BRS కు అభ్యర్థులేరి ? -KCR-KTR -Lok Sabha Elections 2024 -MP Candidates

By KTV Telugu On 20 February, 2024
image

KTV TELUGU :-

బీజేపీ, కాంగ్రెస్ తరపున లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి నేతలు పోటీ పడుతున్నారు. కానీ బీఆర్ఎస్ టిక్కెట్ల కోసం ప్రయత్నిస్తున్న  వారే లేరు.  తమ కుమారులకు.. బంధువులకు ఇవ్వాలంటూ కొంత మంది ఒత్తిడి చేస్తున్నారు కానీ.. నిఖార్సైన నేతలు మాత్రం ఎవరూ బీఆర్ఎస్ టిక్కెట్లు అడగడం లేదు.  కేసీఆర్ అడిగిన వాళ్లు.. సిట్టింగ్ ఎంపీలు తమ దారి తాము చూసుకుంటున్నారు.  దీంతో  బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల్లో బలమైన అభ్యర్థుల్ని నిలబెట్టగలదా అన్న ప్రశ్న వస్తోంది.

తెలంగాణ ఉద్యమం ఊపందుకున్నప్పటి నుంచి బీఆర్ఎస్ కు ఎప్పుడూ అభ్యర్థుల సమస్య రాలేదు. ఒక స్థానానికి నలుగురు, ఐదుగురు పోటీ పడేవారు.  అభ్యర్థి ఎవరో చూడకుండా కారు గుర్తుకు ఓటేసే రాజకీయ వాతావరణం అప్పట్లో ఉండేది.  ఉన్నవారిలో బలమైన వారిని, పార్టీకి ఉపయోగపడేవారిని ఎంచుకుని టిక్కెట్లు ఇచ్చేవారు. అసెంబ్లీ ఎన్నికల వరకూ ఇదే జరిగింది. కానీ ఇప్పుడు ఒక్క సారిగా పరిస్థితి మారిపోయింది. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున పోటీ చేయడానికి ముందుకొచ్చే నేతలే లేరు. సిట్టింగ్ ఎంపీలు అందరూ దాదాపుగా సైడ్ అయిపోయారు. పోటీకి సిద్ధమని సంకేతాలు ఇస్తున్న వారు కనీస పోటీ ఇస్తారన్న నమ్మకం అధినేతకు కలగడం లేదు.

బీఆర్ఎస్‌లో ఎంపీ ఎన్నికల్లో పోటీ చేయగలరు అనుకున్న ఎవరూ  ఎవరూ పోటీకి సన్నాహాలు చేసుకోవడం లేదు.  పార్లమెంట్ ఎన్నికల నాటికి సిట్టింగ్ ఎంపీలు పార్టీలో ఉండే అవకాశాలు కనిపించడం లేదు.  సీటు ఇస్తామన్నా పోటీకి వెనుకాడుతున్నారు. ఇప్పటికే పార్టీలో పలువురు నేతలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపడంతో మిగిలిన ఎంపీల్లో ఎంతమంది ఉంటారు ఎంతమంది పార్టీ మారతారు అన్న చర్చ జోరుగా జరుగుతుంది.  అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత గులాబీ పార్టీని వీడిపోయే వారి సంఖ్య ఎక్కువైంది. లోక సభ ఎన్నికలు, గ్రేటర్ ఎన్నికలు టార్గెట్ గా అధికార కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న ఆపరేషన్ ఆకర్ష్ వైపు గులాబీ నేతలు ఆసక్తి చూపిస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో జాతీయ పార్టీల ఏజెండాతోనే ఎన్నికలు జరుగుతాయన్న అభిప్రాయంతో పార్లమెంట్ ఎన్నికల బరిలో జాతీయ పార్టీల నుంచి పోటీ చేసేందుకు గులాబీ నేతలు ఆసక్తి చూపిస్తున్నారు.

భారత రాష్ట్ర సమితికి ప్రస్తుతం 9 మంది సిట్టింగ్ ఎంపీలు ఉన్నారు. పెద్దపల్లి ఎంపీ నేతకాని వెంకటేష్ ఇప్పటికే హస్తం గూటికి చేరుకున్నారు.   చేవెళ్ల, జహీరాబాద్, ఖమ్మం,  మహబూబాబాద్ ఎంపీలు జాతీయ పార్టీలతో సంప్రదింపులు జరుపుతున్నారని  బీఆర్ఎస్ వర్గాలకు క్లారిటీ ఉంది.  మహబూబ్ నగర్ ఎంపీ సోదరుని తనయుడు హస్తం పార్టీలో చేరిపోవడంతో ఆస్థానంలో కూడా గులాబీ పార్టీ కొత్త నేతను వెదుక్కోవాల్సి ఉంది.  వరంగల్ ఎంపీ అభ్యర్థిగా బీఆర్ఎస్ ప్రతిపాదనలో ఉన్న టి రాజయ్య కూడా పార్టీ మారిపోయారు.  చేవెళ్లలో సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి ఉన్నా పోటీ చేస్తారా లేదా అన్నది కూడా సందేహాస్పదంగా ఉంది.

మల్కాజిగిరి నుంచి మల్లారెడ్డిని పోటీ చేయమంటే ఆయన తన కుమారుడికి చాన్సివ్వాలని కోరుతున్నారు. సికింద్రాబాద్ నుంచి తలసాని తన కుమారుడికి సీటు అడుగుతున్నారు. ఇలా వారసులకు ఇస్తే.. అసలు ప్రజలు లెక్కలోకి తీసుకోరని కేసీఆర్ ఆందోళన చెందుతున్నారు. నిజామాబాద్ నుంచి కూడా కొత్త అభ్యర్థిని ఎంపిక చేసుకోవాల్సి వస్తోంది. కరీంనగర్ లో పరిస్థితి బాగోలేకపోవడంతో వినోద్ కూమార్ కూడా వెనుకడుగు వేస్తున్నారని అంటున్నారు. ఒకప్పుడు కంచుకోట లాంటి ఆదిలాబాద్ లో ఇప్పుడు ఎంపీ స్థానానికి పోటీ చేయడానికి గట్టి అభ్యర్థి లేరు.  పార్టీలో కీలక నేతలు ఒక్కొక్కరు గుడ్ బై చెబుతుండడంతో…. వలసలకు ఎలా చెక్ పెట్టాలన్న యోచనతో పాటు అధికార కాంగ్రెస్ పార్టీకి బ్రేకులు వేయాలన్న లక్ష్యంగా గులాబీ బాస్ కేసీఆర్ దృష్టిసారించారని అందుకే పొత్తుల పుకార్లు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు.  కేసీఆర్ మెదక్ నుంచి  పోటీ చేస్తారని గతలో అనుకున్నారు కానీ ఇప్పుడు మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డి పేరు వినిపిస్తోంది. కవిత, కేటీఆర్, కేసీఆర్ ఎవరూ లోక్ సభ బరిలోకి దిగడం లేదు.

బలమైన అభ్యర్థుల్ని నిలబెట్టలేకపోతే  బీఆర్ఎస్ పరిస్తితి ఇబ్బందికరంగా మారుతుంది. ఎందుకంటే ఇప్పటికే అన్ని చోట్లా బీజేపీ, కాంగ్రెస్ తరపున అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అక్కడ పోటీకి ఎక్కువ మంది ఉన్నారు. బలమైన నేతలు ఉన్నారు. మహబూబ్ నగర్ వంటి చోట్ల  కాంగ్రెస్ నుంచి వంశీచంద్ రెడ్డి.. బీజేపీ నుంచి డీకే అరుణ, జితేందర్ రెడ్డి  ఎవరో ఒకరు పోటీ చేస్తారు.  ఇద్దరూ బలమైన నేతలే. కానీ బీఆర్ఎస్ తరపున చెప్పుకోవడానికి ఎవరూ లేరు. సిట్టింగ్ ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి కుటుంబ సభ్యులు కాంగ్రెస్‌లో  చేరిపోయారు. ఆయనకు రెండో సారి పోటీ చేసే ఆసక్తి లేదని చెబుతున్నారు. అదే పరిస్థితి జహీరాబాద్, నాగర్ కర్నూలు సహా ప్రధాన నియోజవర్గాల్లో ఉంది. కాంగ్రెస్ బలమైన అభ్యర్థుల్నే ఎంపిక చేసుకుంటోంది. చేవెళ్ల నుంచి కొండా విశ్వేశ్వర్ రెడ్డి వస్తారని అనుకున్నారు ఆయన రాకపోయే సరికి పట్నం మహేందర్ రెడ్డిని చేర్చుకున్నారు.

బీఆర్ఎస్‌కు లోక్ సభ ఎన్నికలు అత్యంత కీలకం. గత ఎన్నికల్లో సాధించినన్ని సీట్లు సాధిస్తే… పార్టీని కాపాడుకోవచ్చు. కానీ ఒకటి, రెండు సీట్లకు పరిమితమైతే మాత్రం వారినే కాదు.. అసలు పార్టీనే కాపాడుకోవడం కష్టమవుతుంది. అందుకే బీఆర్ఎస్ చీఫ్ తన రాజకీయ అనుభవానికి పదును పెడుతున్నారు.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి