టార్గెట్ హరీష్ రావు !

By KTV Telugu On 19 February, 2024
image

KTV TELUGU :-

రాజకీయాల్లో ఓ వ్యక్తిని టార్గెట్ చేయాలని అనుకుంటే.. అన్ని పార్టీలూ కూడబలుక్కుంటాయి.  తాము అనుకున్నది చేస్తాయి. చివరికి అతను  రోడ్డున పడితే తమ పార్టీలో చేర్చుకోవాలని ఆరాటపడతాయి. ఇప్పుడు ఇలాంటి రాజకీయాలు తెలంగాణలో జరుగుతున్నాయి. అన్నిపార్టీలూ హరీష్ రావును టార్గెట్ చేశాయి.  హరీష్ రావు వీటిని సమర్థంగా ఎదుర్కోగలిగిన నేత అయినప్పటికీ.. ఎం జరుగుతుందో ఊహించడం కష్టం. ఎందుకంటే సొంత పార్టీలో ఆయనకు ఇతర పార్టీల ఆరోపణలను తిప్పికొట్టేలా బలమైన మద్దతు లభించాల్సి ఉంది.

రేవంత్ రాజీనామా చేస్తే తాను సీఎంగా బాధ్యతలు చేపట్టి మేడిగడ్డ మరమ్మతులు పూర్తి చేస్తానని  హరీష్ రావు ప్రెస్ మీట్‌లో చాలెంజ్ చేశారు.  ఈ చాలెంజ్ వెనుక ఉన్న కారణం సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు. మేడిగడ్డ విషయంలో ఆయన హరీష్ రావుకు చేసిన చాలెంజ్. అందుకే హరీష్ కూడా రియాక్ట్ అయ్యారు. తనకు చాలెంజ్ చేశారు కాబట్టి… రేవంత్ రాజీనామా చేస్తే తాను సీఎం అవుతానని కౌంటర్ ఇచ్చారు. కానీ ఇది రాజకీయంగా వ్యూహాత్మక తప్పిదంగా మారినట్లుగా కనిపిస్తోంది.

హరీష్ నోటి వెంట సీఎం అనే మాట వచ్చిన మరుక్షణం నుంచి ఆయనపై  కాంగ్రెస్,  బీజేపీ నేతలు దాడి ప్రారంభించారు. అయితే వారి రాజకీయం వేరు. హరీష్ ను బీఆర్ఎస్‌కు దూరం చేయాలన్న రాజకీయం వారిది. కోమటిరెడ్డి బ్రదర్స్ పార్టీని చీల్చుకుని రావాలని సలహా ఇచ్చేశారు.  బీఆర్ఎస్ లో ఉంటే.. కనీసం లేజిస్లేచర్ పార్టీ నేతగా కూడా అవ్వలేరని రెచ్చగొట్టారు. కేసీఆర్ అవినీతిని వ్యతిరేకించి వస్తే హరీష్ ను బీజేపీలో చేర్చుకుంటామని బండి సంజయ్ ఆఫర్ ఇచ్చారు. ఆ తర్వాత సోషల్ మీడియాలో కొంత మంది బీజేపీలోకి హరీష్ అనే ప్రచారం ప్రారంభించారు.  అంటే అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ కలిసి బీఆర్ఎస్‌లో ఆయన  పై అపనమ్మకాన్ని పెంచడానికి ఇతర పార్టీల నేతలు చేయాల్సినదంతా చేస్తున్నారు.  ఇది హరీష్ రావుకు ఇబ్బందికరంగా మారింది.

రాజకీయ పార్టీల నేతలు ఎవరైనా.. తమ పార్టీ అధినేత కేంద్రంగానే రాజకీయం చేస్తారు.  మీకు చేతకపోతే దిగిపోండి కేసీఆర్ చేసిచూపిస్తారని అంటారు.  హరీష్ రావు కూడా గతంలో ఎన్నో సార్లు అలాంటి డైలాగులు చెప్పారు. కానీ ఇప్పుడు కేసీఆర్ స్థానంలో తనను చెప్పుకోవడమే అనేక ప్రశ్నలకు కారణం అవుతోంది. రేవంత్ అన్న మాటలకుకౌంటర్ గానే హరీష్ అన్నారు కానీ.. మరో ఉద్దేశం లేదని ఎవరికైనా అర్థమవుతుంది.  కానీ చిన్న  మాటను  రాజకీయాల్లో  పెద్ద అగాధం చేసేందుకు చాలా మంది ఉంటారు. ఇప్పుడు హరీష్ విషయంలో అదే ప్రయత్నం చేస్తున్నారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

హరీష్ రావును ఎందుకు టార్గెట్ చేస్తున్నారో రాజకీయవర్గాలకు బాగా తెలుసు. ఆయన బీఆర్ఎస్ కు సగం బలం.  ఆయనను ఆ పార్టీకి దూరం చేస్తే… బీఆర్ఎస్ ను నిర్వీర్యం చేయడం సులువు అవుతుంది.  అదే సమయంలో హరీష్ రావు.. బీఆర్ఎస్ లో ఉంటే అత్యున్నత స్థానానికి ఎదగలేరన్నది కూడా నిజమే.  బీఆర్ఎస్‌లో కేసీఆర్‌ తర్వాత ఆ స్థానం కేటీఆర్‌ అన్నది బహిరంగ రహస్యమే. రెండేళ్ల కిందటే ఆయనను సీఎం చేస్తారని వార్తలు వచ్చాయి. దానికి బలం చేకూర్చేలా తలసాని మొదలు చాలామంది మంత్రులు కేటీఆర్‌కు ఆ సామర్థ్యం ఉన్నదని కితాబు కూడా ఇచ్చారు. ప్రధాని కూడా కేసీఆర్‌ తన తనయుడిని సీఎం చేయడానికి సాయం చేయాలని కోరారని హైదరాబాద్‌ పర్యటనలో చెప్పారు.

అయితే తన లక్ష్యం అత్యున్నత స్థానమని.. ముఖ్యమంత్రిని అవుతానని హరీష్ రావు ఎప్పుడూ చెప్పలేదు. కేసీఆర్ ను ధిక్కరించే ప్రశ్నే లేదని చాలా సార్లు తేల్చారు. గతంలో తనకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వకపోయినా ఆయన పెద్దగా పట్టించుకోలేదు.  పార్టీకి కేసీఆర్ కు విధేయంగానే ఉన్నారు. కేటీఆర్ తో ఆయనకు విబేధాలున్నాయని చాలా కాలంగా ప్రచారం జరుగుతూనే ఉంది. కానీ దీనికి సాక్ష్యంగా ఒక్కటంటే ఒక్క ఉదాహరణ కూడా లేదు. హరీష్ రావు అచ్చమైన రాజకీయ నాయకుడు. బయటపడరు.  పూర్తిగా తనకు అనుకూలమైన రాజకీయం చేస్తారు. 2018లో రెండో సారి గెలిచిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో తనను పక్కన పెట్టిన అంశంపైనా ఆయన చేసిన రాజకీయం ఆయనకు సానుభూతి పెంచింది. ఇలాంటి పరిస్థితుల్లో హరీష్ రావు వ్యూహాత్మకంగానే ఉన్నారు. కానీ ఆయనను బీఆర్ఎస్ ను  బయటకు వచ్చేలా తమ పార్టీలో చేర్చుకోవాలో లేకపోతే.. కేసీఆర్ కుటుంబానికి దూరం చేయాలనే పార్టీలు ప్రయత్నిస్తున్నాయి.

ఇలాంటి రాజకీయాల్ని హరీష్ రావు గతంలో సమర్థంగా ఎదుర్కొన్నారు. అయితే ఇప్పుడు పరిస్థితులు మారాయి.  బీఆర్ఎస్ విపక్షంలోకి వచ్చింది.  హరీష్ రావుపై బీఆర్ఎస్ అధినాయకత్వం కూడా ఎలాంటి అపనమ్మకాల్ని పెట్టుకోకుండా చూసుకోవాల్సి ఉంది.  మిస్ కమ్యూనికేషన్ తో సమస్యలు వస్తే మాత్రం.. బీఆర్ఎస్‌, హరీష్ కు మధ్య ఆగాధం పెంచాలనుకుంటున్న పార్టీల పాచికలు పారినట్లే అవుతుంది. వారి ట్రాప్‌లో బీఆర్ఎస్, హరీష్ పడినట్లే అవుతుందన్న అంచనాలు ఉన్నాయి…

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి