తెలంగాణ రాజకీయాల్లో ఏదో జరుగుతోంది. అది కూడా స్థానిక బీజేపీ నేతలు అనుమానించిందే జరుగుతోందన్న ఫీలింగు వస్తోంది. పైగా ఇప్పుడు మరో సమస్య ఎదురవుతోంది. బీజేపీ తెలంగాణ శాఖకు అంత సీన్ ఉందా.. లేక మొత్తం అధిష్టానమే చూసుకుంటుందా అన్నది ఇప్పుడు పెద్ద అనుమానం …..
ఒక చిన్న వార్తను అలా వదలుతారు. దాన్ని జనంలో నానే విధంగా చూసుకుంటారు. తర్వాత అవునని కొందరు, కాదని మరికొందరు చర్చలు పెట్టేస్తారు. అప్పుటికి కథ కాకమీదకు వస్తుంది. ఇక కార్యాచరణ మొదలు పెట్టి పని కానిచ్చేస్తారు. ఈ లోపు వ్యతిరేకవర్గాన్ని దారికి తెచ్చే ప్రక్రియ కూడా పూర్తవుతుంది. రాజకీయ పార్టీల్లో నిత్యం జరిగే తంతు ఇదే. ఇప్పుడు బీజేపీ, బీఆర్ఎస్ పొత్తు విషయంలోనూ అదే సీక్వెన్స్ జరుగుతోందనిపిస్తుంది. బీజేపీ, బీఆర్ఎస్ పొత్తుకు బీజం పడిందని తొలి సోషల్ మీడియాలో గాలికబురు లాంటింది ఒకటి వదిలి చూశారు.కాంగ్రెస్ ను నిలువరించేందుకు ఇదొక్కటే మార్గమన్నట్లుగా మాట్లాడారు. ఉమ్మడి శత్రువును దెబ్బకొట్టేందుకు, దక్షిణాదిన మోదీ నాయకత్వాన్ని బలోపేతం చేసేందుకు ఈ ప్రక్రియ చాలా అవసరమని ప్రచారం చేశారు వెంటనే బీజేపీలోని ఒక వర్గం దాన్ని వ్యతిరేకిస్తూ ప్రెస్ మీట్లు పెట్టింది. కొందరైతే తిట్ల దండకం అందుకున్నారు. సిగ్గు లేకుండా కేసీఆర్ తమ దగ్గరకు ఎలా వస్తారని ప్రశ్నించిన వాళ్లూ ఉన్నారు. తెలంగాణలో మోదీని ఆహ్వానించేందుకు ఇష్టపడని కేసీఆర్ ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని వస్తారని నిలదీశారు. కాళ్లబేరానికి వచ్చిన బీఆర్ఎస్ ను ఎన్డీయేలో చేర్చుకునేది లేదని బీజేపీ రాష్ట్ర శాఖ అద్యక్షుడు కిషన్ రెడ్డి తేల్చేశారు…
క్షేత్రస్థాయిలో ఆడుతున్న గేమ్ ఒకటి.తెరవెనుక జరుగుతున్నదొక్కటీ అన్న అనుమానాలు బలపడుతున్నాయి. ప్రస్తుతానికి దక్షిణాది పార్టీగా మిగిలిపోయిన కాంగ్రెస్ పార్టీని కర్ణాటక, తెలంగాణలో కూడా దెబ్బకొట్టేందుకు బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. ఆ దిశగానే కేసీఆర్ హమారా దోస్ హై అంటూ బీజేపీ నేతలు చెప్పుకుంటున్నారు. పరిణామాలు వేగంగా మారేందుకు ఎక్కువ సమయం లేదని కూడా అర్థమైపోయింది….
దక్షిణాది విస్తరణ మోదీకి ఎంత అవసరమో… తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని కాపాడుకోవడం కేసీఆర్ కు అంతే అవసరం. లోక్ సభ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ… కొందరు నేతలు జారిపోతున్నారన్న బెంగ కేసీఆర్ కు ఉంది. ఈ క్రమంలో సిట్టింగ్ ఎంపీ వెంకటేశ్ నేత హస్తం గూటికి చేరారు. రాష్ట్రంలో బీఆర్ఎస్కు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. ఇక రామమందిరం విషయంలో బీజేపీకి ప్రజల్లో కొంత సానుకూల పవనాలు వీస్తున్నాయి. ఈ క్రమంలో ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటే గట్టెక్కొచ్చని కేసీఆర్ భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది. అందుకే నిన్నటి వరకూ బీజేపీపై తిట్ల పురాణం అందుకున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. ఇప్పుడు ప్రధాని మోదీతో స్నేహానికి నయా ప్లాన్ రచిస్తున్నారు. రాష్ట్రంలో అధికారం కోల్పోవడం.. కేంద్రంతో సఖ్యత లేకపోతే మొదటికే మోసం వస్తుందని భావించి ఫ్రెండ్లీ రిలేషన్స్ కోసం ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు సమాచారం. అందుకోసం పీఎం మోదీతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా అపాయింట్మెంట్ అడిగినట్లు విశ్వసనీయ సమాచారం. దీనిపై రెండు మూడు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ నెల 22 తర్వాత కేసీఆర్ ఎప్పుడైనా ఢిల్లీ వెళ్లనున్నట్లు తెలిసింది. పార్లమెంటు ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో కేసీఆర్ టూర్ బీఆర్ఎస్లో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే అజెండా సిద్ధమైనట్లు చెబుతున్నారు. సీట్ల సర్దుబాటుపై కేసీఆర్ ఒక ప్లాన్ రూపొందినట్లు తెలిసింది. బీజేపీ బలహీనంగా ఉన్న లోక్ సభా నియోజకవర్గాలను తాము తీసేసుకుని, కమలం బలంగా ఉన్న చోట్ల వారినే పోటీ చేయనిస్తామని చెబుతున్నారు. దీని వల్ల ఓట్ల విభజనలో బీఆర్ఎస్ కు కూడా ప్రయోజనం కలగొచ్చని, కాంగ్రెస్ పై కసి తీర్చుకోవచ్చని అంచనా వేస్తున్నారు..
బీఆర్ఎస్ తో పొత్తును తెలంగాణ కాంగ్రెస్ లో కొందరు నేతలు వ్యతిరేకిస్తున్న మాట నిజం. అయితే జాతీయ పార్టీల్లో అధిష్టానం మాటే నెగ్గుతుంది. అధిష్టానం ఆదేశిస్తే రాష్ట్ర నేతలు పాటించడం తప్ప వేరు గత్యంతరం ఉండదు.మరి ఇప్పుడు ఏం జరుగుతుందో చూడాలి. పొత్తు కుదిరితే బీజేపీలో ఎవరైనా అలుగుతారా అన్నది పెద్ద ప్రశ్న…
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…