బిజెపి-బి.ఆర్.ఎస్. మధ్య డీల్ కుదిరిందా?

By KTV Telugu On 19 February, 2024
image

KTV TELUGU :-

తెలంగాణాలో భారతీయ జనతా పార్టీకీ…భారత రాష్ట్ర సమితికీ   బంధం కుదిరిందా? లోక్ సభ ఎన్నికల్లో రెండు పార్టీలూ చెట్టపట్టాలేసుకుని ఎన్నికల బరిలోకి దిగుతాయా?  అదే జరిగితే రెండు పార్టీలు కలిసి  17 నియోజక వర్గాలున్న తెలంగాణాలో క్లీన్ స్వీప్ చేస్తాయా? ఇపుడు తెలంగాణాలో దీనిపైనే చర్చ నడుస్తోంది. బి.ఆర్.ఎస్. పార్టీకి చెందిన  సీనియర్ నేత ఒకరు బిజెపితో పొత్తు  ఉంటుందని అంటోంటే.. బిజెపి సీనియర్ నేత మాత్రం బి.ఆర్.ఎస్. తో పొత్తు ప్రసక్తే లేదంటున్నారు. నిప్పు లేందే పొగరాదన్నట్లు   తెరచాటున ఏదో ఒక చర్చ జరగనిదే  పొత్తుల మాట బయటకు రాదంటున్నారు రాజకీయ పండితులు.

వచ్చే ఎన్నికల్లో తెలంగాణాలో  భారతీజయ జనతా పార్టీతో  భారత రాష్ట్ర సమితి పొత్తు పెట్టుకుంటుందని  బి.ఆర్.ఎస్. నాయకుడు మాజీ మంత్రి మల్లారెడ్డి విద్యాసంస్థల అధినేత చేమకూర మల్లారెడ్డి  సంచలన వ్యాఖ్య చేశారు.  రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటులో భాగంగా మల్కాజగిరి నియోజక వర్గాన్ని బి.ఆర్.ఎస్. కు కేటాయిస్తారని మల్లా రెడ్డి  అన్నారు. అంతే కాదు మల్కాజగరి లోక్ సభ స్థానం నుంచే తన కుమారుడు భద్రారెడ్డి పోటీ చేస్తారని మల్లారెడ్డి  వివరించారు. మల్లా రెడ్డి వ్యాఖ్యలతో  అటు బిజెపితో పాటు ఇటు బిఆర్ఎస్ లోనూ   చర్చ మొదలైంది.

మల్లా రెడ్డి ఈ విధమైన వ్యాఖ్య చేస్తే  భారతీయ జనతా పార్టీ  ఎంపీ , మాజీ తెలంగాణా అధ్యక్షుడు  బండి సంజయ్  దీనికి పూర్తి విరుద్ధమైన ప్రకటన చేశారు.  ఎట్టి పరిస్థితుల్లోనూ భారత రాష్ట్ర సమితితో తమకి పొత్తు ఉండే ప్రసక్తే లేదని బండి సంజయ్ బల్లగుద్ది మరీ చెబుతున్నారు. పై పెచ్చు చాలా మంది బి.ఆర్.ఎస్. సీనియర్ నేతలు తమతో టచ్ లో ఉన్నారని ఆయన అంటున్నారు. త్వరలోనే వారంతా బిజెపి కండువాలు కప్పుకుంటారని సంజయ్ చెబుతున్నారు. తెలంగాణాలో రానున్న లోక్ సభ ఎన్నికల్లో బిజెపి ఎవరితోనూ పొత్తు  పెట్టుకోదని ..ఒంటరిగానే పోటీ చేసి క్లీన్ స్వీప్ చేస్తుందని బండి సంజయ్  అన్నారు.

బిజెపి-బి.ఆర్.ఎస్. మధ్య  పొత్తుకు సంబంధించి ఏదో ఒక స్థాయిలో చర్చ జరగనిదే మల్లారెడ్డి పొత్తు గురించి వ్యాఖ్యానించరని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. నిజానికి అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే బిజెపి-బి.ఆర్.ఎస్. ల మధ్య పొత్తు ఉండచ్చన్న ఒక వదంతి షికారు చేసింది. అయితే అది నిజం కాలేదు. ఇపుడు మరోసారి అటువంటి  చర్చే మొదలైంది. కాకపోతే ఈ సారి అది కేవలం ఊహాగానం కాదు. మాజీ మంత్రి స్థాయి నాయకుడు బహిరంగంగానే  బిజెపితో పొత్తు ఉంటుందని  స్పష్టం చేశారు కాబట్టి రెండు పార్టీల అగ్ర నాయకత్వాల మధ్య  ఏదో నడుస్తోందన్న అభిప్రాయం రాజకీయ పరిశీలకుల్లో నడుస్తోంది.

ప్రధాని నరేంద్ర మోదీ కొద్ది రోజుల క్రితమే  వచ్చేఎన్నికల్లో తమ టార్గెట్ కనీసం 400 స్థానాలని అన్నారు. అందులో బిజెపియే సొంతంగా 370 స్థానాలు గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే దక్షిణ భారతంలోనూ పొత్తులతో ముందుకు పోవాలని కమలనాథులు ఆలోచన చేస్తున్నట్లు అనుమానాలు వస్తున్నాయంటున్నారు రాజకీయ పండితులు. తెలంగాణాలో అసెంబ్లీ ఎన్నికల్లో బి.ఆర్.ఎస్. ఓటమి చెందడం..కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో  కాంగ్రెస్ కు చెక్ చెప్పాలంటే బి.ఆర్.ఎస్. తో తాము పొత్తు పెట్టుకుంటేనే మంచిదని  బిజెపి అగ్రనాయకులు భావిస్తున్నట్లు హస్తిన వర్గాల భోగట్టా. అయితే ఈ రెండు పార్టీలూ పొత్తు పెట్టుకుంటే  ప్రజలు ఎలా ఆదరిస్తారన్నది వేచి చూడాలంటున్నారు పరిశీలకులు.

బి.ఆర్.ఎస్.-బిజెపిలు పొత్తు పెట్టుకుంటే దాన్ని కాంగ్రెస్ పార్టీ  అడ్వాంటేజ్ గా తీసుకునే అవకాశాలున్నాయి. రెండేళ్లుగా తెలంగాణాలో  బిజెపి-బి.ఆర్.ఎస్. లు  నిత్యం విమర్శలు చేసుకుంటూ వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ లిక్కర్ స్కాంలో  బి.ఆర్.ఎస్. అధినేత కేసీయార్ తనయ కవితపై కేసు నమోదు చేశారు. అయితే అది కేవలం అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ది పొందేందుకే అని కాంగ్రెస్ పార్టీ అప్పట్లోనే ఆరోపించింది. బిజెపి-బి.ఆర్.ఎస్. లు తోడు దొంగలని విమర్శించింది. అటువంటిది ఇపుడు బిజెపి-బి.ఆర్.ఎస్. లు చేతులు కలిపితే  దాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకుపోయేందుక కాంగ్రెస్ సిద్ధంగా ఉంది.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి