ఏపీ రాజకీయాల్లో హైదరాబాద్‌ !

By KTV Telugu On 15 February, 2024
image

KTV TELUGU :-

ఏపీ రాజకీయాలు మళ్లీ తెలంగాణకు వస్తున్నాయి. పదేళ్లలో  రెండు ప్రభుత్వాలు ఏర్పడినా రాజధానిని ఖరారు చేసుకోవడం చేతకాక మళ్లీ హైదరాబాద్ మీద పడేందుకు సిద్ధమయ్యారు.  రాజధానిని కట్టుకునే స్థోమత లేదని ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ను కొనసాగించాలని  కోరుతామని వైవీ సుబ్బారెడ్డి ప్రకటించడం సంచలనంగా మారింది.  హైదరాబాద్ జోలికొస్తే సహించేది లేదని బీఆర్ఎస్ స్పందించింది.  ఆస్తులు కాపాడుకోవడానికే కొత్త నాటకమని ఏపీ లో బీజేపీ, టీడీపీ నేతలంటున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో అతి పెద్ద రాజకీయ ఇష్యూగా రాజధాని అంశం ఎన్నికల్లో హాట్ టాపిక్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏపీలో వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక రకాలైన లేనిపపోని సమస్యలను నెత్తి మీదకు తెచ్చుకున్నారు. అలా తెచ్చుకున్న వాటిలో మొట్టమొదటిది మూడు రాజధానుల అంశం. ఎక్కడో సౌతాఫ్రికాలో మూడు రాజధానులు ఉన్నాయని ఏపీలోనూ అమలు చేస్తామని ఏవో రెండు సంస్థలతో నివేదికలు తెప్పించుకుని అప్పటికప్పుడు తీర్మానాలు చేసేశారు. కానీ నాలుగేళ్లు దాటినా ఒక్క అడుగు ముందుకు వేయలేకపోయారు సరి కదా..ఉన్న రాజధాని అమరావతిని దాదాపుగా నిర్వీర్యం చేశారు. ఇప్పుడు ఏపీ రాజధాని ఏదీ  అంటే.. ఏమీ చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారు. అందుకే హైదరాబాద్ అని చెప్పుకుంటే బాగుంటుందని అనుకున్నారేమో కానీ.. ఏపీకి రాజధాని కట్టుకునే స్థోమత లేదు కాబట్టి ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ను కొనసాగించాలని కోరుతామని ఆ పార్టీ ముఖ్య నేతల్లో ఒకరయిన వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. ఇది రెండు రాష్ట్రాల తెలుగు ప్రజల్లో మరింత చర్చనీయాంశం అవుతోంది.

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి ఎందుకు వద్దో ఏపీ ప్రభుత్వం ప్రజలకు చెప్పలేకపోయింది. అమరావతిని శ్శశానం అన్నారు.. అవినీతి అన్నారు.. మరొకటి అన్నారు… అక్కడేమీ లేవు అంతా గ్రాఫిక్సే అన్నారు. అయితే  అమరావతిలోనే ఐదేళ్లుగా  పరిపాలన సాగుతోంది.  అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయం.. మంత్రుల కార్యాలయాలు అన్నీ ఉన్నాయి. ప్రభుత్వం మరే  ముందు 45 వేల కోట్ల రూపాయల విలువైన పనులు రేయింబువళ్లు జరుగుతూ ఉండేవి. పెద్ద పెద్ద హౌసింగ్ ప్రాజెక్టులు దాదాపుగా పూర్తయ్యే స్టేజ్‌కు వచ్చాయి. అన్నింటినీ నిలిపివేశారు. అన్నీ పాడుబడిపోయాయి. అలా వదిలేశారు. కానీ అమరావతి రాజధానిగా ఎందుకు  వద్దో మాత్రం ప్రజలకు క్లారిటీగా  చెప్పలేకపోయారు.  ఇంత చేసి ఇప్పుడు ఉమ్మడి రాజధాని అనడం వివాదాస్పదమవుతోంది.

హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలంటూ వైసీపీ నేతలు చేసిన విమర్శలపై  మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు.  హైదరాబాద్ ను ఏపి రాజధానిగా కొనసాగించాలనే ఆయన డిమాండ్ హాస్యాస్పదమన్నారు.  ఆ వ్యాఖ్యలు విభజన చట్టానికే విరుద్ధమని స్పష్టం చేశారు.  కేసిఆర్ సీఎంగా ఉన్నన్ని రోజులు ఆ నాయకుల నుండి ఈ మాటలు ఎందుకు రాలేదని ప్రశ్నించారు.  ఇప్పుడు మాట్లాడుతున్నారంటే…ఇక్కడి ప్రభుత్వ ఉదాసీన వైఖరితోనేనన్నారు.  ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి వారికి వంత పాడెలా ఉన్నదన్నారు.  కేసిఆర్ తెలంగాణను కంటికి రెప్పలా కాపాడుకున్నాడు…ఎప్పటికీ తెలంగాణ ప్రయోజనాల కోసం రాజీ పడేది లేదన్నారు.  తెలంగాణకు అన్యాయం జరిగితే బిఆర్ఎస్ పార్టీ,కేసిఆర్ చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు.  మీ రాజకీయాల కోసం తెలంగాణ జోలికి రావొద్దని  ఏపీ నేతలను హెచ్చరించారు.

ఈ అంశంపై ఏపీ టీడీపీ, బీజేపీ నేతలు కూడా వైసీపీనే తప్పు పడుతున్నారు.    కేవలం హైదరాబాద్ ఉన్న జగన్ ఆస్తుల ని కాపాడుకోవడం కోసమే  సరికొత్త డ్రామా ప్రారంభించారని వారంటున్నారు.    విభజన సమయంలో పదేళ్ల పాటు హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా నిర్ణయించారు ఈ గడువు ఈ ఏడాది జూన్ తో ముగిసిపోతుంది.  నిజానికి హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అనే సంగతిని చాలా మంది మర్చిపోయారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే.. ఏపీ ప్రభుత్వానికి సెక్రటేరియట్ లో ఉన్న భవనాలను తెలంగాణ సర్కార్ కు అప్పగించారు. దానికి ప్రతిఫలంగా ఎలాంటి భవనాలుతీసుకోలేదు.  లేక్ వ్యూ గెస్ట్ హౌస్  మాత్రమే ప్రస్తుతం ఏపీ అధీనంలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఏ ఒక్క కార్యాలయం కూడా తెలంగాణ నుంచి నడవడం లేదు. చివరికి ఉమ్మడి రాజధాని అయినప్పటికీ కరోనా సమయంలో  పేషంట్లు ఏపీ నుంచి హైదరాబాద్ వస్తూంటే..తెలంగాణ పోలీసులు ఆపారు. అప్పుడు కూడా ప్రభుత్వం పెద్దగా స్పందించలేదు.  వివిధ అంశాల్లో హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అనే విషయాన్ని గుర్తు చేయాల్సి వచ్చినప్పుడల్లా సీఎం జగన్ సర్కార్ మౌనంగానే ఉందన్న అభిప్రాయాలు ఉన్నాయి.

విభజన చట్టం ప్రకారం పదేళ్లే ఉమ్మడి రాజధాని.. ఆ తర్వాత ఆ పేరు కూడా ఉండదు. ఇప్పుడు ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలంటే.. విభజన చట్టంలో మార్పులు చేయాలి. అది సాధ్యం కాదు. ఇంకా విషయం ఏమిటంటే.. తెలంగాణ పార్టీలు.. పాలకులు అసలు అంగీకరించరు. ఉమ్మడి రాజధాని అయినా కాకపోయినా  ప్రజల అవకాశాల్లో ఏ మాత్రం తేడా లేదని.. ఇప్పుడు మళ్లీ ఆ పేరుతో చిచ్చు పెట్టుకోవడం వల్ల తెలంగాణలో వ్యతిరేక ప్రచారం చేసుకోవడం తప్ప ప్రయోజనం ఉండదన్న అంచనాలు ఉన్నాయి. అయితే రాజకీయ పార్టీలు తమకు ఏది మేలో అదే రాజకీయం చేస్తాయి. ఇప్పుడు వైసీపీ కూడా అదే చేస్తోందని అనుకోవచ్చు…

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి