నారా బ్రాహ్మణి మళ్లీ లైమ్ లైట్లోకి వస్తున్నారు. కొంతకాలం ఇంటికి, హెరిటేజ్ సంస్థకు పరిమితమైన బాలయ్య ముద్దుల కూతురు ఇప్పుడు మంగళగిరిలో ప్రత్యక్షమయ్యారు. ఎమ్మెల్యే కాకపోయినా తన భర్త నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గం కోసం ఎంతెంత చేస్తున్నారో ఆమె జనానికి వివరిస్తున్నారు. ఇంతకీ బ్రహ్మణి రూటు ఎటో…..
మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సతీమణి నారా బ్రాహ్మణి పర్యటించారు. చేనేతను దత్తత తీసుకుంటా అని లోకేశ్ మాటిచ్చిన నేపథ్యంలో, చేనేత రంగాన్ని ప్రోత్సహించేందుకు బ్రాహ్మణి ముందుకు వచ్చారు. ఆత్మకూరులోని చేనేత డైయింగ్ షేడ్ ని ఆమె పరిశీలించారు. చేనేత డైయింగ్ కార్మికులతో ముచ్చటించారు. ఎన్నో ఏళ్లుగా చేనేత డైయింగ్ కార్మికులుగా పనిచేస్తున్నా తమకు గుర్తింపు లేదన్న కార్మికులు , తమ కష్టం ఎక్కువ వచ్చే ఆదాయం తక్కువని ఆవేదన వ్యక్తంచేశారు. డైయింగ్ ప్రక్రియలో వాడే కెమికల్స్ వలన అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కున్నా తమకు తెలిసిన పని ఇది ఒక్కటే కాబట్టి దీనినే నమ్ముకొని పనిచేస్తున్నామని వాళ్లు వాపోయారు.మంగళగిరిలో టాటా సంస్థ తనేరా, ఎన్నారై తెలుగుదేశం పార్టీ సహకారంతో ఏర్పాటు చేసిన వీవర్ శాలను నారా బ్రాహ్మణి, తనేరా సీఈవో అంబుజ్ నారాయణ ప్రారంభించారు. వీవర్ శాలలోని మగ్గాలను పరిశీలించారు. అధునాతన జాకాట్ మగ్గంపై నేసిన చీరను కట్ చేశారు. వీవర్ శాలలో తయారైన చీరల నాణ్యతను నారా బ్రాహ్మణి పరిశీలించారు. చాలా అధునాతనంగా ఉన్నాయని కితాబిచ్చారు. తనకు ఇష్టమైన రంగుల చీరను చూసి ఆనందం వ్యక్తం చేశారు. జాకట్ మగ్గాలపై శిక్షణ పొందిన వారికి సర్టిఫికెట్లు అందజేశారు.
బ్రాహ్మణి సడన్ గా మళ్లీ జనంలోకి ప్రత్యక్షం కావడం చర్చనీయాంశమైంది. ఆమె మళ్లీ పొలిటికల్ గా కూడా యాక్టివ్ అవుతారన్న చర్చ జరుగుతోంది. ఎన్నికల వేళ మంగళగిరిలో లోకేశ్ తరపున ప్రచారానికి దిగుతారని కూడా పార్టీ వర్గాలు చెబుతున్నాయి…
బ్రాహ్మణి రాజకీయ ఆకాంక్షలున్న యువనేతగా కనిపించరు. ఐనా రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన కారణంగా ఆ బాడీ లాంగ్వేజ్,ఆ ఊపు ఆమెలో కనిపిస్తుంది. అవకాశం వస్తే ప్రజా సేవ చేయాలన్న కోరిక కూడా ఆమె చర్యలను బట్టి బయట పడుతునే ఉంటుంది. చంద్రబాబు నాయుడును వైసీపీ ప్రభుత్వం అరెస్టు చేసినప్పుడు నారా బ్రాహ్మణి క్రియాశీలంగా కనిపించారు. రాజమండ్రి, విజయవాడ, హైదరాబాద్ తిరుగుతూ పార్టీ నేతలను ఉత్తేజ పరిచారు. ఫోకస్ మొత్తం ఆమె వైపే కనిపించింది. బ్రాహ్మణిని చూసేందుకు జనం ఎగబడ్డారు. ఈ క్రమంలోనే చంద్రబాబు బెయిల్ పై విడుదయ్యే నాటికి ఆమె మళ్లీ పక్కకెళ్లిపోయారు. హెరిటేజ్ వ్యాపారాలు చూసుకుంటూ బిజీ అయిపోయారు. ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఆమె మంగళగిరిలో ప్రత్యక్షమయ్యారు. ప్రస్తుతానికి ఆమె వచ్చిన పని వేరే ఉన్నప్పటికీ అందులో నారా లోకేశ్ కోసం ఎన్నికల వ్యూహం ఉందని చెప్పక తప్పదు. షెడ్యూల్ వచ్చిన తర్వాత ఆమె లోకేశ్ తరపున ప్రచారానికి కూడా వస్తారని చెబుతున్నారు. మంగళగిరి జనం ఈ సారి టీడీపీకి మద్దతుగా ఉన్నట్లు వార్తలు వస్తున్న తరుణంలో బ్రాహ్మణి ప్రచారం మరింత ఊతమిచ్చేదిగానే ఉంటుంది..
బ్రాహ్మణి వస్తే ఎన్నికల ప్రచారానికి గ్లామర్ అద్దినట్లుగానే అనుకోవాలి. గత ఎన్నికల్లో కూడా ఆమె మంగళగిరిలో పర్యటించి లోకేశ్ కోసం ఓట్లు అడిగారు. అప్పుడు లోకేశ్ ఓడిపోవడం వేరు.. ఇప్పుడు పరిస్థితులు వేరు. మంగళగిరి జనంలో తప్పు చేశామన్న భావన పెరిగింది. పైగా అధికార వైసీపీలో కీచులాటలున్నాయి. ఓడిపోయినా మంగళగిరిని లోకేశ్ తన సొంత నియోజకవర్గంగా చూసుకున్నారు. దానితో ఇప్పుడు నారా బ్రాహ్మణి ప్రచారం అదనపు ఆకర్షణే అవుతుంది…
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…