అందరివాడా..!? అసలు లేడా..!?

By KTV Telugu On 13 February, 2024
image

KTV TELUGU :-

వైసీపీ  రెబెల్ స్టార్ రఘురామ కృష్ణరాజు వర్తమానం ఏమిటి.రాజకీయ భవిష్యత్తు ఏమిటి. ఆయన ఏ పార్టీలో చేరబోతున్నారు. మూడు పార్టీల నేతలతోనూ మంచి సంబంధాలున్న రఘురామ ఇంకా ఏ పార్టీలో ఎందుకు చేరడం లేదు. ఆయనకున్న పరిమితులు ఏమిటి. భయాలు ఏమిటి…

నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు రోజూ టీవీల్లో కనిపిస్తుంటారు. సొంత పార్టీ వైసీపీకి వ్యతిరేకంగా రచ్చబండ పేరుతో రచ్చ రచ్చ చేస్తారు. సాయంత్రానికి ఏదోక టీవీ  ఛానెల్ లో కూర్చుని జగన్ ప్రభుత్వంపై బక్కెట్ల కొద్దీ బురద ఎత్తి పోస్తుంటారు. 2019లో వైసీపీ ఎంపీగా గెలిచిన ఆరు నెలలకే తిరుగుబాటు చేసిన రఘురామ ఇప్పుడు కూడా అదే స్పీడును కొనసాగిస్తున్నారు. తనను  జైల్లో పడేసి కొట్టిన తర్వాత మరింత ఆగ్రహావేశాలకు లోనై… విమర్శల వాడీ వేడీ పెంచారు. సొంత నియోజకవర్గంలో పర్యటించకుండా జగన్  ప్రభుత్వం ఆయన్ను అడ్డుకున్నప్పటికీ, టీవీ మాధ్యమం ద్వారా నిత్యం జనంలో ఉంటారాయన. నాలుగేళ్ల పోరాటం తర్వాత ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతున్న  వేళ రఘురామ ఏ రాజకీయ వర్గాలతో చెలిమిగా ఉంటున్నారో వాళ్లే ఆయన్ను ఆదుకుంటారా లేదా అన్న ప్రశ్నలు  తలెత్తుతున్నాయి.

రఘురామ టీడీపీకి బాగా దగ్గరయ్యారు. టీడీపీ – జనసేన పొత్తు కదిరిన తర్వాత నరసాపురం ఎవరికి కేటాయిస్తే తాను ఆ  పార్టీలో చేరతానన్నట్లుగా రెండు పార్టీల నేతలతో సఖ్యత కొనసాగించారు.  తాజాగా బీజేపీ కూడా కలిసే అవకాశాలు పెరుగుతున్న నేపథ్యంలో పరిస్థితి యూటర్న్ తీసుకున్నట్లుగా ఉంది. రఘురామ..ఇప్పుడేమిటి అన్న ప్రశ్నలు రాజకీయ వర్గాలను వేధిస్తున్నాయి….

ప్రస్తుతం రఘురామ మూడు పార్టీలకు అనుకూలంగా ఉన్నారు. జాతీయస్థాయిలో బిజెపితో, రాష్ట్రంలో టిడిపి, జనసేనకు అత్యంత సన్నిహితుడిగా మెలుగుతున్నారు. ఆ మూడు పార్టీలను ఒకే తాటి పైకి తేవడానికి రఘురామకృష్ణం రాజు చాలా వరకు ప్రయత్నించారు. ఇప్పుడు ఈ మూడు పార్టీలు కలవడంతో తాను అనుకున్నది సాధించి తీరుతానని రఘురామ భావిస్తున్నారు. కానీ ఆయన ఆశలపై బిజెపి హై కమాండ్ నీళ్లు చల్లినట్లు తెలుస్తోంది. నరసాపురం నుంచి బిజెపి కొత్త అభ్యర్థిని బరిలో దించనున్నట్లు సమాచారం. బీజేపీకి బలమైన నియోజకవర్గాల్లో నరసాపురం ఒకటి ఒకప్పుడు అదే నియోజకవర్గం నుంచి నటుడు, రెబెల్ స్టార్ కృష్ణం రాజు గెలిచి కేంద్ర మంత్రి అయ్యారు. అప్పటి నుంచి ఆ నియోజకవర్గం అంటే కమలం పార్టీకి వీరాభిమానం ఉంది. అందుకే టీడీపీ-జనసేన,బీజేపీ పొత్తులో భాగంగా నరసాపురం ఎంపీ స్థానాన్ని కమలనాథులు డిమాండ్ చేసే అవకాశం ఉంది. మరి రఘురామ బీజేపీలో చేరతారా అంటే అది మిలియన్ డాలర్ ప్రశ్న. జగన్ పై మోదీకి రఘురామ ఫిర్యాదు చేస్తే భుజం నిమిరి పంపారే తప్ప పాజిటివ్ గా చేసిందేమీ లేదు. పైగా రఘురామ  పట్ల ఏపీ బీజేపీ నేతలు సానుకూలంగా లేరని వార్తలు వస్తున్నాయి. బీజేపీ తరపున  పాక వెంకట సత్యనారాయణను బరిలోకి దించే అవకాశం ఉందని పార్టీ వర్గాల టాక్. వైసీపీ తరపున శెట్టి బలిజ బీసీ సామాజిక వర్గానికి చెందిన ఓ మహిళను రంగంలోకి దించుతున్న సందర్భంగా బీజేపీ కూడ గౌడ కులస్థుడైన పాల వెంకట సత్యనారాయణను పోటీ చేయించాలని చూస్తోంది. రఘురామకు  నిరాశ తప్పదా. ఇంత పోరాటం చేసి ఎన్నికల్లో పోటీ నుంచి తప్పించుకోవాల్సి వస్తుందా.. ఇదీ రఘురామకు ఆయనకు మద్దతిచ్చే వారి మదిలో మెదులుతున్న ప్రశ్న. నరసాపురం నియోజకవర్గం కావాలని బీజేపీ అడిగితే చంద్రబాబు వద్దని అనలేరు. ఎందుకంటే టీడీపీకి అక్కడ బలమైన అభ్యర్థి లేరు. మరి ఇప్పుడు ఏం జరుగుతుందో చూడాలి…

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి