ఆధునిక భారత ఆర్థిక వ్యవస్థ రూపశిల్పి, దేశం పురోగమించడానికి బాటలు వేసిన పీవీ నరసింహారావుకు కేంద్రం భారత రత్న ప్రకటించింది. ఈ ప్రకటనలో రాజకీయం ఉందా లేదా అన్న సంగతి పెడితే.. భారతరత్నకు వంద శాతం అర్హుడు పీవీ నరసింహారావు. ఆయన క్లిష్టమైన పరిస్థితుల్లో ప్రధానమంత్రి పదవి చేపట్టకపోతే ఈ రోజు దేశం ఎలాంటి పరిస్థితుల్లో ఉండేదో అంచనా వేయడం కష్టం. పాకిస్థాన్, శ్రీలంకల తరహాలోనే సంక్షోభంలో కూరుకుపోయి ఉండేది.
ప్రధాని పదవిని అలంకరించిన తొలి దక్షిణ భారతీయులు, ఒకే ఒక తెలుగువారు పీవీ నరసింహా రావు. 1991 నుండి 1995 వరకు ఆన ప్రధానిగా ఉన్నారు. బహుభాషావేత్త, రచయిత. భారత ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మక సంస్కరణలకు బీజంవేసిన అపర చాణక్యులు. కుంటుతున్న భారత ఆర్థిక వ్యవస్థను సరళీకరణ విధానాల ద్వారా పట్టాలెక్కించిన వారు. నాడు తగిన సంఖ్యాబలం లేకపోయినప్పటికీ మైనార్టీ ప్రభుత్వాన్ని పూర్తి కాలం నడిపంచారు. మన్మోహన్ సింగ్ సహకారంతో తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణల దేశం ముందుకు సాగేందుకు ఉపయోగపడ్డాయి.
రాజీవ్ గాంధీ హత్య అనంతరం కాంగ్రెస్ పార్టీకి నాయకుడు లేకుండా పోవడంతో పీవీ నర్సింహా రావు ఆమోదయోగ్యుడిగా కనిపించారు. అప్పటికి ఆయన దాదాపు రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ, నంద్యాల నుండి గంగుల ప్రతాప్ రెడ్డితో రాజీనామా చేయించి, లోకసభకు పంపించారు. తెలుగువాడు కావడంతో ఎన్టీఆర్ నాడు టీడీపీ తరఫున పోటీ పెట్టలేదు. 1990 చివరి నాటికి భారత ఆర్థికపరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ద్రవ్యోల్భణం ఆకాశాన్ని అంటింది. చమురు ఖరీదుగా మారింది. దిగుమతికి తగినంత విదేశీ మారకద్రవ్యం లేదు. చేతిలోని విదేశీ మారకద్రవ్యపు నిల్వలు మూడు వారాలకే సరిపోతాయి. 1991 జనవరి నాటికి ప్రభుత్వం దివాళా తీసే పరిస్థితి. రుపాయి విలువ పడిపోయింది.
ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పీవీకి ఆర్థిక పరిస్థితి అర్థమయింది. వెంటనే 67 టన్నుల బంగారాన్ని విమానాంలో ఇంగ్లాండ్‌కు పంపి ఐఎంఎఫ్ వద్ద కుదువపెట్టి 2.2 బిలియన్ డాలర్ల రుణం తెచ్చి దేశాన్ని నడపడం ప్రారంభించారు. మన్మోహన్ సింగ్‌ను ఆర్థికంగా నియమించుకుని సంస్కరణలు లోపాలు లేకుండా అమలు చేసేందుకు ప్రయత్నించారు. దేశాన్ని ఆర్థిక కష్టాల నుండి గట్టెక్కించేందుకు స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోవడానికి అధికారులకు అవకాశం కల్పించారు. చెల్లింపుల సంక్షోభం నుండి గట్టెక్కించేందుకు రూపాయి విలువ తగ్గించారు. సంస్కరణల వల్ల ద్రవ్యోల్భణం తగ్గి, ఎగుమతులు పెరగడానికి అవకాశం ఏర్పడింది. పన్ను సంస్కరణలు తెచ్చారు. ఇవి ఆదాయం పెరిగి, ఖర్చులు తగ్గేందుకు దోహదపడ్డాయి.
1991లో నూతన పారిశ్రామిక విధానం తెచ్చారు. లైసెన్స్ రాజ్‌కు చెల్లుచీటీ పాడారు. ఎనిమిది రంగాలు మినహా మిగతా అన్ని రంగాల్లో ప్రయివేటు అడుగు పెట్టేందుకు అవకాశం కల్పించారు. విదేశీ పెట్టుబడులకు అనుమతి, కొన్నింట 100 శాతం వరకు అనుమతించారు. పీవీ సంస్కరణలతో కరెంట్ ఖాతా లోటు తగ్గుముఖం పట్టింది. ద్రవ్యోల్భణం అదుపులోకి వచ్చింది. ప్రయివేటు పెట్టుబడులు, విదేశీ పెట్టుబడులు పెరిగింది. ఆ పునాదుల కారణంగా ఈ మూడు దశాబ్దాల్లో విదేశీ మారకపు నిల్వలు 500 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. పీవీ అమలు చేసిన సంస్కరణలే నేడు.. దేశానికి వెన్నుముకగా నిలిచాయి. అందుకే అవార్డు ఇవ్వక ముందు కూడా ఆయన భారతరత్నమే. ఇప్పుడు అధికారికంగా భారత రత్న.
నిజానికి ఆయన రాజకీయాల నుంచి విరమించుకోవాలనుకున్నారు. 1990లో నరసింహారావుకు రాజ్యసభ సీటు ఇవ్వడానికి అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ నిరాకరించారు. లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయాలన్నారు. ఈ నిర్ణయం గురించి తెలిసి పీవీ చాలా బాధపడ్డారు. వెంటనే రాజకీయాల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నారు. సైలెంట్ గా తిరిగి హైదరాబాద్ కు వెళ్లేందుకు కు రెడీ అయ్యారు. ఓ దశలో ఆయన సన్యాసం పుచ్చుకుని కుర్తాళం పీఠాధిపతిగా బాధ్యతలు తీసుకోవాలనుకున్నారు. తాను ఎన్నికల్లో పోటీ చేయనని పీవీ నర్సింహారావు స్వయంగా రాజీవ్ గాంధీకి చెప్పారు. తన లోక్‌సభ స్థానాన్ని వేరొకరికి ఇవ్వాలని అభ్యర్థించారు. ఆ ఎన్నికలలో పోటీ చేయలేదు. కానీ రాజీవ్ గాంధీ హత్య జరగడంతో ఆయన ప్రధాని కావాల్సి వచ్చింది. తర్వాత నంద్యాల నుంచి గెలిచారు. తర్వాత అంతా ఓ చరిత్ర…
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…