రాయలసీమలో కొన్ని నియోజకవర్గాల్లో ఫ్యాక్షనిస్టు ముద్ర ఉన్న నేతలు పాతుకుపోయి ఉంటారు. అది వారి సొంత తనియోజకవర్గం కాకపోవచ్చు. కానీ ఊళ్లలో రెండు వర్గాల్లో ఒకదానికి మద్దతు ఇస్తూ.. లీడర్ గా మారిపోతారు. పాతుకుపోతారు. అలాంటి నియోజకవర్గాల్లో ఒకటి మంత్రాలయం. నియోజకవర్గం ఏర్పడ్డప్పటి నుంచి బాలనాగిరెడ్డి ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్నారు. టీడీపీలో ఉండి గెలిచారు.. వైసీపీలో చేరి గెలుస్తున్నారు, మరి ఈ సారి పరిస్థితి ఎలా ఉంది ? ఆయన పట్టు అంతే కొనసాగుతోందా ? సీఎం జగన్ టిక్కెట్ ఎందుకు ఖరారు చేయడం లేదు..?
2009 నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా మంత్రాలయం కొత్తగా ఏర్పాటైంది. ఎమ్మిగనూరు నియోజకవర్గం నుంచి మంత్రాలయం, పెద్దకడుబూరు, కోసిగి మండలాలతో పాటుగా ఆదోని సెగ్మెంట్ నుండి కౌతాళం మండలాన్ని కలిసి ఈ మంత్రాలయం నియోజకవర్గాన్ని ఏర్పాటు చేశారు. గతంలో ఆదోని నియోజకవర్గంగా ఉన్న ఈ ప్రాంతం.. 2009 నుంచి మంత్రాలయం ప్రత్యేక సెగ్మెంట్ గా మారింది. రాఘవేంద్రస్వామి ఆలయం నెలవై ఉన్న ప్రాంతం మంత్రాలయం. ఇక్కడ వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు వై.బాలనాగిరెడ్డి. నియోజకవర్గం ఏర్పడ్డప్పటి నుంచి బాలనాగిరెడ్డి హవానే కొనసాగుతోంది. 2009లో టీడీపీ తరపున, 2014, 2019లో వైసీపీ తరపున గెలిచారు. ఈ మంత్రాలయం సెగ్మెంట్ లో 60 శాతం బోయ కమ్యూనిటీకి చెందిన వారే ఉన్నారు. దాదాపు లక్షా 10 వేల మంది ఈ కమ్యూనిటీ వాళ్లున్నారు. అయితే ఈ సామాజికవర్గం నుంచి బలమైన నేత మాత్రం మంత్రాలయంలో లేకుండా పోయారు. దీంతో జనాభాలో డామినెంట్ గా ఉన్నా.. పొలిటికల్ పవర్ మాత్రం రెడ్డి సామాజిక వర్గం చేతుల్లో ఉంటోంది.
2019 ఎన్నికల్లో మంత్రాలయంలో వైసీపీ అభ్యర్థి వై.బాలనాగిరెడ్డి 55 శాతం ఓట్ షేర్ సాధించారు. అటు టీడీపీ నుంచి పోటీ చేసిన పాలకుర్తి తిక్కారెడ్డి 40 శాతం ఓట్లు రాబట్టారు. ఇతరులకు 5 శాతం ఓట్లు లభించాయి. వర్గ పోరాటం ఎక్కువగా ఉండే గ్రామాల్లో బాలనాగిరెడ్డి వర్గం ఆధిపత్యం చూపిస్తోంది. అలాగే తాను గెలిచినా పార్టీ ప్రతిపక్షంలో ఉండడంతో సరైన అభివృద్ధి చేయలేకపోయానని చెప్పి 2019లో బాలనాగిరెడ్డి ప్రచారం చేసుకున్నారు. దీంతో సానుభూతి ఓట్లన్నీ అటువైపే పడ్డాయి. వీటితో పాటే సోదరులు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీగా ఉండడం కూడా బాలనాగిరెడ్డికి బలం బలగం రూపంలో కలిసి వచ్చాయి. ఈ సారి ఆయన ప్రజలకు మాట ఇచ్చిన అభివృద్ధి విషయంలో అనుకున్న పనితీరు చూపించలేకపోయారు. మంత్రాలయం సెగ్మెంట్లో దారుణంగా రోడ్లు ఉన్నాయి. మండలాల నుంచి గ్రామాలకు వెళ్లడానికి అవస్థలు పడుతూంటారు. రాఘవేంద్ర స్వామి మఠానికి వెళ్లే రోడ్లు కూడా పాడైపోయాయి. అత్యధిక మంది కర్ణాటక భక్తులు వస్తారు. రోడ్లు సరిగ్గా లేకపోవడం వల్ల భక్తుల రాకపై ప్రభావం చూపుతోంది. సరైన హాస్పిటల్స్ లో సరైన మౌలిక వసతులు లేకపోవడం.. సరైన తాగు, సాగునీటి సౌకర్యాలు లేక ఇబ్బందులు సమస్యగా మారింది. అసలు మంత్రాలయం నియోజకవర్గంలో డ్రైనేజీనే ఉండదు.
వరుసగా డిపోతున్న టీడీపీ అభ్యర్థి పాలకుర్తి తిక్కారెడ్డి ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. గత రెండు ఎన్నికల్లో ఓడిన సానుభూతితో ఈ సారి గెలిచేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆపదలో ఉన్న వారికి ఆర్థిక సాయం అందిస్తూ ఉంటారు. వర్గ పోరాటంలో బాధితులకు అండగా ఉంటున్నారు. అయితే అధికారంలో ఉండటం వల్ల బాలనాగిరెడ్డి దూకుడుని తిక్కారెడ్డి తట్టుకోలేకపోతున్నారని అనుకోవచ్చు. గ్రామ ప్రాంతాల్లో ఫ్యాక్షనిజం గ్రూపుల్లో ఇప్పటికీ బాలనాగిరెడ్డి గట్టి పట్టు చూపిస్తున్నారు. ఇదే కుటుంబం నుంచి బాలనాగిరెడ్డి సోదరులు ఆదోని, గుంతకల్ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. మరొకరు ఎమ్మెల్సీగా ఉన్నారు. ఇంతటి స్ట్రాంగ్ సపోర్ట్ కుటుంబం నుంచి ఉంది. వీరిని కాదని గ్రామాల్లో వారు బయట తిరిగే పరిస్థితి ఉండదన్నట్లుగా రాజకీయం చేస్తారు. మంత్రాలయం మండలంలోని రామాపురం గ్రామం బాలనాగిరెడ్డి సొంతూరు. ఇక్కడ ఇతరులు అడుగు పెట్టాలన్నా భయపడాల్సిందే. ఓ సారి టీడీపీ అభ్యర్థి ప్రచారానికి వెళ్తే ఆయనపై కాల్పులు జరిగాయి.
అయితే ఈ సారి అంత ఏకపక్షంగా మంత్రాలం పోటీ ఉండదని అంచనాలు వస్తున్నాయి. దీనికి కారణం ప్రభుత్వంపై వ్యతిరేకత.. సిట్టింగ్ ఎమ్మెల్యేపై వ్యతిరేకత. అందుకే ఇంకా ఎమ్మెల్యేకు టిక్కెట్ ఖరారు చేయలేదు సీఎంజగన్. అధికారంలో ఉండీ ఎమ్మెల్యే ఏమీ చేయలేదన్న అసంతృప్తిలో వైసీపీ క్యాడర్ ఉంది. అదే సమయంలో బోయ కమ్యూనిటీపై ఎమ్మెల్యే వర్గం అణిచివేతకు పాల్పడిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో బోయ వర్గం నుంచి కొంత మంది నేతలు తెరపైకి వస్తున్నారు. వారు టీడీపీకి అనుకూలంగా ఉంటున్నారు. ఇలాంటి పరిణామాల్ని అనుకూలంగా మల్చుకోగలిగితే టీడీపీ పుంజుకునే అవకాశం ఉంటుంది. లేకపోతే మంత్రాలంయలో ఎలాంటి అభివృద్ధి లేకపోయినా ఫ్యాన్ గాలి వీచినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నది అక్కడి ప్రజల మాట…
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…