బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ సారి కఠినంగా ఉండాలనుకున్నారు.మొహమాటాలకు పోకుండా కొత్తవారికి అవకాశం ఇవ్వాలనుకుంటున్నారు. లేని పక్షంలో అసెంబ్లీ ఎన్నికల తరహాలో మరోసారి పరాభవం తప్పదన్న నిర్ణయానికి ఆయన వచ్చారు.ఆ దిశగా ఆయన గుంభనంగా పావులు కదుపుతున్నప్పటికీ.. పార్టీ వర్గాల నుంచి కొన్ని లీకులయితే తప్పడం లేదు…
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరిని పోటీకి దింపాలని విషయంలో కేసీయార్ గట్టి నిర్ణయం తీసుకున్నారు. వీలున్నంతలో సిట్టింగ్ ఎంపీలకు మళ్ళీ టికెట్లు ఇవ్వకూడదని ఆయన భావిస్తున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన చేదు అనుభవాన్ని దృష్టిలో పెట్టుకునే పార్లమెంటు ఎన్నికలకు కేసీయార్ జాగ్రత్తపడుతున్నట్లున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో చాలాచోట్ల సిట్టింగులకు టికెట్లు ఇవ్వద్దని ఎంతమంది విన్నవించుకున్నా కేసీఆర్ వినలేదు. మూడు నెలలకు ముందే సిట్టింగులు అందరికీ టికెట్లను కేసీయార్ ప్రకటించేశారు.వివిధ కారణాలతో చివరి నిముషంలో 12 చోట్ల సిట్టింగులను కాదని కొత్తవారికి టికెట్లిచ్చారు. ముందుగా టికెట్లు ప్రకటించిన సిట్టింగుల్లో చాలామంది ఓడిపోయారు. చివరినిముషంలో కొత్తవారికి టికెట్లిచ్చిన నియోజకవర్గాల్లో పార్టీ 10 చోట్ల పార్టీ గెలిచింది. దీంతోనే సిట్టింగ్ ఎంఎల్ఏలకు మళ్ళీ టికెట్లివ్వటం ఎంతపెద్ద తప్పో కేసీయార్ కు అర్ధమైంది.
ఎమ్మెల్యేల మీద ఆగ్రహంతో జనాలు చాలాచోట్ల కాంగ్రెస్ అభ్యర్ధులను గెలిపించటంతో బీఆర్ఎస్ ఓడిపోయింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రిపీట్ కాకూడదంటే పార్లమెంటు ఎన్నికల్లో జాగ్రత్త పడాలని అర్ధమైనట్లుంది. పార్టీ ఓడిపోయిన చోట్ల ఎలాగూ కొత్తవారికి అవకాశం ఇవ్వాల్సింది. గెలిచిన నియోజకవర్గాల్లో ఆరేడు చోట్ల సిట్టింగులకు మొండి చేయి చూపించాలని కేసీఆర్ డిసైడైనట్లుగా చెబుతున్నారు..
2019 లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున తొమ్మిది మంది ఎంపీలుగా గెలిచారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాక ఎంఎల్ఏగా గెలిచిన కొత్తా ప్రభాకరరెడ్డి మెదక్ ఎంపీగా రాజీనామా చేశారు. అలాగే కాంగ్రెస్ లో చేరిన కారణంగా పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత రాజీనామా చేశారు.ప్రస్తుతానికి బీఆర్ఎస్ కు ఎనిమిది మంది ఎంపీలున్నారు. వెంకటేష్ రాజీనామా ఆమోదిస్తే బలం ఏడుకు తగ్గుతుంది. పార్టీవర్గాల సమాచారం ప్రకారమైతే మొత్తం 17 నియోజకవర్గాల్లో కొత్త వారిని రంగంలోకి దింపాలని కేసీయార్ ఆలోచిస్తున్నారట. దీనివల్ల పార్టీకి ఫ్రెష్ లుక్ రావటంతో పాటు జనాలు కూడా హ్యాపీగా ఫీలవుతారని, అప్పుడు పార్టీపై వ్యతిరేకత తగ్గుతుందని అనుకుంటున్నారు. ఎంఎల్ఏలు, ఎంఎల్సీలను ఎంపీలుగా పోటీలోకి దింపే ఆలోచన కూడా లేదని నిర్థారణ అయ్యింది. తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం కేసీఆర్ ఒక సర్వే చేయించారు. సిట్టింగులకు గెలిచే అవకాశాలు లేవని అందులో తేలింది. దానితో సిట్టింగు ఎంపీలందరినీ మార్చివేస్తే తప్ప విజయావకాశాలు లేవు. ఇప్పటికే కొత్తవారి కోసం అన్వేషణ చివరి దశకు చేరుకున్నట్లు చెబుతున్నారు. ఎనిమిది నుంచి తొమ్మిది నియోజకవర్గాల్లో షార్ట్ లిస్టింగ్ కూడా పూర్తయ్యిందంటున్నారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు గుత్తా అమిత్ రెడ్డికి నల్గొండ టికెట్ ఖాయమైంది. ఉమ్మడి నల్లొండ జిల్లాలో కోమటిరెడ్డి సోదరులను దెబ్బకొట్టాలంటే గుత్తా కుటుంబంతోనే సాధ్యమని కేసీఆర్ నిర్ణయానికి వచ్చారు. అలాగే బీసీ సామాజిక వర్గాలకు ఎక్కువ సీట్లు ఇచ్చే ప్రతిపాదన కూడా కేసీఆర్ మదిలో ఉందని చెబుతున్నారు.
వ్యూహం మార్చకపోతే పుట్టగతులుండవని కేసీఆర్ కు ఆలస్యంగానైనా అర్థమైంది. లోక్ సభ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు దక్కించుకోకపోతే కేడర్ మరింత నీరసించిపోతుందని ఆయన గుర్తించారు. అందుకే కొత్త వ్యూహాలను అమలు చేస్తున్నారు. అన్నింటికీ సర్వేలే అంతరాత్మ అన్నట్లుగా కూడా ఆయన ఆలోచిస్తున్నారు. మరి లోక్ సభ ఎన్నికల్లో సక్సెస్ అవుతారో లేదో చూడాలి…
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…