ఎన్నికల వేళ అంతా అనుకూలంగా ఉండాల్సిందీ ప్రతికూలంగా మారుతున్న అనుమానాలు కలుగుతున్నాయ. జనసేనకు కాలం కలిసొస్తున్నట్లు కనిపించడం లేదు. మూడు పార్టీలు కలుస్తున్నాయని సంతోషించాలా లేక ఎదురుదెబ్బలు తట్టుకోవడమెలాగని బాధపడాలో జనసేనానికి అర్థం కావడం లేదు.
పవన్ కల్యాణ్ జనసేన ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగింది వేరు. ఇప్పుడు జరుగుతున్నది వేరని చెప్పాలి. గత ఎన్నికల్లో ఘోరపరాజయం పాలైన జనసేనకు ఈ సారి జీవన్మరణ సమస్యగా మారింది. ఈ సారి కనీస స్థానాలు రాకపోతే పార్టీ శంకరగిరి మాన్యాలు పట్టుకుపోయే దుస్థితి దాపురించిందని విశ్లేషణలు వినిపిస్తున్న నేపథ్యంలోనే జనసేనాని పవన్ కల్యాణ్ సవాలక్ష సమస్యలను ఎదుర్కొంటున్నారు.పై నుంచి కింది దాకా అన్నీ ప్రతీకూలాంశాలే కనిపిస్తున్నాయి. పొత్తు చర్చలకు చంద్రబాబును ఢిల్లీ పిలిపించుకున్న బీజేపీ అధిష్టానం ఇంతవరకు పవన్ కల్యాణ్ కు ఎటువంటి వర్తమానమూ పంపలేదు. ఇంతకాలం తాను బీజేపీ కోసం కష్టపడితే ఇప్పుడు తన ప్రమేయం లేకుండా చంద్రబాబుతో డైరెక్టుగా మాట్లాడుకుంటున్నారని పవన్ లోలోన మథనపడిపోతున్నారు. చంద్రబాబు కూడా సీట్ల సర్దుబాటును, జనసేన పోటీ చేసే స్థానాలను ప్రకటించకుండా నాన్చి నాన్చి.. మరింత టెన్షన్ పెడుతున్నారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చే వరకు చర్చలే గానీ, ప్రకటనలు ఏమీ ఉండకపోవచ్చన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి. అసెంబ్లీ, లోక్ సభ కలిపి 85 నియోజకవర్గాల్లో అధికారికంగా అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ దూసుకుపోతుంటే, తమ కేడర్ దిక్కుతోచక నిల్చుందని జనసేనాని ..పార్టీ అంతరంగికుల వద్ద చెబుతున్నారు.
ఉత్తరాంధ్రపై జనసేన ఎక్కువ ఆశలు పెట్టుకుంది. ఉత్తరాంధ్రకు ఆయువు పట్టుగా మారిన విశాఖలో పార్టీ ఇప్పుడు నాయకత్వ లోపాన్ని ఎదుర్కొంటోంది. ప్రాంతీయ సమస్యలపై కేంద్రం నుంచి స్పష్టత రాకపోవడం, జనసేన కేడర్ కు దిశానిర్దేశం లోపించడం ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. వలస వచ్చిన నేతలను పవన్ ప్రోత్సహిస్తున్నారన్న ఆగ్రహం అక్కడి కేడర్లో కనిపిస్తోంది…
ఉత్తరాంధ్ర ఈ సారి తమకు కలిసొచ్చే ప్రాంతమని ఇంతకాలం జనసేన లెక్కలేసుకుంటూ వచ్చింది. అక్కడి సామాజికవర్గం సమీకరణాలు తమకు అనుకూలంగా మారతాయని, ఉత్తరాంధ్ర బీసీలు ఈ దఫా… టీడీపీ-జనసేన కూటమికి ఓటేస్తారని ఎదురు చూస్తూ వచ్చింది. ఉభయ గోదావరి జిల్లాల తర్వాత తమకు పట్టున్న ప్రాంతం ఉత్తరాంధ్రేనని అంచనా వేసుకున్న జనసేన అక్కడ కనీసం 10 అసెంబ్లీ నియోజవర్గాల్లో గెలవాలని భావిస్తూ వచ్చింది. పార్టీ పటిష్టంగా ఉందని కూడా లెక్కలేసుకుంటుండగా అంత సీన్ లేదని తాజా పరిణామాలు చెబుతున్నాయి.పొత్తులు, ఇటీవలి పరిణామాలపై పార్టీ నేతల్లో నైరాశ్యం పెరిగిపోతోంది. ఎవరికి టికెట్లు వస్తాయి. ఎవరికి రావు అన్నది ఇంకా తేలలేదు. పైగా వైసీపీ నుంచి వచ్చే వారికి జనసేన తలుపులు బార్లా తెరిచి ఉంచడంతో వాళ్లు పరిగెత్తుకుంటూ వచ్చి చేరుతున్నారు. టీడీపీలో చేరాలనుకుంటున్న వైసీపీ రెబెల్స్ ను సైతం వ్యూహాత్మకంగా జనసేన వైపుకు రీడైరెక్ట్ చేసే అవకాశం ఉన్న వార్తల నడుమ జనసైనికులు టెన్షన్ పడిపోతున్నారు. ఇప్పుడు విశాఖ లాంటి మహానగరంలో పార్టీకి దిక్కులేని పరిస్తితి దాపురించింది. ఇంతకాలం పార్టీకి పెద్దదిక్కుగా ఉంటున్న ఒక నాయకుడు పక్కకు తప్పుకునేందుకు రెడీ అవుతున్నారు. నెలకు యాభై వేలు ఖర్చుపెట్టి పార్టీ కార్యాలయాన్ని నిర్వహించిన ఆయన ఇప్పుడు దాన్ని ఖాళీ చేసి చేతులు దలుపుకున్నారు..వైసీపీ ఎమ్మెల్సీ చెన్నుబోయిన వంశీకృష్ణ యాదవ్ ను పవన్ స్వయంగా పార్టీలో చేర్చుకోవడం ఉత్తరాంధ్ర నేతలకు ఏ మాత్రం నచ్చలేదు. ఇంతకాలం జనసేనను చిన్నచూపు చూసిన నేతలను పిలిపించుకోవాల్సిన అవసరం ఏమిటని వాళ్లు ప్రశ్నిస్తున్నారు. పైగా ఉత్తరాంధ్రకు చెందిన కొందరు మేథావులు కూడా క్రమంగా పార్టీకి దూరమవుతున్నారు.
అధికార వైసీపీ ఇప్పుడు బీసీ మంత్రం పఠిస్తోంది. బీసీలకు ఎక్కువ టికెట్లు కేటాయించే పనిలో ఉంది. దానితో ఉత్తరాంధ్ర బీసీలు తమకు అండగా ఉంటారని ఇంతకాలం భావిస్తూ వచ్చిన జనసేన ఇప్పుడు డిఫెన్స్ లో పడిపోయింది. బీసీలకు తాము ఎక్కువ సీట్లు ఇవ్వగమో లేదో తెలియని పరిస్థితుల్లో ఆ పార్టీకి కష్టకాలం మొదలైందనే చెప్పాలి. టీడీపీ కేటాయించే స్థానాలను బట్టి ఉత్తరాంధ్రలో బీసీలకు టికెట్లు కేటాయించే అవకాశం ఉండగా, ఆ పని ఇంతవరకు పూర్తి కావడం లేదు. మరి ఇప్పుడేం చేయాలో జనసేనానికే తెలియాలి…
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…