తెలంగాణ బీజేపీ అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్లు తీసుకునేవారి కోసం ఎదురు చూసింది. బలమైన నేతలు ఎవరైనా వస్తారేమోనని చివరి వరకూ ఎదురు చూసింది. అయితే పార్లమెంట్ లో మాత్రం పోటీ తీవ్రంగానే ఉంది. మోదీ మ్యాజిక్ పని చేస్తుందనే ఆశ ఏమో కానీ.. పెద్ద ఎత్తున నేతలు పోటీ పడుతున్నారు. ఈ సారి వ్యాపారవేత్తలు కూడా కొన్ని నియోజకవర్గాల్లో ప్రయత్నిస్తూండటం ఆసక్తికరంగా మారింది.
తెలంగాణ బీజేపీలో ఎంపీ టిక్కెట్ల కోసం పోటీ తీవ్రంగా ఉంది. బీజేపీ సిట్టింగ్ ఎంపీలు స్థానాలు (సికింద్రాబాద్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్) మినహాయిస్తే, మల్కాజ్‌గిరితో పాటు జహీరాబాద్, మెదక్, చేవెళ్ల, మహబూబ్‌నగర్ ఎంపీ టికెట్ల కోసం నాయకులు పెద్దఎత్తున పోటీ పడుతున్నారు. మెదక్ నుంచి పోటీకి తాను సిద్ధమైనట్టు దుబ్బాక మాజీ ఎమ్మెల్యే ఎం. రఘునందన్‌రావు ఇప్పటికే ప్రకటించారు. బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్ పేరు కూడా పరిశీలనలో ఉంది. అయితే ఆయన ఇటీవలే రాజ్యసభ ఎంపీగా ఎన్నికయ్యారు. అందుకే ఆయన పోటీ చేయకపోవచ్చన్న అభిప్రాయం వినిపిస్తోంది. మెదక్ సీటు కోసం ఇతర పార్టీలకు చెందిన కొంత మంది బీజేపీ పెద్దలతో మాట్లాడుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. చేవెళ్ల నుంచి పోటీకి మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి సై అంటున్నారు.ఆయనకు పోటీ పెద్దగా లేదు కానీ.. మాజీ మంత్రి దేవేందర్ గౌడ్ కుమారుడు వీరేందర్ గౌడ్ ప్రయత్నిస్తున్నారు. ఆయన గతంలో చేవెళ్ల నుంచి టీడీపీ తరపున పోటీ చేశారు. ఇక భువనగిరి సీటు తనకే వస్తుందనే ధీమాతో మాజీ ఎంపీ డా.బూరనర్సయ్యగౌడ్ ఉన్నారు. అయితే గత ఎన్నికల్లో పోటీచేసిన భువనగిరి జిల్లా అధ్యక్షుడు శ్యాంసుందర్‌రావు కూడా పోటీకి ఆసక్తి కనబరుస్తున్నారు. మహబూబాబాద్ టికెట్‌కు తేజావత్ రామచంద్రునాయక్, హుస్సేన్‌నాయక్, దిలీప్‌నాయక్ పోటీ పడుతున్నారు.
బీజేపీ తరపున ఖమ్మం నుంచి పోటీ చేసేందుకు పలువురు సీనియర్లు ప్రయత్నిస్తున్నారు. పొంగులేటి సుధాకర్‌రెడ్డి పేరు వినిపిస్తున్నా ఆయన పోటీ చేస్తారా లేదా అన్నదానిపై స్పష్టత లేదు. పార్టీ జిల్లా అధ్యక్షుడు రంగాకిరణ్ , గల్లా సత్యనారాయణ, గరికపాటి మోహన్‌రావు పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఇటీవల ఆరెస్సెస్ నుంచి పార్టీలో చేరిన వినోద్ రావు కూడా పోటీ చేయాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారు. నల్లగొండ నుంచి గత ఎన్నికల్లో జితేంద్ర పోటీ చేశారు. అయితే వచ్చే ఎన్నికల్లో మళ్లీ ఆయనకు అవకాశం లేదని రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షుడు డా.జి.మనోహర్‌రెడ్డి కూడా ఇక్కడి నుంచి పోటీకి ఆసక్తి కనబరుస్తున్నారు. పెద్దపల్లి నుంచి ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి సోగల కుమార్‌కు మళ్లీ పోటీకి అవకాశం దక్కవచ్చునని చెబుతున్నారు. మహబూబ్‌నగర్ సీటు విషయానికొస్తే బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, మాజీ ఎంపీ ఏపీ జితేందర్‌రెడ్డి, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు టి.ఆచారి ప్రయత్నాల్లో ఉన్నారు. మహబూబ్ నగర్ సీటు పరిస్థితి హైకమాండ్‌కు తీర్చలేని పంచాయతీగా మారే అవకాశం కనిపిస్తోంది.
మల్కాజ్‌గిరి లోక్‌సభ సెగ్మెంట్ నుంచి బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటల రాజేందర్ పోటీకి సై అంటున్నారు. ఆయన హైకమాండ్ నుంచి ప్రయత్నిస్తున్నారు. అయితే మల్కాజిగిరి నుంచి పోటీ తీవ్రంగా ఉంది. పి.మురళీధర్‌రావు, పేరాల శేఖర్‌రావు, ఎన్.రామచందర్‌రావు, కూన శ్రీశైలంగౌడ్, డా.ఎస్.మల్లారెడ్డి, టి.వీరేందర్‌గౌడ్, సామ రంగారెడ్డి, మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు హరీశ్‌రెడ్డి తదితరులు ఇక్కడి నుంచి ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకవేళ మల్కాజ్‌గిరి టికెట్ ఇవ్వడానికి వీలుపడని పక్షంలో జహీరాబాద్, మెదక్ నుంచి అయినా పోటీ సిద్ధమే అన్న సంకేతాలు ఈటల ఇచ్చినట్టు సమాచారం. జహీరాబాద్ నుంచి పోటీకి అవకాశం కల్పించాలని కొంత మంది వ్యాపారవేత్తలు ప్రయత్నిస్తున్నారు. వీరశైవ లింగాయత్ సమాజ్‌కు చెందిన జాతీయనేత అశోక్ ముస్తాపురె, అక్కడి ప్రజల్లో గుర్తింపు ఉన్న సోమయప్ప స్వామిజీ, చీకోటి ప్రవీణ్ పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి.
వరంగల్ ఎంపీ టికెట్ ఇస్తే.. బీజేపీలో చేరి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ఎంఆర్‌పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ చెబుతున్నారని సమాచారం. మాజీ డీజీపీ కృష్ణప్రసాద్, మరికొందరూ ఇదే సీటుకు పోటీపడుతున్నారు. నాగర్‌కర్నూల్ స్థానానికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బంగారు శ్రుతిని బరిలో దింపవచ్చునని లేదంటే ఎవరినైనా కొత్త అభ్యర్థిని తెరపైకి తీసుకొచ్చే అవకాశx Gxof. హైదరాబాద్ ఎంపీగా ఎమ్మెల్యే రాజాసింగ్‌ను పోటీ చేయిస్తే అనూహ్య ఫలితాలు సాధించవచ్చనే చర్చ పార్టీవర్గాల్లో జరుగుతోంది. గత ఎన్నికల్లో పోటీ చేసిన భగవంత్‌రావు పేరు కూడా పరిశీలనలో ఉంది. చాలా నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులు ఉన్నప్పటికీ.. వర్గ పోరాటం పెద్ద సమస్యగా మారింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత అంతర్గత సమావేశానికి అమిత్ షా ఒక్క సారి మాత్రమే వచ్చారు. ఇక హైకమాండ్ ఎలాంటి దృష్టి పెట్టలేదు. లోక్ సభ ఎన్నికల కోసం దేశమంతా దృష్టి పెట్టాల్సి రావడంతో తెలంగాణపై ఎక్కువ సమయం కేటాయించలేకపోతున్నారు…
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…