ఖమ్మంలో మారిన సమీకరణలు

By KTV Telugu On 17 February, 2024
image

KTV TELUGU :-

లోక్ సభ ఎన్నికలు తరుముకు వస్తోన్న తరుణంలో  తెలంగాణాలో ఎక్కువ మంది ఆశలు పెట్టుకున్న ఖమ్మం లోక్ సభ నియోజక వర్గంలో కొందరు ఆశావహులు ఎగిరి గంతేస్తున్నారు. తమతో పోటీ పడే వారిలో   ఒకరు రాజ్యసభకు  నామినేట్ అయ్యే అవకాశం ఉండడంతో టికెట్ రేసులో ఒకరు తగ్గినట్లే కదా అని కాంగ్రెస్, బి.ఆర్.ఎస్.  అభ్యర్ధులు  పండగ చేసుకుంటున్నారు. తెలంగాణాలో మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి.  అసెంబ్లీలో బలా బలాలను బట్టి   కాంగ్రెస్ పార్టీకి రెండు స్థానాలు  బి.ఆర్.ఎస్. ఒక స్థానం గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ రెండు పార్టీలు కూడా  ఖమ్మం నుంచి ఒక్కో అభ్యర్ధి పేరు ఖరారు చేయడంతో ఖమ్మం నుంచి రాజ్యసభ టికెట్ ఆశిస్తోన్న ఇతర నేతలకు ఊరట లభించినట్లయ్యింది.

కాంగ్రెస్ పార్టీ  తాను గెలుచుకోగలిగిన రెండు స్థానాలకు అభ్యర్ధులను ఖరారు చేసేసింది.  సీనియర్  నాయకురాలు ఖమ్మం మాజీ ఎంపీ అయిన రేణుకా చౌదరి తో పాటు  సికింద్రాబాద్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ తనయుడు అనిల్ కుమార్  పేరును కాంగ్రెస్ అధిష్ఠానం ఖరారు చేసింది.  ఇక బి.ఆర్.ఎస్. పార్టీ    తరపున రాజ్యసభలో  ఎంపీగా ఉన్న వద్దిరాజు రవిచంద్ర  పదవీ కాలం ముగియనుండడంతో  మరోసారి ఆయన పేరునే నాయకత్వం ఫైనలైజ్ చేసింది. ఈయన కూడా ఖమ్మం జిల్లాకు చెందిన వారే కావడంతో  లోక్ సభ ఎన్నికల్లో టికెట్ కోసం ఇక రేణుకా చౌదరి, వద్దిరాజులు    ప్రయత్నించాల్సిన అవసరం ఉండదు.

నిజానికి ఖమ్మం లోక్ సభ స్థానం నుండి టికెట్ కోసం కాంగ్రెస్ పార్టీలో విపరీతమైన పోటీ ఉంది. గతంలో ఖమ్మం లోక్ సభ స్థానం నుండి ప్రాతినిథ్యం వహించిన రేణుకా చౌదరి మరోసారి తనకే టికెట్ ఇవ్వాలని పట్టుబడుతున్నారు. ఆమె సామాజిక వర్గ ఓటర్లు ఖమ్మం జిల్లాలో ఎక్కువ సంఖ్యలోనే ఉన్నారు. ఆమె తో పాటు డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క సతీమణి నందిని, రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాద రెడ్డి  టికెట్ రేసులో ఉన్నారు. అటు బి.ఆర్.ఎస్. లో   మాజీ ఎంపీ నామానాగేశ్వరావు రేసులో ముందంజలో ఉన్నారు.  వద్దిరాజును రాజ్యసభకు పంపడంతో నామాకు లైన్ క్లియర్ అయ్యిందని అంటున్నారు.

తెలంగాణాలో మొత్తం ఏడు రాజ్య సభ స్థానాలు ఉన్నాయి. ఇవన్నీ ఇంత వరకు బి.ఆర్.ఎస్. చేతిలోనే ఉన్నాయి. ఆ పార్టీకి చెందిన ముగ్గురు ఎంపీల పదవీ కాలం ఏప్రిల్ తో ముగుస్తోంది. అందుకే ఎన్నికలు అనివార్యమవుతున్నాయి. తెలంగాణా అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి 64 మంది ఎమ్మెల్యేలు ఉండగా మిత్ర పక్షం సిపిఐ తో కలుపుకుని 65 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. ఈ బలంతో కాంగ్రెస్ పార్టీ రెండు రాజ్యసభ స్థానాలు గెలుచుకునేందుకు అవకాశం ఉంది. బి.ఆర్.ఎస్. కు ఉన్న బలంతో ఆ పార్టీ అభ్యర్ధి వద్దిరాజు రవిచంద్ర విజయం లాంఛనమే అవుతుంది.

కాంగ్రెస్ నుంచి రేణుక చౌదరిని రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటించడం అనూహ్య పరిణామమనే చెప్పాలి. ఖమ్మం నుంచి లోక్ సభ టికెట్ ఆశించిన రేణుకా చౌదరికి మోకాలడ్డేందుకు తెలంగాణా కాంగ్రెస్ నేతలు ఖమ్మం నుంచి పోటీ చేయాల్సిందిగా పార్టీ అధినేత్రి సోనియా గాంధీని కోరారు. దాంతో కంగుతిన్న  రేణుకా చౌదరి ఒక వేళ సోనియా గాంధీ పోటీ చేయకపోతే తనకే టికెట్ ఇవ్వాలని అంటూ వచ్చారు. తాజాగా సోనియా గాంధీ ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుని రాజస్థాన్ నుండి రాజ్యసభకు నామినేషన్ వేయడంతో రేణుకా చౌదరి రొట్టె విరిగి నేతిలో పడ్డట్లయ్యిందంటున్నారు పరిశీలకులు.

బీఆర్ఏస్ ప్రకటించిన వద్దిరాజు రవిచంద్ర కాపు సామాజిక వర్గానికి చెందిన బలమైన నేత…వద్దిరాజు ను ప్రకటించడం ద్వారా ఖమ్మంతో పాటు కాపు సామాజిక వర్గం ఓట్లు ఏక్కువగా ఉన్న నిజామాబాద్,కరీంనగర్ లో పార్లమెంట్ స్థానాలలో ఈజీగా గెలవచ్చన్న ఉద్దేశ్యంతో వద్దిరాజుకు అవకాశం కల్పించినట్లు తెలుస్తుంది. రెండవసారి కూడ వద్దిరాజుకు అవకాశం కల్పించడం పట్ల కాపు సామాజిక వర్గం నేతలు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

రేణుకా చౌదరికి ఇవ్వడం ద్వారా  కమ్మ సామాజిక వర్గ ఓట్లు గంపగుత్తగా తమకే పడతాయని కాంగ్రెస్ భావిస్తోంది. మొత్తానికి కాంగ్రెస్, బి.ఆర్.ఎస్. లు వ్యూహాత్మకంగానే ఖమ్మం జిల్లాకు  చెందిన వారిని రాజ్యసభకు పంపాయని ప్రచారం జరుగుతోంది…

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి