కేటీఆర్, హరీష్ రావు చెరో పక్క దూకుడును ప్రదర్శించినా ప్రయోజనం కనిపించలేదు. రేవంత్ రెడ్డి మాస్టర్ క్లాస్ ముందు వాళ్లిదరి ఆవేశ పూరిత ప్రకటనలు పనిచేయడం లేదు. దానితో ఇక లాభం లేదని కేసీఆర్ డిసైడయ్యారు. స్వయంగా రంగంలోకి దిగి పాత ఫార్మ్ ని ప్రదర్శించాలని, శత్రు సైన్యాలను చీల్చిచెండాడాలని తీర్మానించారు. త్వరలోనే కేసీఆర్ విశ్వరూపం చూపిస్తారని పార్టీ వర్గాలు అంటున్నాయి. మరి ఆ పని అంత సులభమా. రేవంత్ రెడ్డి నోరు మూయించడం అంత ఈజీనా….
సీఎం పదవిని చేపట్టినప్పటి నుంచి రేవంత్ రెడ్డి యమ స్పీడులో ఉన్నారు. బీఆర్ఎస్ ను చీల్చిచెండాడుతున్నారు. మేడగడ్డపై సిట్టింగ్ జడ్జి విచారణ, ధరణి పోర్టల్ సంగతి తేల్చడం లాంటి అంశాల్లో తనదైన వేగాన్ని ప్రదర్శిస్తున్నారు. ప్రభుత్వాన్ని విమర్శించేందుకు ప్రయత్నించిన ప్రతీ బీఆర్ఎస్ నేతకు గట్టి సమాధానం చెబుతున్నారు. దానితో గులాబీ పార్టీ నేతల ప్రకటనలు వెలవెలబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఇక ఉపేక్షించి లాభం లేదని నిర్ణయించుకున్న బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగబోతున్నారు. తుంటి ఎముక శస్త్రచికిత్సతో విశ్రాంతి తీసుకుంటూ కాస్త నిదానించిన కేసీఆర్.. ఇప్పుడు మళ్లీ ప్రజల్లోకి రాబోతున్నారు. నల్లగొండ జిల్లాలో కేసీఆర్ భారీ బహిరంగ సభ ఉంటుందని బీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి. ఫిబ్రవరి మూడో వారం నాటికి కేసీఆర్ పూర్తిగా కోలుకుంటారని అప్పుడే నల్లగొండ బహిరంగ సభ ఉంటుందని చెబుతున్నారు. ఈ సభకు రెండు లక్షల మందిని సమీకరిస్తారని కూడా తెలుస్తోంది. పోగొట్టుకున్న చోట వెదుక్కోవాలన్న పాత సామెతను నేతలు గుర్తుచేస్తున్నారు. బీఆర్ఎస్ ను బాగా దెబ్బకొట్టిన జిల్లాల్లో నల్లగొండ కూడా ఒకటి. అక్కడే మళ్లీ పాతుకుపోవాలని పార్టీ వ్యూహరచన చేస్తోంది.మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు అమిత్ రెడ్డి నల్గొండ నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు. ఆయన్ను జనానికి పరిచయం చేసి, తన పూర్తి మద్దతు అమిత్ రెడ్డికి ఉందని చెప్పేందుకు కూడా కేసీఆర్ నల్లగొండలో మీటింగ్ పెడుతున్నారని చెబుతున్నారు. లోక్ సభ ఎన్నికలకు కేసీఆర్ పూరించే శంఖారావం కూడా నల్లగొండ నుంచే ప్రారంభమవుతుందని భావిస్తున్నారు…
కృష్ణా జలాలు, కేఆర్ఎంబీ వ్యవహారంపై కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయాలని బీఆర్ఎస్ డిసైడైంది. పైగా నీటిపారుదల రంగంపై పూర్తి అవగాహన ఉన్న కేసీఆర్ ప్రభుత్వాన్ని ఒక ఆటాడుకుంటారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. అయితే రేవంత్ ఏమైనా తక్కువ తిన్నారా…ఆయన కూడా అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకునే ఉన్నారు. ఇప్పుటికే కొంత రుచిచూపించారు.
నిజానికి కేఆర్ఎంబీకి రాష్ట్ర ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వం అప్పగించిందనే వార్తలతో ఒక్కసారిగా రాజకీయ హీట్ స్టార్ట్ అయింది. బీఆర్ఎస్ అందివచ్చిన అవకాశాన్ని చేజార్చుకోవద్దని నిర్ణయించుకుని విమర్శలకు పదును పెట్టింది. కృష్ణాబోర్డుకు శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టులను అప్పగిస్తే రాష్ట్రం హక్కులను కోల్పోతుందని మాజీ సీఎం కేసీఆర్ స్వయంగా గుర్తుచేశారు. దీనిపై ఉద్యమ కార్యాచరణను ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రాజెక్టులను అప్పగించేందుకు ఒప్పుకోలేదని, బలవంతంగా గెజిట్ అమలుచేయడానికి యత్నిస్తే కృష్ణాజలాల్లో 50 శాతం వాటా కోసం పట్టుబట్టామని ఆయన చెప్పుకొచ్చారు. . నీటి పంపకాలపై అపెక్స్ కౌన్సిల్‌లో తేల్చాలని కేఆర్ఎంబీ సమావేశంలో నిర్ణయించారని బీఆర్ఎస్ అంటోంది. ఆ తర్వాత అపెక్స్కౌన్సిల్సమావేశమే కాలేదని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీశైలం, నాగార్జునసాగర్ప్రాజెక్టుల్లోని 10 ఔట్లెట్లను కేఆర్ఎంబీకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకుందని మండిపడుతోంది. కాగా రాష్ట్ర పునర్విభజన చట్టం చేసినప్పుడే కృష్ణా, గోదావరి జలాల పంపిణీని కేంద్రానికి అప్పగిస్తున్నట్లు కేసీఆర్ ఒప్పుకున్నారని కాంగ్రెస్ ఎదురుదాడి చేస్తోంది. కేసీఆర్ ఎంపీగా ఉన్నప్పుడే ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించడానికి పునాదిపడిందని మండిపడుతోంది. 2015లో జరిగిన కేఆర్ఎంబీ సమావేశంలో తెలంగాణకు 299, ఏపీకి 511 టీఎంసీలు కేటాయించేందుకు కేసీఆర్, హరీశ్ రావు సంతకాలు చేశారని, 50 శాతం వాటా అడగకుండా అన్యాయం చేశారని ధ్వజమెత్తుతోంది. 2022లో కేఆర్ఎంబీకి 15 ప్రాజెక్టులను అప్పగిస్తున్నామని సమావేశంలో కేసీఆర్ అంగీకరించారని, ఇప్పుడు డ్రామా చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు.
పుండు మీద కారం చల్లినట్లుగా సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు కేసీఆర్, జగన్ రెడ్డి ఇద్దరినీ కలిపి తిడుతున్నారు. కేసీఆర్ తన స్వప్రయోజనాల కోసం నదీజలాల హక్కులను జగన్ కు అప్పగించారని అంటున్నారు. పోతిరెడ్డి పాడు, రాయలసీమ ప్రాజెక్టులకు నీటి తరలింపునకు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఆరోపిస్తున్నారు. కృష్ణ, గోదావరి రెండు నదులపై హక్కులు పోగొట్టుకునే పరిస్థితిలో తెలంగాణ ఉందంటే అదీ కేసీఆర్ చేసిన మోసమేనన్న రేవంత్ రెడ్డి ఆరోపణ. వీటన్నింటికీ ఇప్పుడు సమాధానం చెప్పబోతున్నారని దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు ద్రోహం చేసిన తీరును వివరించబోతున్నారని బీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి. చూడాలి మరి ఏమవుతుందో..
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…