పవన్ కళ్యాణ్ రేపో మాపో ఢిల్లీ వెళ్తారని ప్రచారం జరుగుతోంది. టిడిపి-బిజెపిల మధ్య వారధిగా ఉన్న పవన్ కళ్యాణ్ పొత్తుకోసం బిజెపి అగ్రనేతలను ఒప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈక్రమంలో ఇంచుమించు చివరి ప్రయత్నం చేయడానికే పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లనున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. టిడిపితో పొత్తుకు బిజెపి ఆసక్తి కనబర్చకపోవడంతో చంద్రబాబు నాయుడే పవన్ ద్వారా బిజెపి నాయకత్వంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు. అయితే ఈ సారి అయినా అది వర్కవుట్ అవుతుందా లేదా అన్నది చూడాలి.
పవన్ కళ్యాణ్ ఈ నెల 22 న ఢిల్లీ వెళ్తారట…బిజెపి అగ్రనేతలని కలిసి పొత్తులపై చర్చించి ఫైనలైజ్ చేస్తారట..ఇదీ జనసేన మీడియాకి ఇస్తున్న లీకులు..గత నెలలో కూడా ఇదే విధంగా జనసేన నేతలు మీడియాకి లీకులిచ్చారు. అయితే బిజెపి అగ్రనేతలు అపాయింట్ మెంట్ ఇవ్వకపోవడంతో ఆయన ఢిల్లీ వెళ్లలేదు. పవన్ ఢిల్లీ పర్యటనపై ఊహాగానాలు వస్తూనే ఉన్నాయి కానీ ఆయన మాత్రం ఢిల్లీ వెళ్లలేదు. ఇప్పటికే టిడిపి, జనసేన కలిసి పోటీ చేయడానికి సిద్దమవుతున్నాయి. ఇరు పార్టీల తరపున చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరూ కూడా రెండు, మూడు సార్లు కలుసుకుని పొత్తులపై చర్చించినప్పటికీ ఇంకా ఫైనల్ కాలేదు. పొత్తులపై క్లారిటీ రాకపోవడంతో పాటు రెండు పార్టీల నేతలు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తున్న తీరు ఇరు పార్టీల మధ్య గందరగోళానికి దారితీస్తోంది.
దీనికి తోడు చంద్రబాబు పొత్తు ధర్మాన్ని విస్మరించి అరకు, మండపేట టిక్కెట్లు ఏకపక్షంగా ప్రకటించడం జనసేనలో ప్రకంపనలు సృష్టించింది..దీనికి ప్రతిగా రాజానగరం, రాజోలు సీట్లలో జనసేన పోటీచేస్తుందని పవన్ ప్రకటించారు. కానీ కార్యకర్తలలో మాత్రం పవన్ ఉత్సాహాన్ని పెంచలేకపోతున్నారని పరిశీలకులు అంటున్నారు. కనీసం 60 స్ధానాలలో పోటీ చేయకపోతే భవిష్యత్ లో ప్రభుత్వ ఏర్పాటులో జనసేనకి ప్రాధాన్యత ఉండదని హరిరామజోగయ్య రాస్తున్న లేఖలు కూడా జనసేనలో చర్చనీయాంశమవుతున్నాయి. కానీ పవన్, చంద్రబాబు చర్చలలో మాత్రం జనసేన స్ధానాలు 25 కే పరిమితమవుతున్నాయనే విధంగా ఎల్లో మీడియాలో వస్తున్న వార్తలు జనసేనలో తీవ్ర ఆందోళనకి దారితీస్తోంది.
జననేన నేతలు త్యాగాలకి సిద్దం కావాలంటూ పవన్ చేస్తున్న వ్యాఖ్యలు కూడా క్యాడర్ ను నైరాశ్యానికి గురిచేస్తున్నాయి. 2014లో చంద్రబాబు కోసం పోటీ పెట్టలేదని..2019లో కూడా చంద్రబాబు కోసమే ఒంటరి పోరుతో నాటకమాడారని..ఇపుడు కూడా మళ్లీ అదే చంద్రబాబు కోసం తహతహలాడుతున్నారని కార్యకర్తలు వాపోతున్నారు. జనసేన పార్టీ ఏర్పాటు చేసి పదేళ్లు అయినప్పటికీ కూడా ఇప్పటికీ పార్టీకి సరైన విధానాలు రూపొందించుకోకపోతే చంద్రబాబు కోసమే జనసేన పుట్టిందనే వార్తలు నిజమవుతాయని కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పవన్ మూడురోజుల పాటు విశాఖలో పర్యటిస్తారని అనుకున్నా..అది కాస్తా ఒక్కరోజుకే పరిమితమైంది. అది కూడా అనకాపల్లి పార్లమెంట్ సీటు నుంచి తన సోదరుడు నాగబాబు పోటీచేస్తారని క్యాడర్ సహకరించాలని చెప్పడానికే ఈ సమీక్షలు నిర్వహించారని తెలుస్తోంది. వాస్తవానికి అనకాపల్లి ఎంపి స్ధానం నుంచి పోటీ చేయాలంటూ మాజీ మంత్రి కొణతాల రామకృష్ణని జనసేనలో చేర్చుకున్నారు. ఇప్పుడు ఆయనకు హ్యాండిచ్చారు. ఈ నేపధ్యంలోనే పవన్, నాగబాబు సమీక్షలకి కొణతాల డుమ్మా కొట్టినట్లు సమాచారం. దీనికి తోడు విశాఖ జిల్లాలో జనసేన పోటీ చేసే కొన్ని స్ధానాలను ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతున్నప్పటికీ చంద్రబాబు ఓకే అనకుండా మనకు ఎలా ఖరారవుతాయని జనసేన నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే జనసేన అధ్యక్షుడు పవన్ ప్రకటించిన రాజానగరం, రాజోలు స్ధానాలలో కూడా టిడిపి కలిసి రావడం లేదని చెబుతున్నారు. ఇలా పలు చోట్ల రెండు పార్టీల మధ్య పెరుగుతున్న టిక్కెట్ల వివాదాలు జనసేనలో గందరగోళానికి దారితీస్తున్నాయి.
టీడీపీ, జనసేన పార్టీల మధ్య వ్యవహారం ఇలా ఉంటే..విశాఖ పర్యటనలో జనసేన కార్యకర్తలతో త్యాగాలకి సిద్దంగా ఉండాలంటూనే టిడిపితో పొత్తు బిజెపికి ఇష్టం లేదని..తానే ఒప్పించానని చెప్పడం ద్వారా క్యాడర్ చేజారిపోకుండా చూసుకునే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబుని గట్టెక్కించడం కోసం పవన్ పడుతున్న పాట్లు జనసేన పార్టీని నిలుపుకోవడానికి చేసుంటే బాగుండేదని వ్యాఖ్యలు పార్టీలో విన్పిస్తున్నాయి. ఈ నేపధ్యంలో బిజెపి అగ్రనేతల అపాయింట్ మెంట్ ఖరారు కాకుండానే పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్తున్నారని లీకులివ్వడం వెనుక అర్ధమిదే అంటున్నారు…
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…