BJP ట్రాప్‌లో BRS

By KTV Telugu On 19 February, 2024
image

KTV TELUGU :-

తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ,  భారత రాష్ట్ర సమితి కలిసి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని ఢిల్లీ నుంచి ఓ లీక్ తెలంగాణకు వచ్చింది. ఒక్క సారిగా బ్లాస్ట్ అయింది. అయితే రెండు పార్టీల్లోని నేతలు స్పందించలేదు.  కానీ వలసల నిరోధం కోసమని బండి సంజయ్ చెప్పడం.. ఆయనకేమీ తెలియదని మాజీ మంత్రి మల్లారెడ్డి కౌంటర్ ఇవ్వడంతో .. రాజకీయం ఊపందుకుంది.  బీఆర్ఎస్, బీజేపీ మధ్య పొత్తుల కోసం కొంత కాలంగా అంతర్గత ప్రయత్నాలు జరుగుతున్నాయి.  బీఆర్ఎస్ ను కాపాడుకోవాలంటే బీజేపీతో కలవడం తప్ప మార్గం లేదన్న అభిప్రాయానికి బీఆర్ఎస్ పెద్దలు వస్తున్నారంటున్నారు.  కానీ బీఆర్ఎస్ కలిస్తేనే ఎక్కువ ముప్పు అనే వాదించే వారు కూడా ఉన్నారు.

బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ఎలా ఉంటుందని  పార్టీ నేతల అభిప్రాయాలను కేసీఆర్ అడిగి తెలుసుకున్నారని  బీఆర్ఎస్ పార్టీ వర్గాలు మీడియాకు సమాచారం ఇచ్చాయి.   చాలా మంది నేతలు వ్యతిరేకంగా స్పందించారని అంటున్నారు.  మైనార్టీ ఓట్లు చేజారిపోతాయని కేసీఆర్ సైతం ఆందోళన వ్యక్తం చేశారని పార్టీ వర్గాలంటున్నారు.  ఈ క్రమంలోనే.. బీజేపీ-బీఆర్ఎస్ పొత్తుపై అసెంబ్లీ లాబీల్లో జోరుగా చర్చ జరిగింది. బీజేపీతో పొత్తు ఉంటుందేమోనని మెజార్టీ ఎమ్మెల్యేలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరికొద్ది రోజుల్లోనే బీజేపీ-బీఆర్ఎస్ పొత్తుపై క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే బీజేపీతో పొత్తుపై ఢిల్లీ స్థాయిలో చర్చలు నడుస్తున్నాయని కూడా అంటున్నారు. బీజేపీ మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని గట్టిగా నమ్ముతున్నందున.. పార్టీని కాపాడుకోవడం సహా.. అనేక సమస్యల పరిష్కారం కోసం పొత్తులు మేలని కేసీఆర్ భావిస్తున్నట్లుగా  చెబుతున్నారు.

తెలంగాణ లోక్‌సభ ఎన్నికలు  బీఆర్ఎస్ కి విషమ పరీక్షే.  తెలంగాణలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీజేపీకి మూడు లోపు, బీఆర్ఎస్‌కు  కూడా మూడు లోపు సీట్లు వస్తాయని  కాంగ్రెస్‌కు పది ప్లస్ వస్తాయని  సర్వేలు చెబుతున్నాయి.  ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితానే తీసుకుని విశ్లేషణ చేస్తే ఇదే రిజల్ట్ వస్తుంది.  ఇక్కడ అసలు ట్విస్ట్ ఉంది. అదేమిటంటే..  బీఆర్ఎస్, బీజేపీకి కలిసి పోటీ చేస్తే పధ్నాలుగు సీట్లు వచ్చేలా స్వీప్ చేస్తారనే అంచనాలు వస్తున్నాయి.  ఇప్పుడు బీజేపీని బీఆర్ఎస్ ఏమీ అనడం లేదు.   గతంలో బీఆర్ఎస్‌ చీఫ్ కేసీఆర్ బీజేపీతో  కలిసేందుకు ప్రయత్నించారని స్వయంగా ప్రధాని మోదీనే చెప్పారు. పార్టీని కాపాడుకోవాలంటే…  బీజేపీకి సన్నిహితం కాక తప్పదన్న భావన కేసీఆర్ గతంలోనే వ్యక్తం చేశారు.  ఇప్పుడు అధికారం పోయింది. ఇప్పుడు బీజేపీ హైకమాండ్ నుంచి ప్రతిపాదన వస్తే.. ఖచ్చితంగా పొత్తు పెట్టుకోక తప్పదన్న అంచనాలు ఉన్నాయి.

కేసీఆర్ ఇప్పుడు రెండే ఆప్షన్లు ఉన్నాయని అందులో ఒకటి ఒంటరిగా రెండు జాతీయ పార్టీలతో ఫైట్ చేయడం.. రెండోది.. బీజేపీతో కలవడం. రెండు ఆప్షన్లు కూడా రెండు వైపులా పదునున్న కత్తిలాంటివే.  కేసీఆర్‌కు ఇది అత్యంత గడ్డు పరిస్థితి.  బీజేపీ పొత్తు పెట్టుకోవాలని హుకుం జారీ చేస్తే తిరస్కరించలేని నిస్సహాయ స్థితిలో ఇప్పుడు బీఆర్ఎస్ ఉంది. అయితే  బీఆర్ఎస్ ను కాపాడుకోనడానికి కేసీఆర్ కు ఇక్కడ ఓ ఆప్షన్ ఉంది. తెలంగాణ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుని పోటీ చేసిన తర్వాత ప్రభుత్వాన్ని మార్చేందుకు సహకరించాలని.. తెలంగాణలోనూ బీఆర్ఎస్, బీజేపీ కూటమి ఏర్పాటుకు సహకరించాలని కోరే అవకాశం ఉంది. ఈ ఒప్పందంతో కేసీఆర్ పొత్తు పెట్టుకుంటే.. పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో ఏకపక్ష విజయం సాధిస్తే కాంగ్రెస్ ను ఇబ్బంది పెట్టవచ్చు.

అయితే  బీజేపీని నమ్మడానికి అవకాశం లేదు.  ఎందుకంటే బీజేపీ ఇప్పుడు తెలంగాణలో గట్టి ఫోర్స్ గా ఉంది. మేజర్ భాగస్వామిగా తామే ఉంటానని పట్టుబడుతంది. అంతే కానీ తగ్గే చాన్స్ ఉండదు. పార్లమెంట్ సీట్లు ఉన్నది పదిహేడు అయితే.. హైదరాబాద్ వదిలేసి ఎనిమిది సీట్ల కోసం పట్టుబడుతుంది. బీఆర్ఎస్ ఎనిమిది సీట్లకే పరిమితం కావాలి. అంటే..  తెలంగాణలో తిరుగులేని స్థానం నుంచి సగానికి పడిపోతుంది. ఆ తర్వాత మళ్లీ కోలుకుండా చేయగలిగే వ్యూహాలు  బీజేపీ దగ్గర ఉంటాయి. బీఆర్ఎస్ స్థానాన్ని కైవసం చేసుకోడానికి బీజేపీ చేయగిలిగినంత చేస్తుంది. మిత్రపక్షమైనా సరే వదిలి పెట్టదు.  బీజేపీ నైజం గురించి కాస్త ఆలోచిస్తే ఇదే విషయం స్పష్టమవుతుంది.  పొత్తులు పెట్టుకుని లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ను ఓడించి.. ఆ పార్టీ ప్రభుత్వాన్ని కూలగొట్టినా.. బీఆర్ఎస్‌కు పరిణామాలు సాఫీగా సాగిపోతాయని చెప్పలేము.

అయితే బీజేపీ, బీఆర్ఎస్ మధ్య ఎలాంటి సంప్రదింపులు జరుగుతున్నాయో స్పష్టత లేదు. కానీ ఏదో జరుగుతోందన్న చర్చ మాత్రం ప్రారంభమయింది. ఏం జరుగుతుందో వచ్చే పది రోజుల్లో స్పష్టత రావొచ్చు.  కేసీఆర్ కు ఇప్పుడు ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్న పరిస్థితి ఉంది. దాన్ని  తప్పించుకోవాలంటే… బతికిబయటపడే మార్గంలో వెళ్లాలి.  అది ఏ మార్గమన్నది కేసీఆర్ డిసైడ్ చేయాల్సి ఉంది. తన రాజకీయ జీవితంలో అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్ని కేసీఆర్ ఎదుర్కొంటున్నారని అనుకోవచ్చు…

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి