బై బై బీఆర్ఎస్…అందరూ అటు వైపే

By KTV Telugu On 14 February, 2024
image

KTV TELUGU :-

ఆ ప్రాంతాన్ని తెలంగాణ ఉద్యమ పురిటిగడ్డగా  పిలుస్తారు. ఇంతకాలం బీఆర్ఎస్ కంచుకోటగా భావిస్తూ వచ్చారు. ఒక్క ఎలక్షన్ తో ఉమ్మడి వరంగల్ జిల్లా రూపురేఖలే మారిపోతున్నాయి. నిన్నటి అధికార పార్టీ ఖాళీ అవుతోంది.  బతిమలాడినా నేతలు, కార్యకర్తలు బీఆర్ఎస్లో ఉండేందుకు ఇష్టపడటం లేదు. హార్డ్ కోర్ బీఆర్ఎస్ ఫ్యాన్స్ సైతం ఇప్పుడు పక్క చూపులు చూస్తున్నారు…

గత పదేళ్లుగా తిరుగులేని ఆధిపత్యం కనబర్చిన పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. బీఆర్ఎస్ పార్టీ అధి నాయకత్వం ఏకపక్ష నిర్ణయం.. పార్టీ శ్రేణులు, కార్యకర్తల మనోభావాలకు విలువనివ్వకపోవడంతో వారు కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నారు. దీంతో  ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ నుంచి ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలు ఒక్కొక్కరిగా బయటకు వెళ్లిపోతున్నారు. సొంత పార్టీపైనే అవిశ్వాస తీర్మానాలు పెడుతున్నారు.  స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గానికి చెందిన మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ సోదరుడి కుమారుడు వరంగల్ 60వ డివిజన్ కార్పొ రేటర్ దాస్యం అభినవ్ భాస్కర్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసేశారు. ఇంతకాలం ఎమ్మెల్యేలే నియోజకవర్గ పార్టీ అధ్యక్షుడి హోదాలో ఉండడంతో వారి  అవినీతి, అక్రమాలతో  పాటు  పార్టీలో ఏకపక్ష నిర్ణయాలపై కార్యకర్తలు గళమెత్తలేకపోయారు. సమస్యలను వారి  దృష్టికి తీసుకుపోయినా ప్రయోజనం కనిపించేది కాదు. ఎమ్మెల్యేల అవినీతి బాగోతం తమ మెడకు చుట్టుకుందని నియోజకవర్గాల్లో ద్వితీయ శ్రేణి నేతలు తీవ్ర అసంతృప్తికి, అసహనానికి లోనవుతుండే వారు.పైగా పార్టీలో వర్గపోరుకు బలయ్యామని ఇంతకాలం ఆవేదన చెందుతూ వచ్చిన వారు ఇప్పుడు స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటూ కొత్త పార్టీలోకి వెళ్లిపోతున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆ హంకారపూరితంగా వ్యవహరించడం, ప్రజా సమస్యలనుప ట్టించుకోకపోవడం, కార్యకర్తలను లెక్కచేయకపోవడంతో దాని ప్రభావం ఇప్పుడు పార్టీపై పడింది. తొలుత వరంగల్ నగరానికి చెందిన పలువురు కార్పొరేటర్లు బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరగా… తర్వాత నర్సంపేట, భూపాలపల్లి, మహబూబాబాద్, జనగామ మున్సిపాలిటీలకు చెందిన కార్పొరేటర్లు బీఆర్ఎస్ ను వీడి హస్తం పార్టీ కండువా కప్పుకున్నారు.

ఓరుగల్లు బీఆర్ఎస్ పార్టీలో ఇప్పుడు కొత్త  రాగం వినిపిస్తోంది. పలువురు మాజీలు కూడా కాంగ్రెస్ వైపుకు చూస్తున్నారు. వారి ఆహ్వానించేందుకు పీసీసీ  కూడా సిద్ధమవుతోంది.

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కొందరు తాజా మాజీ ఎమ్మెల్యేలు  కొందరు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమై మంతనాలు జరుపుతున్నారు. బీఆర్ఎస్ ఇప్పట్లో కోలుకునే అవకాశం  లేదని రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా  బలపడుతోందని గ్రహించిన వారంతా అధికార పార్టీలోకి వెళ్లిపోవాలనే అనుకుంటున్నారు.. ఐదు సంవత్సరాలు ఇంట్లో కూర్చునే బదులు క్రియాశీలంగా ఉండాలంటే కాంగ్రెస్ లో చేరడమే మంచిదన్న ఫీలింగ్ వారికి వచ్చింది. బీఆర్ఎస్‌లో ఏళ్ల తరబడి నుంచి క్రియాశీలంగా పనిచేస్తున్నా.. ప్రయారిటీ లభించని లీడర్లకూ కాంగ్రెస్ గాలం వేస్తోంది. ఇప్పటికే గాంధీభవన్ వేదికగా చేరికల లిస్టు రెడీ అయినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాలు తర్వాత చేరికలు షురూ చేసే చాన్స్ ఉన్నది. కొందరు సీఎం చేతుల మీదుగా కండువా కప్పుకోనుండగా, మరి కొందరు ఆయా జిల్లాల ఇన్​చార్జ్ మంత్రుల సమక్షంలో పార్టీలో చేరనున్నారు.

పార్లమెంటు ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆపార్టీని వీడి కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమౌతున్నారు. కాంగ్రెస్ పార్టీ సైతం వారిని చేర్చుకుని లబ్ధి పొందాలనుకుంటోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మాత్రమే కాకుండా..రాష్ట్రం మొత్తం మీద చేరికలు పెంచితే తాము కోరుకున్న 14 లోక్ సభా స్థానాలు రావడం ఖాయమని టీమ్ రేవంత్ రెడ్డి అంచనా వేసుకుంటోంది…

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి