మాకు 400.. కాంగ్రెస్ కి 40 అంటోన్న మోదీ

By KTV Telugu On 9 February, 2024
image

KTV TELUGU :-

రానున్న  సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో భార‌తీయ జ‌న‌తాపార్టీ  హ్యాట్రిక్ విజ‌యం సాధించి తీరుతుంద‌ని ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ధీమా వ్య‌క్తం చేశారు. త‌మ విజ‌యాన్ని ఎవ‌రూ ఆప‌లేర‌ని ఆయ‌న   న‌మ్మ‌కంగా ఉన్నారు. పార్ల‌మెంటు సాక్షిగా న‌రేంద్ర మోదీ   ప్ర‌సంగిస్తూ కాంగ్రెస్ పార్టీ ప‌ని అయిపోయింద‌న్నారు. మాకు 400 స్థానాలు క‌చ్చితంగా వ‌స్తాయ‌న్న మోదీ కాంగ్రెస్ కు 40 స్థానాలు కూడా క‌ష్ట‌మ‌న్నారు. అయితే వారికి క‌నీసం 40 స్థానాలు రావాల‌ని తాను ఆకాంక్షిస్తున్నా అన్నారు మోదీ.

పార్ల‌మెంటు స‌మావేశాల సంద‌ర్భంగా  ప్ర‌సంగించిన న‌రేంద్ర మోదీ చాలా హుషారుగానూ ధీమాగానూ క‌నిపించారు. వంద‌రోజుల్లోపు జ‌ర‌గ‌నున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లోనూ గెలిచి కేంద్రంలో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తామ‌ని ఆయ‌న  ఆత్మ‌విశ్వాసం వ్య‌క్తం చేశారు.  కొద్ది నెల‌ల క్రితం కొంత టెన్ష‌న్ తో క‌నిపించిన మోదీ ఇపుడు పూర్తి గా ధీమాతో ఉన్నారు. తాను వ‌రుస‌గా మూడో సారి ప్ర‌ధాని కావ‌డం ఖాయ‌మ‌ని ఆయ‌న భావిస్తున్నారు. వ‌రుస‌గా మూడు సార్లు ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీకి షాకివ్వాల‌ని ఆయ‌న పంతంగా ఉన్నారు.

న‌రేంద్ర మోదీ ఇంత ధీమా వ్య‌క్తం చేయ‌డానికి  బ‌ల‌మైన కార‌ణం  అయోధ్యే.  ద‌శాబ్ధాల క్రితం భార‌తీయ జ‌న‌తా పార్టీ ఇచ్చిన రామ మందిర నిర్మాణ హామీని న‌రేంద్ర  మోదీ హ‌యాంలో  బిజెపి నిల‌బెట్టుకోగ‌లిగింది. రామ మందిరంలో బాల‌రాముని విగ్ర‌హ  ప్రాణ ప్ర‌తిష్ఠ చేసిన న‌రేంద్ర మోదీ  రామ మందిర నిర్మాణాన్ని అతి పెద్ద విజ‌యంగా ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లేలా పార్టీ శ్రేణుల‌ను స‌మాయ‌త్తం చేశారు.

ప్రాణ ప్ర‌తిష్ఠ‌కు కొద్ది రోజుల ముందు నుంచే ఇంటింటికీ తిరిగి రామ‌మందిర ఆరంభోత్స‌వం గురించి తెలియ జేసి అక్షింత‌లు ఇచ్చే కార్య‌క్ర‌మాన్ని సంఘ్ ప‌రివార్  భుజాల‌కెత్తుకుంది. అది బాగా వ‌ర్క‌వుట్ అయ్యింది.

దేశ వ్యాప్తంగా హిందువులంతా రామ‌మందిరం మానియాలో ప‌డిపోయేలా  రామమందిర  ప్రారంభోత్స‌వాన్ని ఓ పెద్ద ఈవెంట్ గా మార్చేసింది బిజెపి. దానికి ప్ర‌జ‌ల‌నుండి కూడా విశేష స్పంద‌న ల‌భించింది. ఒక విధంగా హిందువుల్లో  ప్ర‌తీ చోట రామ‌మందిరం గురించే చ‌ర్చ జ‌రిగేలా చేయ‌డంలో బిజెపి విజ‌య‌వంత‌మైంది. ఎన్నిక‌ల ముందు   ఈ ల‌క్ష్యాన్ని నెర‌వేర్చుకోవ‌డంతో  ఎన్నిక‌ల్లో త‌మ‌కి తిరుగుండ‌ద‌ని మోదీ భావిస్తుండ‌చ్చంటున్నారు  విశ్లేష‌కులు. ఇక రాముడే  ఎన్నిక‌ల్లో త‌న భ‌క్తుల‌ను పోలింగ్ బూత్ ల‌కు పంపించి బిజెపిని గెలిపిస్తాడ‌ని బిజెపి నాయ‌క‌త్వం చాలా ధీమాగా ఉంది.

అయోధ్య విజ‌యం త‌మ‌కు అడ్వాంటేజ్ గా మార‌గా..  కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూట‌మి కుదేలు కావ‌డం  బిజెపికి    తెగ సంతోషాన్నిచ్చేస్తోంది. కూట‌మిలో ప్ర‌ధాన ప‌క్ష‌మైన  మ‌మ‌తా బెన‌ర్జీ పార్టీ కాంగ్రెస్ ను చీటికీ మాటికీ ఏకి పారేస్తున్నారు. కూట‌మికి క‌న్వీన‌ర్ గా ఉంటార‌నుకున్న  బిహార్ సిఎం నితిష్ కుమార్ ఏకంగా  మ‌రోసారి బిజెపి వైపు దూకి ముఖ్య‌మంత్రిగా కొన‌సాగుతున్నారు. నితిష్ ఇండియా కూట‌మికి అంత్యం క్రియ‌లు పెట్టేశార‌ని  కొంద‌రు కాంగ్రెస్ నేత‌లు   వ్యాఖ్యానించ‌డం విశేషం. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ కూడా పంజాబ్ లో  ఒంట‌రి పోటీకి సై అన‌డంతో కాంగ్రెస్ పార్టీకి క‌ష్టాలు త‌ప్ప‌వ‌ని తేలిపోయింది.

కాంగ్రెస్ ను క‌ష్టాలు ..స‌మ‌స్య‌లు త‌రుముతుంటే.. బిజెపికి ప్ర‌తీదీ క‌లిసొస్తోంది. కాంగ్రెస్ విశ్వ ప్ర‌య‌త్నాలు చేస్తోన్నా అనుకున్న ప‌నులు కావ‌డం లేదు. బిజెపి పెద్ద‌గా ప్ర‌య‌త్నం చేయ‌క‌పోయినా అయాచితంగా అన్నీ క‌లిసొస్తున్నాయి.. మ‌మ‌తా , నితిష్ కుమార్ ల బాట‌లో మ‌హారాష్ట్ర మాజీ సిఎం శ‌ర‌ద్ ప‌వార్  పార్టీ కూడా  తిరుగుబాటు నేత‌ల ప‌రం కావ‌డంతో  ఇండియా కూట‌మికి అన్ని ద్వారాలూ మూసుకుపోతున్నాయ‌ని చెప్ప‌చ్చంటున్నారు రాజ‌కీయ పండితులు. మ‌రి ఎన్నిక‌ల్లో ఈ ప‌రిణామాలు దేనికి దారి తీస్తాయో చూడాల్సిందే…

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి