దక్షిణాదిపై వివక్ష నిజం – ముందసున్నది అసలు ప్రమాదం !

By KTV Telugu On 5 February, 2024
image

KTV TELUGU :-

నిధుల కేటాయింపుల విషయంలో కేంద్రంలోని బీజేపీ సర్కారు దక్షిణాది రాష్ర్టాలపై పూర్తి వివక్ష చూపిస్తున్నదని కాంగ్రెస్‌ ఎంపీ, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ సోదరుడు డీకే సురేశ్‌ ఆరోపించారు. ఇలాంటి సమయంలో దేశాన్ని విడగొట్టి.. దక్షిణాది రాష్ర్టాలకు ప్రత్యేక దేశాన్ని ప్రకటించాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.  ఈ డిమాండ్ పై దుమారం రేగింది.  అయితే  బీజేపీ అధికారం చేపట్టినప్పటి నుండి దక్షిణాదిపై వివక్ష స్పష్టంగా కనిపిస్తోంది.  అధికారం సహా సర్వం ఉత్తరాది మయం కాగా..   ఆదాయం కూడా  ఎక్కువగా ఉత్తరాది రాష్ట్రాలకే పంచుతున్నారు. అదే సమయంలో దక్షిణాది ప్రాధాన్యాన్ని వీలైనంతగా తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. చివరికి పార్లమెంట్ సీట్లు కూడా తగ్గించే ఆలోచన చేస్తున్నారు. అందుకే  ప్రజల మనసుల్లో వివక్ష బీజం పడితే అంత త్వరగా సమసిపోదు.

దక్షిణాది ప్రాంతంపై హిందీ ప్రాంతవాసులు చూపుతున్న వివక్ష గురించి ఇటీవలి కాలంలో విస్తృతంగా చర్చ జరుగుతోంది.  పార్లమెంట్‌లో  కాంగ్రెస్ ఎంపీ డీకే సురేష్ ఘాటుగా విరుచుకుపడ్డారు.    కేంద్ర బడ్జెట్‌లో గ్రాంట్ల వివక్షను సరిచేయకపోతే ప్రత్యేక దేశం ఇవ్వాలన్నారు.  గ్రాంట్లలో వివక్ష ఇలాగే కొనసాగితే దక్షిణ భారతీయులు ప్రత్యేక దేశం కోసం గళం విప్పడం అనివార్యమవుతుందని హెచ్చరించారు. కేంద్ర నిధుల్లో మా వాటా మాకు అందడం లేదు. మా డబ్బును ఉత్తర భారతానికి ఇస్తున్నారు. దక్షిణాది రాష్ర్టాలకు అన్ని విషయాల్లోనూ కేంద్రం అన్యాయం చేస్తున్నది. హిందీ వాళ్లు మాపై పెత్తనం చేస్తున్నారు  అని ఆయన మండిపడ్డారు.  డీకే సురేష్ వ్యాఖ్యాలను కాంగ్రెస్ కూడా ఖండించింది. అయితే ప్రజల మనసుల్లో ఏముందో కూడా పాలకులు ఆలోచించాల్సిన పని ఉంది. ప్రజల్లో ఆ వాదన లేకపోతే డీకే సురేష్ మాట్లాడే సాహసం కూడా చేయరు.

దక్షిణాదిపై కేంద్రం అన్ని స్థాయిలో వివక్ష చూపిస్తోంది.  రాష్ట్రపతి, ప్రధాని సహా కేంద్రంలో ఉన్న అధికార వర్గం అంతా… పూర్తిగా హిందీ పెత్తందారులే.  దక్షిణాదికి లభించే ప్రాధాన్యత ఏమీ ఉండదు. దక్షిణాది రాష్ట్రాలు వాటి మౌలిక అభివృద్ధికి కావాల్సిన నిధులను అప్పు తెచ్చుకుంటుంటే, ఉత్తరాది రాష్ట్రాలు కేంద్రం నుంచి గ్రాంట్లు పొందుతున్నాయి. చేసిన అప్పులను తిరిగి తీర్చాల్సిందే. అదే కేంద్ర గ్రాంటులైతే తిరిగి చెల్లించనక్కర్లేదు. నిజానికి దక్షిణాది రాష్ట్రాలు చేయగల అప్పుల మీద కేంద్రం పరిమితి విధించడంతో ఆ వసతి కూడా లేకుండా పోతున్నది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలు కోరిన ఏ ప్రాజెక్టునూ ఎన్‌డిఎ ప్రభుత్వం మనస్ఫూర్తిగా మంజూరు చేసిన దాఖలాలు లేవు.  ఇటీవల ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా   భారీ ఖర్చుతో ఆయా రాష్ట్రాల్లో 12 గోదాములు నిర్మించనున్నట్లు ప్రకటించింది. ఆ12 గోదాముల్లో ఒక్కటీ దక్షిణాది రాష్ట్రాలవి లేవు. తొలి విడతలో ఎంపిక చేసిన 9 రాష్ట్రాలూ ఉత్తరాదివే. అందులోనూ 6 బిజెపి పాలిత రాష్ట్రాలే .

రాష్ట్ర విభజన సందర్భంగా తెలుగు రాష్ట్రాలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు.   న ఆంధ్రాకు ప్రత్యేక హోదా, విశాఖ రైల్వేజోన్, రాజధానికి నిధులు ఇలా అనేక హామీలు ఇచ్చినా, ఏ ఒక్కదానికీ అతీగతీ లేదు. కొత్త రాష్ట్రం, పైగా రాజధాని నిర్మాణం జరగాల్సిన ప్రాంతం కాబట్టి గ్రాంట్ల కేటాయింపులో కేంద్రం కొంత మానవీయంగా ఆలోచించాల్సి ఉన్నా.. వివక్షనే కొనసాగిస్తున్నది. ఉదాహరణకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ  ని తీసుకుంటే ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ రహదారులను అభివృద్ధి చేయాలంటే, అక్కడ పెట్టే ఖర్చుకు 15 శాతం రాబడి రావాలంటున్న ఎన్‌హెచ్‌ఎఐ, అదే గుజరాత్‌లోని సోమనాథ్ చుట్టూ అభివృద్ధి చేస్తున్న జాతీయ రహదారికి మాత్రం అలాంటి షరతులేమీ పెట్టలేదు.

దక్షిణాదిలో ఒక్క రాష్ట్రంలోనూ బీజేపీ అధికారంలో లేదు. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక గ్రాంట్లకు కోత విధించారు. కేరళ ప్రభుత్వంపై తీవ్రమైన ఆర్థిక నిబంధనలు అమలు చేస్తున్నారు.  అప్పులు కూడా తీసుకోకుండా కట్టడి చేస్తున్నారు. వరదలు ముట్టడించినప్పుడు విదేశీ సాయాన్నీ తీసుకోనీయలేదు. ఇక తమిళనాడు సర్కార్ .. తమకు రావాల్సిన నిధుల గురించి  సిఎం స్టాలిన్ అనేక సార్లు ప్రధాని మోడీని అడిగారు కూడా. అయినా కేంద్రం స్పందించలేదు.

కొత్తగా లోక్‌సభ సీట్లనూ తగ్గించే కుట్రలు జరుగుతున్నాయి.  2026వ సంవత్సరం తర్వాత జనాభా ప్రతిపాదికన  లోక్‌సభ స్థానాల డిలిమిటేషన్  జరగనుంది.    అధిక జనాభాతో సతమతమవుతున్న దేశాన్ని కాపాడుకునేందుకు జనాభా నియంత్రణ పద్ధతులు పాటించాలని దశాబ్దాల నుంచి కేంద్రం చెబుతున్న మాటలను, విధానాలను నమ్మి ప్రగతిశీల విధానాలతో జనాభా నియంత్రణ చేసిన దక్షిణాది రాష్ట్రాలు ఈరోజు తీవ్ర అన్యాయానికి లోనయ్యే అవకాశం ఉంది.  తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్నాటక రాష్ట్రాలకు ప్రస్తుతం 129 లోక్‌సభ స్థానాలున్నాయి. తాజా పునర్విభజనలో వీటి సంఖ్య 103కు పడిపోయే అవకాశం ఉంది.   ఉత్తరాదిలోని ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, బీహార్ రాష్ట్రాలలో లోక్‌సభ స్థానాల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతుంది. ప్రస్తుతం ఈ నాలుగు రాష్ట్రాలలోని లోక్‌సభ స్థానాల సంఖ్య 174 కాగా పునర్విభజనతో వీటి సంఖ్య ఏకంగా 204 స్థానాలకు చేరుకుంటుంది.  ఇలాంటివి జరిగితే.. వేర్పాటు వాదం మరింత ఊపందుకుంటుంది. అది దేశానికి మంచిది కాదు. దేశాన్ని కలిపి ఉంచాలనుకుంటే పాలకులు దేశాన్ని సమదృష్టితో చూడాల్సి ఉంది..

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి