దశాబ్దం తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ జెండా రెపరెపలాడటానికి సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వం, ఆయన వ్యూహాలు, అందరినీ కలుపుకుపోయేతత్వమే కారణమని చెప్పకతప్పదు. రేవంత్ అదృష్ట జాతకుడని కూడా కొందరు అంటారు. మరి తన తెలంగాణ అదృష్టాన్ని రేవంత్ కొంతైనా ఆంధ్రప్రదేశ్ కు పంచుతారా. ఆయన ఏపీలో లెగ్గు పెడితే హస్తం పార్టీకి ప్రయోజనం కలుగుతుందా అన్న చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో మొదలైంది…
ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ కు మనుగడ సమస్య ఉంది. రాష్ట్ర విభజన తర్వాత వరుసగా రెండు ఎన్నికల్లోనూ ఘోర పరాజయం పాలైంది. 2019లో ఆ పార్టీకి ఒక శాతం కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. దానితో ఈ సారి ఎన్నికల్లో ఆ పార్టీకి మనుగడ సమస్య తలెత్తుతోంది. ఈ సారి కాస్త పరువైనా కాపాడుకోలేకపోతే ఇక రాష్ట్రంలో కొట్టుకట్టెయ్యడమేనని నాయకులకు తెలుసు. పైగా యువత తమ పార్టీ వైపు ఆకర్షితులవ్వాలంటే ఈ సారి ఏదోక అద్భుతం జరగాలని కాంగ్రెస్ ఎదురుచూస్తోంది. ఈ క్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వైపు ఏపీ కాంగ్రెస్ నేతలు చూస్తున్నారు. రేవంత్ రెడ్డి వచ్చి నాలుగు మీటింగులు మాట్లాడితే జనంలో కాంగ్రెస్ పట్ల విశ్వాసం పెరుగుతుందని, ఓట్లు పడతాయని అక్కడ నేతలు ఆశపడుతున్నారు. తొలి భేటీ తిరుపతి లేదా వైజాగ్ లో ఉండాలని నేతల్లో చర్చ జరుగుతోంది. రాయలసీమ నేతలు తిరుపతిలో మీటింగ్ పెట్టాలని భావిస్తుంటే, ఉత్తరాంధ్ర నేతలు రేవంత్ వైజాగ్ రావాలని కోరుకుంటున్నారు..
దక్షిణాది రాజకీయాల్లో రేవంత్ రెడ్డి ఇప్పుడో రైజింగ్ స్టార్. ప్రత్యర్థులను చీల్చి చెండాడే సీఎం ఆయన.ఎక్కడికి వెళ్లినా రేవంత్ కు ఒక ఫాలోయింగ్ వస్తోంది. అందుకే ఏపీ నేతలు ఆయన వైపు చూస్తున్నారు.ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల కూడా రేవంత్ పర్యటన కోసం ఎదురు చూస్తున్నారు…
ఏపీలో ఎన్నికల శంఖారావ సభ నిర్వహించేందుకు షర్మిల నాయకత్వంలో పీసీసీ ఏర్పాట్లు చేస్తోంది. సోనియా, ఖర్గే, రాహుల్ గాంధీ, సిద్దరామయ్య, డీకే శివకుమార్ సహా పలువురు నేతలు హాజరవుతారని ఎదురు చూస్తున్నారు. వారితో పాటుగా రేవంత్ రెడ్డిని కూడా పిలుస్తున్నట్లు, తెలంగాణ సీఎంను తీసుకొచ్చే బాధ్యత ఏపీ ఇంచార్జ్ మాణిక్కం ఠాకూర్ తీసుకున్నట్లుగా పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. అందరు రావడం ఒక ఎత్తు అయితే రేవంత్ రావడం మరో ఎత్తు అన్న టాక్ నడుస్తోంది. రేవంత్ ఏపీలో గేమ్ ఛేంజర్ అవుతారని కూడా వారి నమ్మకం. షర్మిల కారణంగా రేవంత్ దూరంగా ఉంటారన్న చర్చకు కూడా తెరపడింది. తెలంగాణలో ఆమెను కాంగ్రెస్ లో చేరకుండా రేవంత్ అడ్డుకున్నారని అప్పట్లో చర్చ జరిగింది. అయితే ఎన్నికల తర్వాత అలాంటి విభేదాలన్నీ సర్దుకున్నాయి. షర్మిల కుమారుడు రాజారెడ్డి పెళ్లికి రేవంత్ ను కూడా ఆహ్వానించిన సందర్భంగా ఇద్దరు నేతల బాడీ లాంగ్వేజ్ విస్తృత స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఐకమత్యానికి నిదర్శనంగా కనిపించింది.ఇప్పుడు పార్టీ మీటింగుకు షర్మిలే స్వయంగా హైదరాబాద్ వచ్చి రేవంత్ ను ఆహ్వానిస్తారన్న చర్చ కూడా జరుగుతోంది. రేవంత్ రెడ్డి పట్ల ఏపీ ప్రజల్లో అభిమానం ఉండటంతో పాటు ఆయన ప్రచారానికి వస్తే టీడీపీ, కాంగ్రెస్ ఓకటేనన్న వాదన పోయి… హస్తం పార్టీ స్వతంత్రంగా ఉందన్న ఆలోచన జనంలోకి వెళ్లాలదన్న వారి ఉద్దేశంగా కనిపిస్తోంది….
ఏదైమైనా రేవంత్ ఇప్పుడు లక్కీ హ్యాండ్. ఆయన వస్తే ఏపీ శాఖకు కూడా పూర్వవైభవం వస్తుందని నమ్మకం. యువత పార్టీ వైపు చూస్తుందన్న విశ్వాసం. ఏపీ కాంగ్రెస్ లో ఫైర్ బ్రాండ్లు లేని లోటును జనం మరిచిపోతారన్నది ఒక థియరీ. చూడాలి మరి ఏమి జరుగుతుందో…
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…