ఆయన తెలంగాణ డిప్యూటీ సీఎం. ముఖ్యమంత్రి అవుదామనుకున్నా.. అధిష్టానం ఒప్పుకోలేదు. ఉప ముఖ్యమంత్రి పదవితో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.ఐనా పట్టువదలని విక్రమార్కుడు. పైగా పేరులోనే విక్రమార్కుడు ఉంది కదా.. తెలివిగా మరో వైపు నుంచి నరుక్కు వస్తున్నారు. తొలుత సొంత జిల్లాలో పూర్తి పట్టు సాధించాలనుకున్నారు….
ఎన్నికల ముందే భట్టి ఒక అంచనాకు వచ్చారు. వీలైతే సీఎం పదవికి గాలం వేద్దామనుకున్నారు. ఒక నియోజకవర్గ ఎమ్మెల్యే స్థాయి నుంచి పైకి ఎదగాలనే ప్రయత్నంలో వ్యూహాత్మకంగా అడుగులు వేశారు. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ పాదయాత్ర చేశారు. మల్లు భట్టి విక్రమార్క నిర్వహించిన స్పందన లభించింది. దానితో భట్టీ పరపతి విస్తరించింది. 2009 నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉంటున్నా కోరుకున్న సీఎం పదవి మాత్రం రాలేదు. లేటుగా వచ్చిన రేవంత్ రెడ్డి దాన్ని ఎగరేసుకుపోయారు. ఐనా భట్టి నిరాశ చెందలేదు. డిప్యూటీ సీఎం పదవిని చేపట్టిన రోజు నుంచి తన అజెండాను అమలు చేస్తూ వస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మధిర నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించే భట్టి..తన కోరిన తీరాలంటే తొలుత సొంత జిల్లాలో తిరుగులేని నాయకుడిగా ఎదగాలని డిసైడయ్యారు…ఖమ్మంలో పట్టు కోసం తన భార్య నందినిని రంగంలోకి దించారు. ఖమ్మం ఎంపీ స్థానం కోసం ఆమె కాంగ్రెస్ టికెట్ కు దరఖాస్తు చేసుకున్నారు. అదే సక్సెస్ అయితే పొంగులేటి, తుమ్మల ఇద్దరినీ దెబ్బకొట్టినట్లవుతుందని భట్టి అంచనా వేసుకుంటున్నారు…
ఖమ్మం టికెట్ కోసం భట్టి భార్య నందిని గాంధీభవన్ కు వచ్చి దరఖాస్తు చేసుకున్నారు. ఆమె ఖమ్మం నుంచి నేతలు, కార్యకర్తలు, మద్దతుదాలుతో కలిసి ర్యాలీగా హైదరాబాద్ వరకు రావడం టాక్ ఆఫ్ ది తెలంగాణగా మారింది. సోనియా, ప్రియాంకా గాంధీలు ఖమ్మం నుంచి పోటీ చేయకుంటే తనకు అవకాశం ఇవ్వాలని అధిష్ఠానాన్ని కోరుతున్నట్లు నందిని తెలిపారు. కార్యకర్తల కోరిక మేరకే ఖమ్మం టికెట్‌కు దరఖాస్తు చేసుకుంటున్నట్లు వెల్లడించారు. అలాగే ఖమ్మం సీటు కోసం కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి, టీపీసీసీ మాజీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జెట్టి కుసుమ్‌కుమార్, పార్టీ నేత రాయల నాగేశ్వర్రావు, టీపీసీసీ అధికార ప్రతినిధి మద్ది శ్రీనివా్‌సరెడ్డి కూడా దరఖాస్తు చేశారు.ఐనా టికెట్ భట్టి భార్యకే వస్తుందని పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఈ క్రమంలో ఉమ్మడి ఖమ్మానికి చెందిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ఇద్దరినీ దెబ్బకొట్టి జిల్లాలో తాను తిరుగులేని నాయకుడినవుతానని భట్టి లెక్కలేసుకుంటున్నారు. దీనితో ఇది ముగ్గురు మంత్రుల మధ్య పోటీగా మారింది. పొంగులేటి టీఆర్ఎస్ ను వీడిన తర్వాత.. తాను చెప్పిన వారికి టికెట్లు ఇస్తే ఖమ్మం జిల్లా మొత్తం పార్టీని గెలిపిస్తానని హామీ ఇచ్చారు. టికెట్ల సంగతి పక్కన పెడితే.. మాట ప్రకారం ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పార్టీ విజయంలో కీలకభూమిక పోషించారు. ఆయన ప్రతి వ్యవహారాల్లోనూ ఎంతో కీలకంగా ఉండే తన సోదురుడు ప్రసాద్ రెడ్డిని కాంగ్రెస్ తరపున ఖమ్మం ఎంపీగా పోటీచేయించాలని అనుకుంటున్నారు.తుమ్మల కూడా ఇలాంటి ఆలోచనతోనే ఉన్నారు. ఇవి దాదాపుగా తనకు చివరి ఎన్నికలు అని ప్రకటించారు. తన కొడుకు యోగేందర్ తో రాజకీయ అరంగేట్రం చేయించాలని ఆయన తపన పడుతున్నారు. ఖమ్మం ఎంపీగా కొడుకును బరిలోకి దించే ఆలోచనతో ఉన్నారు. ఇలా రెండు ప్రధాన సామాజిక వర్గాల నుంచి ఇధ్దరు బలమైన నాయకులు.. ఇద్దరూ కూడా మంత్రులుగా ప్రభుత్వంలో కీలకంగా ఉన్నవారు.. ఖమ్మం ఎంపీ సీటును ఆశిస్తున్నారు. భట్టి దళిత సామాజికవర్గానికి చెందిన నాయకుడు. ఆయన భార్య నందినికి టికెట్ ఇస్తే.. పార్టీలో వారిద్దరనీ పక్కన పెట్టినట్లవుతుందని పార్టీ వర్గాలు లెక్కలేసుకుంటున్నాయి…
ఖమ్మం జిల్లాలో ఇతర నేతలకు లేని అడ్వాంటేజ్ భట్టికి ఉంది. పొంగులేటి, తుమ్మల ఇద్దరు ఇటీవలే పార్టీలోకి వచ్చిన నాయకులు. భట్టి మాత్రమే కాకుండా ఆయన కుటుంబం కూడా మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉంది. అధిష్టానం నిర్ణయాలకు తలొగ్గి పనిచేసే క్రమశిక్షణ ఉన్న నాయకులుగా వారికి మంచి పేరుంది. అందుకే మంచిగా, క్రియాశీలంగా నరుక్కు రావాలని ఆయన ప్రయత్నిస్తున్నారు. పార్టీలో ఎలాంటి గ్రూపులు కట్టకుండా వ్యక్తిగతంగా పురోగామి రాజకీయాలు చేస్తున్నట్లుగా ఆయన అందరికీ ఫీలింగ్ కలిగిస్తున్నారు. అల్టిమేట్ గా ఆయన ఆకాంక్ష ఒక్కటే. సీఎం పదవిని పొందాలన్నదే ఆయన కోరిక. ఈ క్రమంలో భార్యకు ఖమ్మం లోక్ సభ టికెట్ అడగడం ఒక గేమ్ ప్లాన్ మాత్రం. అది సాధ్యం కావచ్చు. కాకపోవచ్చు…
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…