వచ్చే ఆరు నెలలు..!

By KTV Telugu On 16 February, 2024
image

KTV TELUGU :-

తెలంగాణ రాజకీయాలకు వచ్చే ఆరు నెలలు కీలకమా. పొరుగున ఉన్న కర్ణాటక పరిస్థితి కూడా అంతేనా. నల్లగొండ బహిరంగ సభతో కేసీఆర్ యాక్టివ్ అవుతున్న వేళ సీఎం రేవంత్ రెడ్డికి ముచ్చెమటలు పట్టడం ఖాయమా. రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ను గద్దె దించాలని బీజేపీ కంకణం  కట్టుకుని బీఆర్ఎస్ తో చేతులు కలిపితే పరిస్థితి ఏమిటన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది. పైగా ఇప్పుడు  బీఆర్ఎస్ నుంచి వలసలను ఆపుకోవాల్సిన అనివార్యత కేసీఆర్ కు ఉందని  చెప్పక తప్పదు..

ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచి నెలదాటిందో లేదో… బీఆర్ఎస్ నేతలంతా హస్తం పార్టీకి క్యూ కడుతున్నారు. మున్సిపాలిటీల్లో అవిశ్వాస తీర్మానాలతో కౌన్సిలర్లు కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు. కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా పక్క చూపులు చూస్తున్నారు. మెదక్ జిల్లాకు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డితో విడిగా సమావేశమయ్యారు. అదేమంటే నియోజకవర్గం సమస్యలు చర్చించడానికి వెళ్లామని చెప్పుకున్నారు. మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య కూడా బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు.కేటీఆర్ కు ఎంతో సన్నిహితుడిగా మెలిగిన హైదరాబాద్  మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ సైతం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యి సంచలనం సృష్టించారు. ఈ నేపథ్యంలోనే  కేసీఆర్ రంగంలోకి దిగి నల్లగొండ సభ ద్వారా పార్టీ కార్యకర్తల్లో ధైర్యాన్ని నింపేందుకు ప్రయత్నించారు.   ఇది ఒక కోణం మాత్రమే. బొటాబొటీ మెజార్టీ ఉన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకోవడం రెండో కోణం .

తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు కీలక దశలో ఉన్నాయి. అసలు గేమ్ లోక్ సభ ఎన్నికల్లో కనిపిస్తుందని చెప్పుకోవాల్సి ఉంటుంది. తెలంగాణలో మళ్లీ కేసీఆర్ క్రియాశీలమైతే  అప్పుడు పరిస్థితి వేరుగా ఉంటుంది. రేవంత్ రెడ్డి ఎంత అగ్రెసివ్ గా కనిపించినా…లోక్ సభ ఎన్నికలను దృష్టిలో  పెట్టుకుని డిఫెన్స్ ఆడుతున్నారనే చెప్పక తప్పదు…

కేసీఆర్ యాక్టివ్ అవుతున్నారు. అవ్వాలి కూడా. బీఆర్ఎస్ ను కాపాడుకోవాలన్నా, పార్టీని బలోపేతం చేయాలన్నా  కేసీఆర్ యాక్టివ్  గా ఉండాలి. కేసీఆర్  మార్కు రాజకీయాలతోనే బీఆర్ఎస్ ను నిలబెట్టుకోవడం సాధ్యపడుతుంది.  ఈ క్రమంలో మరో రెండు నెలలలోపే  జరిగే లోక్ సభ ఎన్నికలు పార్టీకి పరీక్షా సమయం అవుతున్నాయి. తెలంగాణ రాజకీయాలను కూడా ఆ ఎన్నికలు మలుపు తిప్పే అవకాశం ఉంది.  రాష్ట్రంలో 17 లోక్ సభా స్థానాలండగా.. ఎంఐఎం గెలిచే హైదరాబాద్ వదిలేస్తే.. మిలిగిన 16లో ఎవరికెన్ని వస్తాయన్న చర్చ జరుగుతోంది. తాజా సర్వేల ప్రకారం బీఆర్ఎస్ కు  నాలుగు నుంచి ఆరు స్థానాలు వస్తాయని అంచనా వేస్తున్నారు. కాంగ్రెస్ కు ఆరు  నుంచి ఎనిమిది, బీజేపీకి రెండు నుంచి మూడు స్థానాలు వచ్చే వీలుంది. అయితే లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ  భారీ విజయాన్ని నమోదు చేసుకోలేని పక్షంలో రేవంత్  రెడ్డి నాయకత్వానికి గండి పడే ప్రమాదం ఉందని ఒక టాక్. పార్టీలోనూ, బయట ప్రత్యర్థులు బాగా యాక్టివ్ అయిపోయి ముప్పేట దాడి మొదలు పెడతారు. అందులోనూ మళ్లీ కేంద్రంలో బీజేపీ అధికారానికి వస్తుందని తేలిపోయింది. కాస్త బోటాబొటీ మెజార్టీ ఉన్న ప్రభుత్వాలను అస్థిర పరచడం బీజేపీకి మొదటి నుంచి ఉన్న విద్యే. అందులోనూ రేవంత్ మీద కసితో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రత్యక్షంగానో, పరోక్షంగానో బీజేపీకి  సహకరించే వీలుంటుంది…

దక్షిణాదిన బీజేపీకి ఎక్కువ లోక్ సభా స్థానాలు వచ్చేదీ కర్ణాటకలోనేనని సర్వేలు తేల్చాయి. అక్కడ అధికారం కోల్పోయిన బాధ బీజేపీకి ఉంది. లోక్ సభ ఎన్నికల తర్వాత కర్ణాటకపై ఆ పార్టీ ఫోకస్ పెడుతుందని బహిరంగంగా  చెప్పుకుంటున్నారు. దానితో  పాటు పొరుగున ఉన్న తెలంగాణను కూడా ఒక పట్టుపడితే తప్పేముందని కమలనాథులు ప్రశ్నించుకుంటున్నారు. బీఆర్ఎస్ వేవ్ లెంత్ కూడా అదే కావడంతో శత్రువుకు శత్రువు మన మిత్రుడన్న కాన్సెప్ట్ ఇప్పుడు దక్షిణాది  రాజకీయాల్లో బాగా వినిపిస్తోంది….

బీజేపీ తలచుకంటే కర్ణాటకలో కొందరు ఎమ్మెల్యేలను బయటకు లాగడం కష్టమేమీ కాదు. మహారాష్ట్రలో ఏక్ నాథ్ షిండేను సీఎం చేసినట్లుగా కాంగ్రెస్ లో ఒకరిని బయటకు తెచ్చి.. తమ వైపుకు తిప్పుకోవచ్చు.  అసలే కర్ణాటక కాంగ్రెస్ లో మంత్రి పదవులు రాని వాళ్లు, సీఎం పదవికి గాలం వేసిన  వాళ్లు సిద్దరామయ్య పట్ల తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. డిప్యూటీ సీఎం డీకే  శివకుమార్  నుంచి ఎమ్మెల్యేల వరకు అందరూ ఛాన్స్ వస్తే ఏదోకటి చేసేయ్యాలనుకుంటున్నారు. అలా ఎదురుచూస్తున్న వారికి బీజేపీ ఆశాకిరణమవుతుంది. బీజేపీకి కావాల్సింది కూడా వారిని కలుపుకుపోవడమేనని  ప్రత్యేకంగా  చెప్పాల్సిన పనిలేదు. తెలంగాణ కూడా కర్ణాటకలాగే తయారు కావచ్చు. ఇక్కడి 119 అసెంబ్లీ స్థానాల్లో కనీస మెజార్టీకి 60 సీట్లు రావాల్సి ఉండగా, కాంగ్రెస్ పార్టీకి 64 వచ్చాయి. అంటే కనీస మెజార్టీ కంటే కేవలం నాలుగు స్థానాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రత్యర్థి బీఆర్ఎస్ కు 39 స్థానాలు దక్కాయి.అంటే కాంగ్రెస్ లో చిన్నపాటి తిరుగుబాటు జరిగినా ఆ గ్రూపుకు బీఆర్ఎస్ తో పాటు ఎనిమిది మంది సభ్యులున్న బీజేపీ తోడయ్యే వీలుంటుంది. కాంగ్రెస్ లో మొదటి నుంచి ఉన్న భట్టి విక్రమార్క, జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, జగ్గారెడ్డి లాంటి వాళ్లని కాదని తర్వాత ఎప్పుడో వచ్చిన రేవంత్  రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం సీఎం పదవి ఇవ్వడంతో వాళ్లంతా మండిపోతున్నారు. వాళ్లలో ఒకళ్లు గ్రూపు కట్టి  బయటకు వస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం పడిపోవడం ఖాయం.అయితే వాళ్లలో ఎవరూ తక్షణమే ప్రత్యక్ష కార్యాచరణకు దిగే అవకాశం లేదు. లోక్ సభ ఎన్నికల ఫలితాలను చూసుకుని తర్వాత  గేమ్ ప్లాన్ అమలు చేసే అవకాశం ఉంది. నాలుగు రోజులు సీఎంగా ఉన్నా చాలనుకునే వాళ్లు చాలా మంది కాంగ్రెస్లో ఉన్నారు. అలాంటి వారిని లాగేసి తర్వాత బురిడీ కొట్టించడం కేసీఆర్, బీజేపీలకు బాగానే తెలుసు. అందులోనూ అధికారాన్ని ఎలా పొందాలో కేసీఆర్ కు బాగానే తెలుసు. ఎమ్మెల్యేలను ఎలా లాక్కోవాలో పదేళ్ల పాటు ఆయన రీసెర్చ్ చేసి ఉన్నారు. ఆ విషయంలో కేసీఆర్ ముందు రేవంత్ రెడ్డిని అనుభవం లేని నాయకుడిగానే పరిగణించాలి.

బీఆర్ఎస్ కు నాలుగైదు ఎంపీ సీట్లు వస్తే సీన్ మారిపోతుంది. తెలంగాణ ప్రజల్లో పార్టీ పట్ల మళ్లీ విశ్వాసం కలుగుతోందని కేసీఆర్ కు ధీమా  వచ్చేస్తోంది. అప్పుడు ఎలాంటి రిస్క్ అయినా తీసుకునేందుకు ఆయన వెనుకాడరు. పైగా మళ్లీ అసెంబ్లీ ఎన్నికలు రావాలంటే నాలుగేళ్లకు పైగా టైమ్ ఉంటుంది.అంతవరకు పార్టీని మేనేజ్ చేయాలంటే ఏదోక రాజకీయ కార్యకలాపాలు ఉండాలి కదా. అది ప్రభుత్వాలు మారే కార్యక్రమం అయితే నేతలు, ఎమ్మెల్యేలు బిజీగా ఉంటారు. కేసీఆర్ ప్లాన్ కూడా అదే కావచ్చు…

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి