లో పథకాలు అమలు చేస్తామన్నారు. ఎన్నికలు అయిపోయాక.. వంద రోజులు అంటున్నారు. ఇప్పుడు కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే అమలు అంటున్నారు. ఈ వేరియషన్స్ చూసి ప్రజలకు కూడా అనుమానాలు ప్రారంభమవుతున్నాయి. ప్రతిపక్ష పార్టీలు వీటిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తున్నారు.
రేవంత్ రెడ్డి చాలా త్వరగా ఓటర్లను ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అసలు ఇవ్వకుండా.. మరోసారి కాంగ్రెస్ పార్టీకి ఓటేయకపోతే అసలు ప్రారంభం కావని హెచ్చరించడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ విషయంలో రేవంత్ రెడ్డి సంయమనంతో వ్యవహరించాల్సి ఉందన్న అభిప్రాయం సహజంగానే వినిపిస్తోంది., ఎందుకంటే .. కాంగ్రెస్ పార్టీ వస్తే ఏదో జరిగిపోతుందని బీఆర్ఎస్ విస్తృతంగా ప్రచారం చేసింది. కానీ ఓటర్లు అవేమీ నమ్మలేదు. కాంగ్రెస్ ను నమ్మారు. గ్యారంటీలు అమలు చేస్తారని నమ్మారు. అలాంటిది ఇప్పుడు కాంగ్రెస్ కు ఓటేయకపోతే పథకాలు రావని బెదిరించడం ఓ రకంగా ఆత్మవిశ్సాసాన్ని కోల్పోవడమే అవుతుంది. రెండు నెలలకే రేవంత్ రెడ్డి ఇలా ఓటర్లను బ్లాక్ మెయిల్ చేయాల్సన పరిస్థితికి వచ్చి ఉంటే నిజంగా అది .. పతనమే అవుతుంది.
లోక్సభ ఎన్నికల్లో గెలవడం రేవంత్ రెడ్డికి అత్యవసరం. అందులో సందేహం లేదు. కనీసం పది పార్లమెంట్ సీట్లు గెల్చుకుంటేనే తన ప్రభుత్వం మరింత పటిష్టంగా ఉంటుంది. పొరపాటున నాలుగైదు సీట్లకు పరిమితమైనా ఓ వైపు ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి.. మరో వైపు తనకు వ్యతిరేకంగా పెరిగే అసంతృప్తి స్వరాల్ని కంట్రోల్ చేయడానికి ఆయన చాలా కష్టపడాల్సి ఉంటుంది. అందుకే రేవంత్ ఒత్తిడికి గురై.. కాంగ్రెస్ కు ఓటేయాల్సిందే అన్నట్లుగా ఓటర్లను డిక్టేట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రేవంత్ రెడ్డికి అప్పుడే వ్యతిరేకత ప్రారంభమయిందని.. బీఆర్ఎస్ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. నిజానికి కొత్త ప్రభుత్వానికి ప్రతిపక్ష పార్టీలు సమయం ఇవ్వకపోయినా ప్రజలు మాత్రం సమయం ఇస్తారు. కనీసం రెండేళ్ల పాటు చూస్తారు. ఆ తర్వాతే ప్రభుత్వ పనితీరుపై ఓ అభిప్రాయానికి రావడానికి ప్రయత్నిస్తారు. ప్రజలు ఇప్పటికిప్పుడు ప్రభుత్వం పై అసంతృప్తి పెంచుకోవాల్సిన అవసరం.. సందర్భం కూడా లేదు. అయినా రేవంత్ రెడ్డి తన ఆఖరి అస్త్రాన్ని ప్రయోగించడానికి రెడీ అయిపోతున్నట్లుగా వ్యవహరిస్తున్నారు.
రేవంత్ రెడ్డి ఇలా ఓటర్లను బ్లాక్ మెయిల్ చేయడానికి ప్రయత్నిస్తే.. ఆయన ముందే ఓడిపోయారని డిక్లేర్ చేయడానికి అందరూ ముందుకు వస్తారు. ఈ విషయంలో ఎలాంటి సందేహం ఉండదు. పట్టుదలగా పెరిగి రాజకీయంలో ఢక్కామొక్కీలు తిన్న రేవంత్ రెడ్డికి ఈ విషయం తెలియనిది కాదు..కానీ ఆయన ఇప్పుడు ప్రభుత్వాధినేతగా ఉన్నారు. ఫలితాలు చూపించాల్సిన కుర్చీలో ఉన్నారు. ఆ ఒత్తిడి ఆయనపై ఎక్కువగానే కనిపిస్తోంది.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…