షర్మిల కాంగ్రెస్ కే భారమా?

By KTV Telugu On 3 February, 2024
image

KTV TELUGU :-

ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్   చీఫ్  షర్మిల  పట్ల  పార్టీ శ్రేణుల్లో వ్యతిరేకత వెల్లువెత్తుతోందా? షర్మిల వల్ల  ఏపీలో  భూస్థాపితం అయిపోయిన కాంగ్రెస్ పార్టీకి పునరుజ్జీవం  వస్తుందని నాయకత్వం పెట్టుకున్న  ఆశలు నెరవేరకపోగా మరింత డ్యామేజి అవుతోందా? పార్టీ ప్రతిష్ఠ మరింతగా దిగజారుతోందా? రాజకీయ వర్గాల్లో వినిపిస్తోన్న వాదనలను నిశితంగా గమనిస్తే ఈ ప్రశ్నలన్నింటికీ అవుననే సమాధానమే వస్తోందంటున్నారు పరిశీలకులు. షర్మిలను అడ్డుపెట్టుకుని కాంగ్రెస్ ను బలోపేతం చేసుకోవాలని నాయకత్వం ఆశిస్తోంటే..తన అజెండాని ముందుకు నడిపించడానికి షర్మిల కాంగ్రెస్ పార్టీని వాడుకుంటున్నారని పార్టీలో సీనియర్ నేతలు సైతం భావిస్తున్నారట. మొత్తానికి షర్మిల మాట తీరు.. ఆమె చేస్తోన్న విమర్శలు అన్నీ కూడా  కాంగ్రెస్ కు నష్టం తెచ్చేలానే ఉన్నాయని అంటున్నారు.

ఏడాది క్రితం తెలంగాణా రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తానంటూ తెరపైకి వచ్చిన షర్మిల  వై.ఎస్.ఆర్. తెలంగాణా పార్టీని స్థాపించారు. పార్టీ పెట్టిన కొత్తలో పాదయాత్ర కూడా చేశారు. ఆ సమయంలోనే  కాంగ్రెస్ పార్టీపై ప్రతీ ప్రసంగంలోనూ నిప్పులు చెరిగారు షర్మిల. తమ కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ వెంటాడి వేధించిందని  మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీని  తన తండ్రి  వరుసగా రెండు సార్లు గెలిపిస్తే  కాంగ్రెస్ పార్టీ మాత్రం తన తండ్రి మరణానంతరం ఆయన పేరును ఎఫ్.ఐ.ఆర్.లో పెట్టించిందని  ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పాలని అనేవారు. అయితే ఆ తర్వాత ఎవరితో ఎవరి సలహా మేరకు ఏ డీల్ కుదిరిందో తెలియదు కానీ  సడెన్ గా వై.ఎస్.ఆర్.తెలంగాణా పార్టీ బోర్డు తిప్పేశారు. పార్టీ కార్యాలయానికి తాళాలు వేసేశారు. అలా ఢిల్లీ విమానం ఎక్కి  టెన్ జన్ పథ్ వెళ్లిపోయారు.

తన తండ్రిని తమ కుటుంబాన్ని వేధించిన సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను చూసి తరించిపోయారు. వాళ్లకి షేక్ హ్యాండిచ్చి సంబరపడిపోయారు.  తెరచాటు  సిఫారసుల మేరకు గాంధీలు ఆమెకు ఏపీ పిసిసి చీఫ్ పదవిని చేతిలో పెట్టేశారు.పిసిసి చీఫ్ కాగానే  ఏపీలో తన సోదరుడు జగన్ మోహన్ రెడ్డిపైనా ఆయన ప్రభుత్వంపైనా  తీవ్ర పదజాలంతో దూషించడం మొదలు పెట్టారు. మరో వైపు రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలన్న తన తండ్రి ఆశయాన్ని నిజం చేయడానికే కాంగ్రెస్ లో చేరానన్నారు.  నిజానికి రాహుల్ ని  పిఎం చేయాలని వై.ఎస్.ఆర్. అనేవారు. అన్న ప్రకారం ఆయన కేంద్రంలో  రెండు సార్లు  కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసే స్థాయిలో ఏపీ నుంచి ఎంపీలను గెలిపించి ఇచ్చారు. కాకపోతే ప్రధాని పదవి   స్వీకరించడానికి రాహుల్ గాంధీ ఎందుకు సిద్ధంగా లేకపోయారో టెన్ జన్ పథ్ నేతలు చెప్పాలి వై.ఎస్.

కాంగ్రెస్ పార్టీకి గాంధీలకు  వై.ఎస్.ఆర్. అంత సాయం చేస్తే ఆయన తనయుని పార్టీనుండి వెళ్లిపోయేలా చేసి ఆయనపై అక్రమ కేసులు బనాయించింది కాంగ్రెస్ పార్టీ.చివరకు జైలకు కూడా పంపించింది. ఆ సమయంలో పాదయాత్ర చేసిన షర్మిల నాడు కాంగ్రెస్ పార్టీని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు. అదే కాంగ్రెస్ ఇపుడు షర్మిలకు  చాల గొప్ప పార్టీ అయిపోవడం  విశేషం. షర్మిల రావడంతో కాంగ్రెస్ పార్టీకి సీట్లు రాకపోయినా కొద్దిగా ఓట్లు అయినా పెరుగుతాయని పార్టీకి జోష్ వస్తుందని పార్టీ కార్యకర్తలు ఆశపడ్డారు. అయితే ఆమె వచ్చీ రావడమే  జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంపై  నిరాధార ఆరోపణలు.. విమర్శలు చేయడమే అజెండాగా పెట్టుకున్నారు.

ఆమె ప్రసంగాలన్నీ వాటికే పరిమితం అవుతుండడం వాటిపై సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ జరుగుతూ ఉండడంతో షర్మిల కాంగ్రెస్ పార్టీకి భారంగా మారుతున్నారని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. ఆమె ధోరణి ఇలానే కొనసాగితే  కాంగ్రెస్ పార్టీపై ఉన్న వ్యతిరేకత మరింతగా పెరిగే ప్రమాదం ఉందని వారు ఆందోళన చెందుతున్నట్లు చెబుతున్నారు. ఆమె చేతిలో పార్టీ పగ్గాలు పెట్టేసి వదిలేస్తే పార్టీ భవిష్యత్తులో మరింతగా దిగజారిపోయే  అవకాశాలున్నాయని వారు హెచ్చరిస్తున్నారు. టిడిపి ఆరోపణలనే ఆమె అంది పుచ్చుకుంటున్నారని..అందులో వాస్తవాలు ఉన్నాయా లేవా అన్నది  నిర్ధారించుకోవడం లేదని వారు అభిప్రాయ పడుతున్నారు.

షర్మిలను చీఫ్ గా కొనసాగిస్తే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఒరిగేదేమీ ఉండకపోగా సుదూర కాలంలోనూ భవిష్యత్తు శూన్యమే అవుతుందని పార్టీలో కీలక నేతలు పార్టీ హై కమాండ్ కు సమాచారం పంపినట్లు చర్చజరుగుతోంది. తానొకటి తలిస్తే దైవం ఇంకొకటి తలిచినట్లు  కాంగ్రెస్ నాయకత్వం చంద్రబాబు నాయుడిని ప్లీజ్ చేయడం కోసం షర్మిలకు కీలక పదవి ఇస్తే అది కాంగ్రెస్ పాలిట భస్మాసుర హస్తం అయ్యేలా ఉందని కాంగ్రెస్ కార్యకర్తలు , నేతలు భయపడుతున్నారు. జగన్ మోహన్ రెడ్డితో షర్మిలకు ఆస్తితగాదాలు ఉంటే వాటిని కోర్టుల్లో తేల్చుకోవాలి తప్ప  పార్టీని అడ్డుపెట్టుకుని బహిరంగ సభల్లో వాటి గురించి మాట్లాడితే  పార్టీకి ఏం లాభమని  నేతలు ప్రశ్నిస్తున్నారు. దీనిపై పార్టీ నాయకత్వం ఒక నిర్ణయం తీసుకోవాలని వారు సూచిస్తున్నారు..

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి